Teachers MLC: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. బరిలో 21మంది అభ్యర్థులు
హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తంగా 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా, నిర్ణీత సమయంలోపు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఎవరూ ఉపసంహరించుకోలేదు.
దీంతో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం..
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ స్థానానికి ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో ఒక నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో మజ్లిస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ మాత్రమే బరిలో ఉన్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రహమాత్ బేగ్‌కు ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
Feb 28 2023, 07:23