ఉమ్మడి జిల్లాలో రైలు పట్టాలపై 145 మరణాలు
ప్రమాదాల కంటే బలవన్మరణాలే ఎక్కువ
కృష్ణా రైల్వేస్టేషను పరిధి చేగుంట వద్ద గతేడాది డిసెంబరు 24న ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దలు పెళ్లికి అంగీకరించరని వారు బలవన్మరణానికి పాల్పడటం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.
పాఠశాలకు సక్రమంగా వెళ్లమని, పరీక్షల్లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని తల్లి మందలించడంతో డిసెంబరు 7న హన్వాడ మండలానికి చెందిన ఓ బాలుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందటం తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది.
మహబూబ్‌నగర్ పట్టణం బండమీదిపల్లి పాలిటెక్నిక్ కళాశాల వద్ద రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న యాదగిరి(57) అనే ప్రభుత్వ ఉద్యోగి అక్టోబరు 21న రైలు ఢీకొని మృతిచెందాడు.
ఎంత పెద్ద సమస్య అయినా తప్పక పరిష్కారం ఉంటుంది. పెద్దలు, మిత్రుల సమక్షంలో చర్చించి దానికి మార్గం అన్వేషించాలే తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ చాలా మంది యువతీ యువకులు క్షణికావేశంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందుకు రైలుపట్టాలను వేదిక చేసుకోవటం అందరినీ తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్ రైల్వే పోలీసు స్టేషను పరిధిలో ఏడాది కాలంగా రైల్వే ప్రమాదాలు, బలవన్మరణాల సంఖ్య చాలా పెరిగిన నేపథ్యంలో Streetbuzz ప్రత్యేక కథనం.
పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా పరిధి తిమ్మాపూర్(ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా) నుంచి గద్వాల జిల్లాలోని జోగులాంబ హాల్టు వరకు, వాడి మార్గంలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కొన్ని గ్రామాలు మహబూబ్‌నగర్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తాయి. దాదాపు 250 కి.మీ.లకు పైగా పొడవైన రైలుమార్గం ఉంది. దీని పరిధిలో 2022లో రైలుపట్టాలపై ఆత్మహత్యలు, ప్రమాదాల్లో కలిపి 129 మంది చనిపోయారు. ఇందులో 76 ఆత్మహత్యలు కాగా 53 ప్రమాద మరణాలు. 2023లో ఇప్పటివరకు 7 ఆత్మహత్యలు, 9 ప్రమాద మరణాలు జరిగాయి. 14 నెలల్లో ప్రమాదాల కంటే ఆత్మహత్యలే ఎక్కువగా ఉండటం కలచివేసే అంశం. పెద్దలు మందలించారని, ప్రేమ విఫలమైందని, ఉద్యోగం రాలేదని, జబ్బు నయం కాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చరవాణిలో మాట్లాడుతూ పట్టాలు దాటి, మూలమలుపుల్లో రైలు రాకను పసిగట్టక ప్రమాదానికి గురై చనిపోతున్నారు.
Feb 23 2023, 09:41