కేసీఆర్ ఒక్కరే కాదు.. ప్రజల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది: ప్రొ.కోదండరామ్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM Kcr) ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని.. రాష్ట్ర ప్రజల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలంగాణ జనసమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) అన్నారు. చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (Telangana bachao) సదస్సును నిర్వహించనున్నట్లు కోదండరామ్ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దిల్లీ మద్యం కుంభకోణం చూస్తే ఈ ప్రభుత్వం అధికారాన్ని ఎలా వాడుకుందో అర్థమవుతుంది. ఒకే కుటుంబం దిల్లీ స్థాయిలో ఈ కుంభకోణం ద్వారా వాటాలు పొందాలని చూసింది. భారత్ రాష్ట్ర సమితి (భారాస) నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగ పడుతుంది. భూ ఆక్రమణలతో కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటుంది. సీఎం కేసీఆర్ రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారు. దిల్లీలో అత్యంత ప్రజాస్వామ్య వాదిగా.. తెలంగాణలో నియంతృత్వ వాదిగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది.
మిలియన్ మార్చ్.. తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’ అని కోదండరామ్ పేర్కొన్నారు.
Feb 28 2023, 18:00