IndiGo: ఇండిగో విమానాలకు ఒకేరోజు రెండు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్..
హైదరాబాద్: ఇండిగో (IndiGo) విమానాలకు ఒకే రోజు రెండు బాంబు బెదిరింపు (Bomb threat) ఫోన్లు వచ్చాయి. ఓ ఘటన శంషాబాద్ (Shamshabad) ఎయిర్ పోర్టులో చోటు చేసుకోగా..
మరో ఘటన దేశ రాజధాని దిల్లీ (Delhi)లో జరిగింది. శంషాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్, శంషాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఆతడు.. ఆలస్యంగా రావడంతో సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో డయల్ 100కి ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని బెదిరించాడు. సాంకేతిక ఆధారాలతో భద్రయ్యను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. విమానాశ్రయ పోలీసులు విచారించగా.. విమానాన్ని అందుకోలేక పోయానని, బాంబు ఉందని చెబితే విమానం లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
దిల్లీ నుంచి ఒడిశా వెళ్తుండగా..
మరోవైపు ఇదే తరహా ఘటన దిల్లీ విమానాశ్రయంలోనూ చోటు చేసుకుంది. దిల్లీ నుంచి ఒడిశాలోని దేవ్‌గఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు ఫోన్ చేసి చెప్పారు. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో అప్రమత్తమైన అధికారులు విమానానాన్ని లఖ్‌నవూకి మళ్లించారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒడిశా వెళ్లేందుకు అనుమతించినట్లు ఇండిగో ప్రకటన విడుదల చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
Feb 21 2023, 18:47