ఆన్‌లైన్‌లో ఆకతాయిల వేధింపులకు చెక్.. మెటా కొత్త టూల్!
ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాలు (Social Media) కీలక పాత్ర పోషిస్తున్నాయి. భావ వ్యక్తీకరణకు మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు వంటి వాటిని ఇతరులకు తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. వీటిని ఉపయోగించే వారిలో ఎక్కువ మంది యువతే.
ఈ క్రమంలో వారు షేర్ చేసే ఫొటోలతో కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో అవమానభారంతో పలువురు యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారిని క్షోభకు గురిచేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా మెటా (Meta) కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టేక్ ఇట్ డౌన్ (Take It Down) పేరుతో పరిచయం చేసిన ఈ టూల్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న యూజర్లకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు/వీడియోలను తొలగించవచ్చు. అంతేకాకుండా గతంలో అప్‌లోడ్ చేసిన ఫొటోలు/వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం ఈ టూల్ అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) ఈ టూల్‌ను నిర్వహిస్తుంది. ఎవరైనా యూజర్లు తమ వ్యక్తిగత ఫొటోలు అభ్యంతరకర రీతిలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నట్లు గుర్తిస్తే.. వాటిని ఎన్‌సీఎమ్‌ఈసీకి సబ్‌మిట్ చేయాలి. వాటిని హ్యాష్-మ్యాచింగ్ టెక్నాలజీ సాయంతో గుర్తించి తొలగిస్తుంది. ఒకవేళ తిరిగి వాటిని అప్‌లోడ్ చేయాలని ప్రయత్నించినా.. టేక్ ఇట్ డౌన్ అడ్డుకుంటుంది.
ప్రస్తుతం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లతోపాటు మైండ్‌గీక్ (Mindgeek)కు చెందిన యూబో (Yubo), ఓన్లీఫ్యాన్స్ (OnlyFans) వంటి వాటి నుంచి తొలగిస్తుంది. యువత, పిల్లలపై ఆన్‌లైన్ లైంగిక వేధింపులు (Sextortion) పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు టేక్ ఇట్ డౌన్‌ను ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది. భవిష్యత్తులో ఈ టూల్‌ను యూజర్లు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దాలని మెటా భావిస్తోంది. అలానే ఈ ఫీచర్‌ను త్వరలో అన్ని దేశాలకు పరిచయం చేస్తామని మెటా తెలిపింది.
Mar 01 2023, 08:30