Narendra Modi: మాకు మోదీ కావాలి.. పాకిస్థానీ వీడియో వైరల్‌
ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో పాకిస్థాన్‌(Pakistan) అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. పెరుగుతోన్న నిత్యావసర, ఇంధన ధరలు (Petrol Price), రాయితీల్లో కోత వంటివి స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ పరిస్థితులపై ఓ స్థానికుడు స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. 'షరీఫ్‌ వద్దు.. ఇమ్రాన్‌ వద్దు.. మాకు ప్రధాని మోదీ (Narendra Modi) కావాలని.. ఆయనే దేశ పరిస్థితులను చక్కదిద్దగలర'ని అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఓ పాకిస్థానీ యూట్యూబర్‌ తీసిన వీడియో (Viral Video)లో.. అతను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. 'పాక్‌ నుంచి ప్రాణాలతో పారిపోండి. భారత్‌లోకి అయినా సరే అనే నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ఓ స్థానికుడిని యూట్యూబర్‌ ప్రశ్నించగా.. అతను వాస్తవమేనని పేర్కొన్నాడు. దేశ విభజన జరగకుండా.. రెండు దేశాలు కలిసి ఉంటే ఈరోజు తాము కూడా భారత్‌ మాదిరే సరసమైన ధరలకే సరుకులు, ఇంధనం కొనుగోలు చేసేవాళ్లమని తెలిపాడు. రాత్రిపూట పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి ఉంటే ఇక్కడి ఉండి ఏం లాభమని వాపోయాడు. పాకిస్థానీయులు తమను భారత్‌తో పోల్చుకోవడం మానుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ రెండు దేశాల మధ్య ఏ విషయంలోనూ పోలిక లేదని వ్యాఖ్యానించాడు. పాక్‌ను గట్టెక్కించగలిగేది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని అతను పేర్కొన్నాడు. 'మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు అవసరం లేదు. మాకు కేవలం ప్రధాని మోదీ కావాలి. పాక్‌లోని అన్ని వ్యవహారాలను ఆయన సరిదిద్దగలరు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాక్‌ ఆ దేశం దారిదాపుల్లో కూడా లేదు' అని చెప్పాడు. మోదీ పాలనలో జీవించేందుకు సిద్ధమేనని చెబుతూ.. 'మోదీ గొప్ప వ్యక్తి. చెడ్డవాడు కాదు. భారతీయులు సరసమైన ధరలకే టమాటా, చికెన్‌, పెట్రోల్‌ వంటివి పొందుతున్నారు. మోదీ మాకు కావాలి. ఆయన పాక్‌ను పాలించేలా, బాగు చేసేలా చేయాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా' అని అన్నాడు.
నేడు మార్చి నెల వర్చువల్‌ సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన వర్చువల్‌ సేవా టికెట్లను

తితిదే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.

ఇందులో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, సంబంధిత దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తుంది.

రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నాతో పెట్టుకోకు

భద్రాద్రికొత్తగూడెం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘హాత్ సే హాత్ జోడో’’ పాదయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేగా కౌంటర్ అటాక్‌కు దిగారు.

గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకు’’ అంటూ హెచ్చరించారు. పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించినట్లు తెలిపారు. ఇక్కడ బలంగా ఉందంటే తానే కారణమని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం ఉన్నది తానొక్కడినే అని ఆయన తెలిపారు.

‘‘గిరిజనుడిని అనే అక్కసుతో నన్ను తొలగించిన వీళ్లా... నా గురించి మాట్లాడేది. తెలంగాణా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు... నేను రాజ్యాంగ బద్దంగా విలీనమయ్యాను. ఓటుకు నోటు కేసులో ఉన్న వీళ్లా నాగురించి మాట్లాడేది. నామీద చార్జ్‌షీట్.. నీకు దమ్ముంటే ఎవరైనా రండి.. 300 ఎకరాలు నేను ఆక్రమించినట్టు రుజువు చేయండి.. ముక్కు నేలకు రాస్తా’’ అంటూ సవాల్ విసిరారు. రేవంత్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని... అన్ని స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాపై వేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే అసలు పోటీ నుంచే తప్పుకుంటానని రేగా కాంతారావు స్పష్టం చేశారు..

ఘోరం: తనను చూసి నవ్వారని.. నిలబెట్టి ఏడుగురిని చంపేశాడు..!

బ్రెజిల్‌ (Brazil)లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయిన తనను చూసి నవ్వారని.. ఓ వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కాల్పులు (Gun Firing) జరిపాడు.

ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్‌ నగరానికి చెందిన ఎడ్గర్‌ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్‌ హాల్‌ (Pool Hall)కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్‌ (బ్రెజిల్‌ కరెన్సీ)కు పందెం కాసి పూల్‌ గేమ్‌ (Pool Game)లో ఓడిపోయాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్‌ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు.

దీంతో కోపోద్రిక్తులైన ఒలివిరా, అతడి స్నేహితుడు దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా.. ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పూల్‌ యజమాని సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Guntur: ఐటీ అధికారులమంటూ డబ్బు, బంగారంతో పరారీ.. గుంటూరులో ఘరానా మోసం

గుంటూరు: ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో గురువారం ముగ్గురు వ్యక్తులు వచ్చారు..

తాము ఐటీ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లించకుండా భారీగా బకాయి ఉన్నారంటూ ఆస్తిపత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తింపు కార్డులు చూపించాలని కల్యాణి నిలదీయడంతో ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు తీసుకుని ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. వెంటనే బాధితురాలు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విమానాశ్రయాల మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అభివృద్ధి పనులకు 720 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విమానాశ్రయాలు ఉండే విధంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దశలో అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 720 కోట్ల రూపాయలను కేటాయించింది ఆ నిధులతో శరవేగంగా పనులు సాగుతున్నాయి.

2025 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో కేంద్రం పని చేస్తుంది. ప్రయాణికులు బయటకు రావడానికి లోనికి వెళ్లడానికి ప్రత్యేకంగా వేరే వేరే లిఫ్టులు ఎక్స్ లెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలం విశ్రాంతి భవన నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రయాణికుల నీటి వినియోగం కోసం ఫోర్ జి ఎల్ ఆర్ పైపులతో నిర్మాణం చేపడుతుంది.

ప్రయాణికుల రాకపోకల సంబంధించిన విషయమై ప్లాన్ మార్పులు చేపడుతున్నారు. స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తుల కొరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. 40 ఏళ్ల అవకాశాలకు అనుగుణంగా డిజైన్ రూపకల్పన చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు అత్యధిక భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు.

2025 నాటికి ఈ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది...

తెలంగాణ గురుకులాల్లో పురుగుల అన్నం:బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం పురుగుల అన్నం తింటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారలేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, వాటి పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ లోకమంతా ఏవీఎన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేయేనని ఆమె స్పష్టం చేశారు. విద్యావంతులు, ఉపాధ్యాయులు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి అండగా నిలవాలని ఆమె కోరారు. ఏవీఎన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా తీసిన ర్యాలీలో డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు పాల్గొన్నారు.

kanna Laxminarayana: తెదేపాలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna Laxminarayana) తెలుగుదేశం (TDP) పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు..

వందలాది వాహనాల్లో కన్నా అనుచరులు నినాదాలు చేస్తూ ఆయన వెంట వచ్చారు.

ముందుగా నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2.48 గంటలకు అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు వేలాదిగా తెదేపా కండువా కప్పుకున్నారు.

Hyderabad: షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు..

సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు..

యాసంగి సాగు రికార్డు.. రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో పంటలు..

సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు.

53.08 లక్షల ఎకరాల్లో వరి

8 ఏండ్లలో కొత్తగా 49 లక్షల ఎకరాల సాగు

యాసంగి పంటలకు జీవధారగా కాళేశ్వరం

సీఎం కేసీఆర్‌ కృషితో సాగునీరు పుష్కలం

నిరంతర విద్యుత్తు, ఆపై పెట్టుబడి సాయం

యాసంగి వచ్చిందంటే భూములన్నీ బీడు పెట్టి రైతులంతా ఇంటికాడ కూర్చునేటోళ్లు. లేదంటే కూలీనాలీ పనులకు వెళ్లేటోళ్లు.. ఇది ఎనిమిదేండ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు సాగు సీజన్‌ సీన్‌ మారింది. జీవధార కాళేశ్వరంతో పుష్కలమైన సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్తు, పెట్టుబడిసాయంతో మండుటెండల్లోనూ పసిడి పంటలు పండుతున్నాయి. ఈసారి యాసంగిలో ఏకంగా 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ యాసంగి చరిత్రలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు.

సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితం. ఆ ఫలితం ఎంతటిదంటే.. ఈ యాసంగి సీజన్‌ పంటల సాగులో ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఉమ్మడి పాలనలోనూ ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 68.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. 2020-21 రికార్డును బద్ధలు కొడుతూ సరికొత్త రికార్డు నమోదైంది. మొత్తం పంటల సాగుతో పాటు వరి సాగు కూడా నయా రికార్డులను సృష్టించింది. ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం లెక్కలను బుధవారం వ్యవసాయ శాఖ విడుదల చేసింది. సాగుకు ఇంకా 10 రోజుల సమయం ఉన్నది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది.

49 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు

సాగునీటికి కరువుండే యాసంగిలోనూ రాష్ట్రంలో అనూహ్య రీతిలో పంట సాగు పెరుగుతుండటం గమనార్హం. ఎనిమిదేండ్లలోనే రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 48.61 లక్షల ఎకరాలు పెరిగింది. 2015-16 యాసంగిలో సీజన్‌లో తెలంగాణ అంతటా 19.92 లక్షల ఎకరాలే సాగైంది. అదిప్పుడు 68.53 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక, యాసంగి వరి గత ఎనిమిదేండ్లలో 45.73 లక్షల ఎకరాలు పెరగటం విశేషం. 2015-16 యాసంగిలో 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. అంటే.. వరి సాగు ఏడింతలు పెరిగింది.

అంచనాలను మించి..

ఉమ్మడి ఏపీ, తెలంగాణ వ్యవసాయ చరిత్రలో 2020-21 యాసంగిలో అత్యధిక సాగు నమోదైంది. ఆ సీజన్‌లో మొత్తం 68.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇదే స్థాయిలో వరి కూడా రికార్డు స్థాయిలో 52.80 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక భవిష్యత్తులో ఈ సాగును మించి కాబోదని అందరూ అంచనా వేశారు. కానీ ఈ సీజన్‌లో సాగు 68.53 లక్షలకు చేరుకోగా, వరి సాగు 53.08 లక్షలకు చేరింది.

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితమే

అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవటానికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన నిరంతర శ్రమ, పట్టుదల వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతులు సగర్వంగా జీవించేలా ప్రణాళికలు అమలు చేశారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీరు, కరెంటు గోస తీర్చారు. రైతుబంధు అందించి రైతులకు అండగా నిలిచారు. వ్యవసాయ రంగంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రికార్డు స్థాయిలో పంటలు సాగు చేసేలా చేశారు. సీఎం కేసీఆర్‌ చేయూతతో ఇప్పుడు తెలంగాణ రైతులు అధిక పంటలు సాగు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.