మేఘాలయ, నాగాలాండ్‌లలో నేడే ఎన్నికలు
షిల్లాంగ్, కోహిమా: ఈశాన్య భారత్‌లోని నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి. అయితే నాగాలాండ్‌లో ఒక స్థానం (అకులుటో) ఎన్నిక ఏకగ్రీవం కాగా, మేఘాలయలో ఓ అభ్యర్థి (సోహియాంగ్ స్థానంలో) మరణించారు.
ఫలితంగా సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ 59 స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), భాజపా పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్, ఎన్‌పీపీ, ఎన్సీపీ, జేడీయూల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు- మేఘాలయలో 369 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
రాష్ట్రంలో 21.6 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారికోసం 3,419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.
35 మంది ఓటర్ల కోసం..
మేఘాలయలోని పలు ప్రాంతాల్లో అధికారులు తీవ్ర ఇబ్బందులను అధిగమించిమరీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చాలాచోట్ల వారు వాగులు, నదులు, కొండలు, లోయలు దాటాల్సి వచ్చింది. గంటల కొద్దీ కాలినడకన వెళ్లక తప్పలేదు. అమ్లారెమ్ నియోజకవర్గ పరిధిలోని కామ్సింగ్ పోలింగ్ కేంద్రం పరిధిలో 35 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సిబ్బంది పడవ సాయంతో నదిని దాటి అక్కడికి చేరుకున్నారు.
Feb 27 2023, 07:46