ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలోకి

రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ నిర్దేశం

దిల్లీ: నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. ‘‘చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది.

పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య (ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం.

అందువల్ల అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్‌ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్‌ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి, అమలుచేయాలి. ఈ కోర్సును స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ల (డైట్‌) ద్వారా అమల్లో పెట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్‌సీఈఆర్‌టీ పర్యవేక్షణలో నిర్వహించాలి’’ అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.

Viveka Murder Case: వివేకా రాజకీయాలు అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డికి నచ్చలేదు అందుకే: సీబీఐ

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.

‘‘వైఎస్‌ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగింది. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారు. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని పట్టుబట్టారు.

ఈ విషయంలో వివేకా రాజకీయ కదలికలు అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డికి నచ్చలేదు. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దీంతో వివేకాను సునీల్‌ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. హత్య జరిగిన రోజు రాత్రి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్‌ యాదవ్‌ వెళ్లాడు.

ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సీఐకి సమాచారం ఇచ్చారు. హత్యను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కుట్రలో భాగంగానే గుండెపోటు, విరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోంది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారు. వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజ్‌ కట్టారు’’ అని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.

ఉమ్మడి జిల్లాలో రైలు పట్టాలపై 145 మరణాలు

ప్రమాదాల కంటే బలవన్మరణాలే ఎక్కువ

కృష్ణా రైల్వేస్టేషను పరిధి చేగుంట వద్ద గతేడాది డిసెంబరు 24న ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దలు పెళ్లికి అంగీకరించరని వారు బలవన్మరణానికి పాల్పడటం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

పాఠశాలకు సక్రమంగా వెళ్లమని, పరీక్షల్లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని తల్లి మందలించడంతో డిసెంబరు 7న హన్వాడ మండలానికి చెందిన ఓ బాలుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందటం తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది.

మహబూబ్‌నగర్‌ పట్టణం బండమీదిపల్లి పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న యాదగిరి(57) అనే ప్రభుత్వ ఉద్యోగి అక్టోబరు 21న రైలు ఢీకొని మృతిచెందాడు.

ఎంత పెద్ద సమస్య అయినా తప్పక పరిష్కారం ఉంటుంది. పెద్దలు, మిత్రుల సమక్షంలో చర్చించి దానికి మార్గం అన్వేషించాలే తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ చాలా మంది యువతీ యువకులు క్షణికావేశంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందుకు రైలుపట్టాలను వేదిక చేసుకోవటం అందరినీ తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్‌ రైల్వే పోలీసు స్టేషను పరిధిలో ఏడాది కాలంగా రైల్వే ప్రమాదాలు, బలవన్మరణాల సంఖ్య చాలా పెరిగిన నేపథ్యంలో Streetbuzz ప్రత్యేక కథనం.

పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధి తిమ్మాపూర్‌(ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా) నుంచి గద్వాల జిల్లాలోని జోగులాంబ హాల్టు వరకు, వాడి మార్గంలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కొన్ని గ్రామాలు మహబూబ్‌నగర్‌ రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. దాదాపు 250 కి.మీ.లకు పైగా పొడవైన రైలుమార్గం ఉంది. దీని పరిధిలో 2022లో రైలుపట్టాలపై ఆత్మహత్యలు, ప్రమాదాల్లో కలిపి 129 మంది చనిపోయారు. ఇందులో 76 ఆత్మహత్యలు కాగా 53 ప్రమాద మరణాలు. 2023లో ఇప్పటివరకు 7 ఆత్మహత్యలు, 9 ప్రమాద మరణాలు జరిగాయి. 14 నెలల్లో ప్రమాదాల కంటే ఆత్మహత్యలే ఎక్కువగా ఉండటం కలచివేసే అంశం. పెద్దలు మందలించారని, ప్రేమ విఫలమైందని, ఉద్యోగం రాలేదని, జబ్బు నయం కాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చరవాణిలో మాట్లాడుతూ పట్టాలు దాటి, మూలమలుపుల్లో రైలు రాకను పసిగట్టక ప్రమాదానికి గురై చనిపోతున్నారు.

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. బాధ్యతలు చేపట్టనున్న షెల్లీ ఒబెరాయ్

దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌ పదవిని ఆమ్‌ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. మేయర్‌ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీపై ఆప్‌ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్‌ తగిలినట్టు అయ్యింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల తర్వాత 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయర్‌గా నియమితులు కానున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం, ఆప్‌ నేతలు ఒబెరాయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు.

షెల్లీ ఒబెరాయ్‌(39).. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా గెలిచారు. పశ్చిమ ఢిల్లీ ఈస్ట్‌ పటేల్‌ నగర్‌ నుంచి ఆమె నెగ్గారు. ఇండియన్‌ కామర్స్‌ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్‌గా ఉన్నారు. ఇందిరా గాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్‌ నుంచి గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ, అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.

ఎన్నికల్లో మూడుసార్లు విఫలయత్నాల తర్వాత, సుప్రీంకోర్టులో ఆప్‌కి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత బుధవారం ఓటింగ్ జరిగింది. డిసెంబరులో పౌర ఎన్నికలు జరిగినప్పటి నుండి, ఆప్, బీజేపీల మధ్య సుదీర్ఘ వాగ్వాదాల మధ్య మేయర్ ఎన్నికలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించారన్న బీజేపీ వాదనను సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు నామినేటెడ్ సభ్యులు ఎన్నికల్లో ఓటు వేయరాదని చెప్పారు. “నామినేటెడ్ సభ్యులు ఎన్నికలకు వెళ్లలేరు. రాజ్యాంగ నిబంధన చాలా స్పష్టంగా ఉంది” అని కోర్టు పేర్కొంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. స్టాండింగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌కి మూడు, బీజేపీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆరో సీటుపై పోరు నెలకొంది.

పాతబస్తీకి ఓటు వేసేందుకు అనుమతిస్తే, బీజేపీ బలం 113 నుంచి 123కి చేరి ఉండేది. 274 మంది సభ్యుల సభలో ఆప్‌కు 150 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ మార్క్ 138గా ఉంది. కనుక ఇది మేయర్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనప్పటికీ, పౌర సంఘంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా స్టాండింగ్ కమిటీలో బీజేపీ కీలకమైన భాగాన్ని కైవసం చేసుకోగలిగింది. ఈ ఎన్నికకు తాము దూరంగా ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది. మేయర్ కోసం ఎలక్టోరల్ కాలేజీలో 250 మంది ఎన్నికైన కౌన్సిలర్లు, ఏడుగురు లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ 13 మంది ఆప్ ఎమ్మెల్యేలను, ఒక బీజేపీ సభ్యుడిని పౌరసంఘానికి నామినేట్ చేశారు.

గత సంవత్సరం ఎంసీడీ విలీనం, నియోజకవర్గాల రీడ్రాయింగ్ తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 250 వార్డులలో 134 వార్డులను ఆప్‌ గెలుచుకుంది. 15 ఏళ్ల పాటు పౌరసరఫరాల శాఖను నియంత్రించిన బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 10 మంది ఆల్డర్‌మెన్‌ల పేర్లను పేర్కొనడంపై ఆప్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. నామినేట్ చేయబడిన 10 మంది ఆల్డర్‌మెన్ ప్రమాణం చేయడం, వారి ఓటింగ్‌పై సందిగ్ధం వల్ల మూడుసార్లు మేయర్ ఎన్నిక నిలిచిపోయింది. సుప్రీంకోర్టు విచారణకు అనుగుణంగా ఎన్నికలను నాలుగోసారి వాయిదా వేశారు. ఈ సారి ఎన్నిక జరగడంతో ఆప్ మేయర్‌ సీటును సొంతం చేసుకుంది.

TTD: ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. తితిదే వెబ్‌సైట్‌ సర్వర్‌ డౌన్‌

తిరుమల: ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల జారీకి సంబంధించి బుధవారం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం 4గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

ఈ టికెట్ల కోసం తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశించిన భక్తులు.. టికెట్లు బుక్‌ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వెబ్‌సైట్‌ తరచూ హ్యాంగ్‌ అవడం, ఓపెన్‌ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బ్యాంకు మీ మ్యుటిలేటెడ్ నోట్లను మార్చకపోతే, 14440కి మిస్డ్ కాల్ ఇవ్వండి

 మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోవడానికి ఏ బ్యాంకు కూడా వెనుకాడదు. బ్యాంకు నోటు మార్చుకోకుంటే ఆర్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్ 14440కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అధికారిపై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది. బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు వచ్చే వారు కూడా చిరిగిన నోట్లను తీసుకురావడం తరచుగా బ్యాంకులో కనిపిస్తూనే ఉంది.

బ్యాంకులో నోట్లను డిపాజిట్ చేసేందుకు నిరాకరించారు. కొన్ని కారణాల వల్ల డిపాజిట్లు తీసుకున్నా, ఆ నోట్లను డబ్బు తీసుకున్న వ్యక్తికి అందజేస్తారు. బ్యాంకులో వచ్చే ప్రతి నోటును తనిఖీ చేయడం మరియు మ్యుటిలేటెడ్ నోట్లను వేరు చేయడం RBI మార్గదర్శకం. వాటిని డ్రాయర్‌కి ఇవ్వకూడదు.

నోటు మార్పిడికి అయిష్టతపై మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు, RBI అధికారులు సంబంధిత కాలర్ నుండి సమాచారం తీసుకుని, నోటును మార్చుకోమని సంబంధిత బ్యాంకుకు సూచిస్తారు. డిస్ట్రిక్ట్ లీడింగ్ బ్యాంక్ (ఎల్‌డిఎం) మేనేజర్ విశాల్ దీక్షిత్ మాట్లాడుతూ మ్యుటిలేటెడ్ నోట్లను మార్చడంపై ఆర్‌బిఐ సీరియస్‌గా ఉందన్నారు.

RBI గైడ్ లైన్

 ఒక నోటు నాలుగు ముక్కలుగా ఉంది, నోటులోని ఒక ముక్క లేదు మరియు నోటుపై నంబర్ ముద్రించబడింది. అలాంటి నోట్లను బ్యాంకు మార్పిడి చేస్తుంది. చాలా పాత మరియు బెంట్ నోట్లు బ్యాంకు ద్వారా మార్పిడి చేయబడతాయి. ఐదు ముక్కల నోట్లు, కాలిపోయిన నోట్లు వాటి నంబర్లు కనిపించవు. అటువంటి నోటును కలిగి ఉన్న వ్యక్తిని బ్యాంక్ సమీపంలోని RBI కార్యాలయానికి పంపుతుంది. అక్కడ నోటును తనిఖీ చేసి, ఆ నోటు సరైనదైతే, బ్యాంకులో డిపాజిట్ చేయమని అడుగుతారు.

Andhra News: వాచిపోయిన చేతులు చూపించిన పట్టాభి.. జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు

గన్నవరం: తెదేపా(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌,(pattabhi) దొంతు చిన్నా, గురుమూర్తి సహా అరెస్టు చేసిన 11 మంది తెలుగుదేశం నేతలను గన్నవరం (Gannavaram) కోర్టుకు తీసుకువచ్చారు..

స్థానిక అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వారిని పోలీసులు హాజరుపర్చారు. కోర్టుకు వెళ్తూ పట్టాభి వాచిపోయిన చేతులు చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో పట్టాభితో పాటు తెదేపా నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

గన్నవరం పీఎస్‌లోనే తెదేపా నేతలకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తన భర్త పట్టాభిరామ్‌ను దారుణంగా హింసించారని ఆయన భార్య చందన ఆరోపించారు. ఉన్నతాధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. తోట్లవల్లూరు పీఎస్‌లో తన భర్తను ముసుగు ధరించిన ముగ్గురు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి ఇంత ఆందోళనగా ఎప్పుడూ కనిపించలేదన్నారు.

తెదేపా నేతలను కోర్టుకు తరలించే క్రమంలో గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గన్నవరం కోర్టు వద్దకు చేరుకున్నారు.

ఏపీ: కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు..

ఈ మేరకు కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు రేపు(బుధవారం) అబ్దుల్‌ నజీర్‌, ఏపీకి రానున్నారు. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారాయన.

MLC Kaushik Reddy: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

MLC Kaushik Reddy: గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. తమిళిసై పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో కమిషన్ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు..

జ్వరం వచ్చిన వెంటనే మాత్రలు వద్దు

వాషింగ్టన్‌: పిల్లలకు ఏ కాస్త జ్వరం వచ్చినా వెంటనే దాన్ని తగ్గించే మాత్రలు వాడటం మంచిది కాదని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు. వారు 12 ఏళ్లు, అంతకులోపు వయసున్న పిల్లలను పరిశీలించారు.

పిల్లల శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హైట్‌ లోపే ఉన్నా కూడా ప్రతి ముగ్గురు తల్లిదండ్రులలో ఒకరు జ్వరం తగ్గించే పారాసెటమాల్‌ వంటి మాత్రలు వాడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల నుంచి 101.9 డిగ్రీల లోపు ఉంటే ప్రతి ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరు జ్వర మాత్రలు వాడుతున్నారు.

ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం మళ్లీ రాకుండా రెండో డోసు ఇస్తున్నారు. ఇలాంటి స్వల్ప జ్వరాలను వాటంతట అవే తగ్గనివ్వాలని పరిశోధకులు సూచించారు. పిల్లల ఒళ్లు వెచ్చబడటమనేది రోగంపై పోరాడే క్రమంలో జరుగుతుందని వివరించారు.

జ్వరాన్ని తగ్గించినంత మాత్రాన వారి అస్వస్థత నయమైపోయిందని భావించరాదు. పిల్లలకు మరీ ఎక్కువ మందులు ఇస్తే దుష్పలితాలు వస్తాయి. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లల నుదుటి మీద కానీ, నోట్లో కానీ థర్మామీటర్‌ ఉంచి జ్వరాన్ని నమోదు చేస్తారు. ప్రతి ఆరుగురిలో ఒకరు చంకలో కానీ, చెవిలో కానీ ఈ సాధనాన్ని ఉంచి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. నుదుటి మీద, చెవిలో సరైన పద్ధతిలో థర్మామీటర్‌ను వాడితేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.