కేసీఆర్‌ ఒక్కరే కాదు.. ప్రజల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది: ప్రొ.కోదండరామ్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ (CM Kcr) ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని.. రాష్ట్ర ప్రజల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలంగాణ జనసమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ (Professor Kodandaram) అన్నారు. చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (Telangana bachao) సదస్సును నిర్వహించనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దిల్లీ మద్యం కుంభకోణం చూస్తే ఈ ప్రభుత్వం అధికారాన్ని ఎలా వాడుకుందో అర్థమవుతుంది. ఒకే కుటుంబం దిల్లీ స్థాయిలో ఈ కుంభకోణం ద్వారా వాటాలు పొందాలని చూసింది. భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగ పడుతుంది. భూ ఆక్రమణలతో కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటుంది. సీఎం కేసీఆర్‌ రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారు. దిల్లీలో అత్యంత ప్రజాస్వామ్య వాదిగా.. తెలంగాణలో నియంతృత్వ వాదిగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది.

మిలియన్ మార్చ్.. తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’ అని కోదండరామ్‌ పేర్కొన్నారు.

కుష్బూ కు చిరు శుభాకాంక్షలు

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎంపికైన నటి బిజెపి నేత కుష్బూకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు.

కచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా సభ్యురాలిగా మహిళల సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తారని ఆశిస్తున్నాను.

ఇప్పుడు మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుందని చిరు పేర్కొన్నారు.

హస్తినలో బీజేపీ నేతలు..

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు.

ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్ సహా.. హాస్తినలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజగోపాలరెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి, విజయశాంతి, వివేక్ తదితరులున్నారు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్.. లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకులకు బీజేపీ అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంతో కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది..

రాజాసింగ్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం మార్పిడి

గోషామహల్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం మరో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. తనకిచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు తరచు మొరాయిస్తోందని పలుమార్లు ఆయన సీఎం కేసీఆర్‌, డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాత వాహనాన్ని ఇటీవలే ప్రగతిభవన్‌కు తీసుకువెళ్లి అక్కడే వదిలిపెట్టి వచ్చారు.

ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పోలీసులు సోమవారం వేరే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చారు. అది 2017 మోడల్‌ది కావడం గమనార్హం. వాహనం కేటాయింపుపై ఎమ్మెల్యే స్పందించారు. ‘‘ప్రస్తుతం నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాను.

తెలుపు రంగు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ధూల్‌పేటలోని మా ఇంటికి తీసుకువచ్చి వదిలి వెళ్లినట్లు తెలిసింది. ఇంటికి వెళ్లాక ఆ వాహనం కండిషన్‌ ఎలా ఉందో తెలుసుకుంటా. నాకు కొత్త కారే కావాలని ఏమీ లేదు. మంచి కండిషన్‌లో ఉన్న వాహనం అయితే చాలు’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టీకరించారు.

Teachers MLC: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. బరిలో 21మంది అభ్యర్థులు

హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తంగా 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా, నిర్ణీత సమయంలోపు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఎవరూ ఉపసంహరించుకోలేదు.

దీంతో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం..

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ స్థానానికి ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో ఒక నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో మజ్లిస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్‌ మాత్రమే బరిలో ఉన్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రహమాత్ బేగ్‌కు ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

MLC Election: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ (AP) లో 7 స్థానాలకు, తెలంగాణ (Telangana)లో 3 మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

తెలంగాణలో నవీన్‌ రావు, గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అలాగే ఏపీలో నారా లోకేశ్‌, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్య నారాయణ పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవనున్న ఈ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్‌ : మార్చి 6

నామినేషన్ల స్వీకరణ : మార్చి 13 వరకు

నామినేషన్ల పరిశీలన : మార్చి 14

పోలింగ్‌, కౌంటింగ్‌ : మార్చి 23

బైరి నరేష్ పుంగి బజాయించిన అయ్యప్ప భక్తులు

బైరి నరేష్ పై మరోసారి దాడి!

అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ పై వరంగల్ లో దాడి చేశారు హిందూ సంఘ కార్యకర్తలు.

గతంలో అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల ముందు బైరి నరేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కొడంగల్ కోర్టు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పై బయటికి వచ్చిన నరేష్ మరోసారి అయ్యప్ప పుట్టుకకు సంబంధించిన ఆధారాలు నాకు కావాల్సిందే అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆగ్రహించిన హిందూ సంఘాల కార్యకర్తలు తాజాగా వరంగల్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన బైరి నరేష్ పై మరోసారి దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బైయిల్ పై విడుదల అయ్యాడు బైరి నరేష్. విడుదల అయిన తర్వాత కూడా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తనకు అయ్యప్ప పుట్టుకకు గల ఆధారాలు కావాల్సిందే అని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బైరి నరేష్. దాంతో ఈ అనుచిత వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలోనే వరంగల్ లోని ఆదర్శ లా కాలేజ్ లో ఓ కార్యక్రమానికి హాజరైన బైరి నరేష్ పై హిందూ సంఘ కార్యకర్తలు దాడికి దిగారు. కార్యక్రమాన్ని ముగించుకుని పోలీస్ వాహనంలో వస్తున్న బైరి నరేష్ పై హిందూ సంఘ నాయకులు దాడికి దిగారు. బైరి నరేష్ ను వెంబడించి, అతడి బట్టలు చింపి పరిగెత్తించి కొట్టారు హిందూ కార్యకర్తలు. తనకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని బైరి నరేష్ పోలీసులకు విన్నవించుకున్నట్లు సమాచారం..

Khushbu Sundar: ఖుష్బుకు కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ: తమిళనాడు భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌(Khushbu Sundar)కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి(National Commission for Women)గా నామినేట్ చేశారు.

దక్షిణాదిలో నటిగా పాపులర్ అయిన ఆమె వందకు పైగా తమిళ సినిమాల్లో నటించారు. రాజకీయాలంటే ఆసక్తి ఉండటంతో 2010లో ఆమె డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత హస్తం పార్టీలో చేరారు. 2020 వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడి బొమ్మలున్న చీర ధరించడం ద్వారా అప్పట్లో కలకలం రేపారు. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంస్థలు రచ్చ చేశాయి కూడా.

ఖుష్బూ సుందర్‌ కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. బాగా మాట్లాడతారని పేరు తెచ్చుకున్న ఖుష్బూ సుందర్‌ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. మహిళల సమస్యలపై మరింత ఫోకస్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఖుష్బూ అంటున్నారు. మహిళల జోలికి రాజకీయ పార్టీల నేతలు వస్తే ఊరికునేది లేదని ఆమె హెచ్చరించారు.

సీబీఐ కస్టడీకి దిల్లీ డిప్యూటీ సీఎం

దిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్టయిన దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు రౌస్ అవెన్యూ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది.

సిసోదియాను మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. మద్యం కుంభకోణం కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చింది.

ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనను నిన్న సీబీఐ అదుపులోకి తీసుకుంది.

మారకద్రవ్యాల నుండి యువతను కాపాడుదాం

•PYL మండల మహాసభలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్

ప్రగతిశీల యువజన సంఘం (PYL)మోతే మండల ప్రధమ మహాసభ రాయిపాడు గ్రామంలో కోడి లింగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముందుగా బిగిపిడికిలి జెండాను పీవైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య ఆవిష్కరించారు. ఈ మహాసభను ప్రారంబిస్తూ ఐఎఫ్ టి యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడారు.

అనంతరం జరిగిన మహాసభలో ముఖ్య అతిథిగా పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో యువత మద్యం, గంజాయి,గుట్కా, మారకద్రవ్యాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు గురై జీవితాలను కోల్పోతున్నారని, ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందిందని దుయ్యబెట్టారు.

ఎంజీఎం మెడికల్ కళాశాలలో ప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రీతి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. విద్యాసంస్థలలో డ్రగ్స్, గంజాయి, మారక ద్రావవ్యాలను విక్రయిస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "షి" టీములు "షో" టీములుగానే మారినాయని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో యదేచ్ఛగా సాగుతున్న మద్యం, గంజాయి గుట్కా తదితర మారక ద్రవ్యాలను నిషేధించాలని, షి టీoలను వివిధ కళాశాలలో నిరంతరం ఉంచాలని డిమాండ్ చేశారు.

ఐఎఫ్ టి యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు నిరుద్యోగులను గాలికి వదిలేసారని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు. 26 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటివరకు భారీ నోటిఫికేషన్ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని, దేశంలో కోటి ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ ప్రభుత్వం హిందుత్వం ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు, బహుళ జాతి సమస్యలకు అప్పనంగా కట్టబెట్టి ప్రజలను మభ్యపెడుతున్నదని బియ్యబట్టారు. వెంటనే దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతిశీల యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నల్లగొండ నాగయ్య, కునుకుంట్ల సైదులు, జిల్లా నాయకులు వీరబోయిన రమేష్, భువనగిరి గిరిబాబు, ధరావత్ రవి, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, కోట్ల మధుసూదన్ రెడ్డి, ఎర్రబోయిన లింగయ్య, ఎర్రబోయిన పుల్లయ్య, భానోత్ శ్రీకాంత్, ఎర్ర ఎంకన్న, ఇరుగు మల్లయ్య, గుణగంటి నాగరాజు, కోడి లింగరాజు, నాగరాజు తదితరులు హాజరయ్యారు.