Narendra Modi: మాకు మోదీ కావాలి.. పాకిస్థానీ వీడియో వైరల్
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో పాకిస్థాన్(Pakistan) అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. పెరుగుతోన్న నిత్యావసర, ఇంధన ధరలు (Petrol Price), రాయితీల్లో కోత వంటివి స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ పరిస్థితులపై ఓ స్థానికుడు స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. 'షరీఫ్ వద్దు.. ఇమ్రాన్ వద్దు.. మాకు ప్రధాని మోదీ (Narendra Modi) కావాలని.. ఆయనే దేశ పరిస్థితులను చక్కదిద్దగలర'ని అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఓ పాకిస్థానీ యూట్యూబర్ తీసిన వీడియో (Viral Video)లో.. అతను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. 'పాక్ నుంచి ప్రాణాలతో పారిపోండి. భారత్‌లోకి అయినా సరే అనే నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ఓ స్థానికుడిని యూట్యూబర్ ప్రశ్నించగా.. అతను వాస్తవమేనని పేర్కొన్నాడు. దేశ విభజన జరగకుండా.. రెండు దేశాలు కలిసి ఉంటే ఈరోజు తాము కూడా భారత్ మాదిరే సరసమైన ధరలకే సరుకులు, ఇంధనం కొనుగోలు చేసేవాళ్లమని తెలిపాడు. రాత్రిపూట పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి ఉంటే ఇక్కడి ఉండి ఏం లాభమని వాపోయాడు. పాకిస్థానీయులు తమను భారత్‌తో పోల్చుకోవడం మానుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ రెండు దేశాల మధ్య ఏ విషయంలోనూ పోలిక లేదని వ్యాఖ్యానించాడు. పాక్‌ను గట్టెక్కించగలిగేది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని అతను పేర్కొన్నాడు. 'మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్, ముషారఫ్‌లు అవసరం లేదు. మాకు కేవలం ప్రధాని మోదీ కావాలి. పాక్‌లోని అన్ని వ్యవహారాలను ఆయన సరిదిద్దగలరు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాక్ ఆ దేశం దారిదాపుల్లో కూడా లేదు' అని చెప్పాడు. మోదీ పాలనలో జీవించేందుకు సిద్ధమేనని చెబుతూ.. 'మోదీ గొప్ప వ్యక్తి. చెడ్డవాడు కాదు. భారతీయులు సరసమైన ధరలకే టమాటా, చికెన్, పెట్రోల్ వంటివి పొందుతున్నారు. మోదీ మాకు కావాలి. ఆయన పాక్‌ను పాలించేలా, బాగు చేసేలా చేయాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా' అని అన్నాడు.
Feb 24 2023, 10:35