IndiGo: ఇండిగో విమానాలకు ఒకేరోజు రెండు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌..

హైదరాబాద్: ఇండిగో (IndiGo) విమానాలకు ఒకే రోజు రెండు బాంబు బెదిరింపు (Bomb threat) ఫోన్లు వచ్చాయి. ఓ ఘటన శంషాబాద్‌ (Shamshabad) ఎయిర్‌ పోర్టులో చోటు చేసుకోగా..

మరో ఘటన దేశ రాజధాని దిల్లీ (Delhi)లో జరిగింది. శంషాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు డయల్‌ 100కి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌, శంషాబాద్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు భద్రయ్య అనే వ్యక్తి ఫోన్‌ చేసినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఆతడు.. ఆలస్యంగా రావడంతో సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో డయల్‌ 100కి ఫోన్‌ చేసి విమానంలో బాంబు ఉందని బెదిరించాడు. సాంకేతిక ఆధారాలతో భద్రయ్యను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. విమానాశ్రయ పోలీసులు విచారించగా.. విమానాన్ని అందుకోలేక పోయానని, బాంబు ఉందని చెబితే విమానం లేట్‌ అవుతుందనే ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

దిల్లీ నుంచి ఒడిశా వెళ్తుండగా..

మరోవైపు ఇదే తరహా ఘటన దిల్లీ విమానాశ్రయంలోనూ చోటు చేసుకుంది. దిల్లీ నుంచి ఒడిశాలోని దేవ్‌గఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు ఫోన్‌ చేసి చెప్పారు. అప్పటికే విమానం టేకాఫ్‌ అవ్వడంతో అప్రమత్తమైన అధికారులు విమానానాన్ని లఖ్‌నవూకి మళ్లించారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒడిశా వెళ్లేందుకు అనుమతించినట్లు ఇండిగో ప్రకటన విడుదల చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

Bandi sanjay: కేంద్రానికి రాసిన ఆ లేఖపై కేసీఆర్‌ చర్చకు సిద్ధమా?: బండి సంజయ్‌

హనుమకొండ: రాష్ట్రంలో కొందరు పోలీసులు (TS Police) భారాస (BRS) కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) ఆరోపించారు..

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం ఆయన పర్యటించారు. పరకాల సబ్‌జైలు నుంచి విడుదలైన భాజపా నేతలను పరామర్శించిన అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

''ఈనెల 5న పంగిడిపల్లిలో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పర్యటనలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిని వదిలేసి భాజపా నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు భారాస కార్యకర్తల్లా మారిపోయారు. కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మరో మూడు నెలలు మాత్రమే భారాస అధికారంలో ఉంటుంది. చట్టాలను అతిక్రమించి భారాస కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటాం'' అని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు భారాస ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని బోరు బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెడతామని.. రుణమివ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా? లేదా? అని నిలదీశారు. ఈ విషయంపై కేసీఆర్‌ చర్చకు సిద్ధమా? అని సంజయ్‌ సవాల్‌ విసిరారు..

కోటప్పకొండ హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ప్రాంగణంలో లెక్కింపు కార్యక్రమం ఆదివారం జరిగింది.

మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని గడిచిన మూడు రోజులకు గాను రూ.1,73,67389 ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు.

బంగారం 1.950 మిల్లి గ్రాములు, వెండి 367.600గ్రాములు వచ్చినట్లు తెలిపారు.

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏడీసీ చంద్రకుమార్, డిసి చంద్రశేఖర్రెడ్డి, డీఈవో సత్య నారాయణరెడ్డి పర్యవేక్షించారు....

Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం

Congress Plenary Session From Feb 24 To Feb 26 In Raipur: కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు..

మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి 9915 మంది పీసీసీ ప్రతినిధులు, 1338 మంది ఏఐసీసీ ప్రతినిధులు, 487 కోఆప్టెడ్ సభ్యులు పాల్గొననున్నారు. అందులో ఏపీ నుంచి 350, తెలంగాణ నుంచి 238 పీసీసీ ప్రతినిధులు పాల్గొంటారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం.. 12 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులను ఏఐసీసీ సభ్యులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు నిర్వహించే అంశంపై ఫిబ్రవరి 24న తొలిరోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. అలాగే.. మూడు రోజుల ప్లీనరీ సమావేశాల అజెండాను కూడా స్టీరింగ్ కమిటీ ఖరారు చేయనుంది. అనంతరం కాంగ్రెస్ సబ్జెక్ట్స్ కమిటీ.. ప్లీనరీ సమావేశాల్లో ఆమోదించనున్న తీర్మానాలకు తుది రూపునివ్వనుంది. చివరి రోజు (ఫిబ్రవరి 26)న నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.

Morbi Bridge Collapse: మోర్బీ వంతెన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..

SIT Reveals The Reason Behind Morbi Bridge Collapse: గతేడాది గుజరాత్‌తో మోర్బీ వంతెన కూలిన ఘటన గుర్తుందా? ఈ ప్రమాదంలో మొత్తం 135 మంది మరణించారు.

తాజాగా ఈ ఘటనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణలో.. కూలడానికి ముందే ఈ బ్రిడ్జిలో చాలా లోపాలు ఉన్నాయని తేలింది.

కేబుల్‌పై దాదాపు సగం వైర్లు తుప్పుపట్టడం, పాత సస్పెండర్లను కొత్తవాటితో వెల్డింగ్ చేయడం వంటి తప్పిదాలు.. ఈ వంతెన కూలిపోవడానికి దారతీశాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. వంతెన మరమ్మత్తులు, నిర్వహణలో అనేక లోపాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ బేనివాల్, ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ తదితరులు ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.

Coal scam: బొగ్గు స్కాంలో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ : ఛత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.

(ED searches) ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh)రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు..

ఈడీ దాడులు చేసిన వారందరూ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్(CM Bhupesh Baghel) సన్నిహితులని సమాచారం. కోల్ లెవీ స్కాంలో(Coal levy scam) కొందరు రాజకీయ నేతలు, అధికారులు 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది..

సినిమాను తలపించేలా తారకరత్న జీవితం..

•ప్రేమ పెళ్లి, రాజకీయం ఇలా..

Taraka Ratna Biography | నందమూరి తారక రామారావు పన్నెండవ సంతానంలో 5వ కొడుకు మోహనకృష్ణ. మోహనకృష్ణ కూడా సినిమా రంగంలో పనిచేసిన వారే. ఎన్టీఆర్‌, బాలకృష్ణ, హరికృష్ణ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా మొహన్‌కృష్ణ పనిచేశాడు. మోహన్‌ కృష్ణ, సీత దంపతులకు 1983లో జనవరి 8వ తేదీన తారకరత్న జన్మించాడు. ఏడవ తరగతి వరకు చెన్నైలో చదువుకున్న తారకరత్న ఆ తర్వాత హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్యను పూర్తిచేశాడు. ఇక గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు.

సినీ జీవితం:

అప్పటికే తారకరత్నకు సినిమాలపై ఇంట్రెస్ట్‌ ఉండటంతో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ‘యువరత్న’, ‘తారక్‌’, ‘భద్రాద్రి రాముడు’ వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ‘భద్రాద్రిరాముడు’ వరకు కెరీర్‌ మంచి స్పీడ్‌లోనే ఉంది. ఆ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులు పలకరించాయి. ఇక అప్పుడే రవిబాబు ప్రోత్సాహంతో ‘అమరావతి’ సినిమాతో విలన్‌గా మారి తొలి సినిమాతోనే విలన్‌గా నంది అవార్డు గెలుచుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘నందీశ్వరుడు’ అనే మాస్‌ సినిమా తీశాడు. అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టి సంఘ విద్రోహశక్తిగా మారిన ఒక ఉత్తమ విద్యార్థి పాత్రలో తారకరత్న జీవించాడు. ఈ సినిమాతో తారకరత్న మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. రిలీజ్‌ రోజున పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. పోటీగా ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘బాడీగార్డ్‌’ సినిమాలుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే హీరోగా ఈ సినిమాతో తారకరత్న మరో మెట్టు ఎక్కాడు.

ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొంచెం కొంచెంగా తరకరత్న ఫేడవుట్‌ అయ్యాడు. అయితే తన క్రేజ్‌ ఎలా ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలే చేశాడు. ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరగా ఆయన క్రిష్‌ రూపొందించిన ‘9అవర్స్‌’ వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ వెబ్‌సిరీస్‌లో తారకరత్న పోలీస్‌ పాత్రలో నటించాడు. దీనికి ముందు ‘S5 నో ఎగ్జిట్‌’ అనే థ్రిల్లర్ సినిమా చేశాడు. ఇదే తారకరత్న నటించిన చివరి చిత్రం. తారకరత్న ఇప్పటివరకు మొత్తం 22 సినిమాల్లో నటించాడు. ఆయన సైన్‌ చేసిన రెండు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్నాయి.

పెళ్లి:

నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం. 2012లో తారకరత్న, అలేఖ్యరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అలేఖ్య ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాకుండా తారకరత్న.. చెన్నైలో అలేఖ్య సిస్టర్‌కు సీనియర్‌ అట. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ల పెళ్లికి ఇరు కుంటుబాల నుంచి అంగీకరించలేదట. అయితే అదే టైమ్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి మద్ధతు ఉండటంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్‌లో జరిగిందని అప్పట్లో ఓ ఇంటర్వూలో అలేఖ్య చెప్పింది. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్‌. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

రాజకీయం:

నటుడిగా కొనసాగుతుండానే గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో యాక్టీవ్‌గా మారారు. చంద్రబాబు, లోకేష్‌ కూడా తారకరత్నను ప్రోత్సహించడంతో ఆయన ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ స్థానిక నాయకులను కలుస్తూ వచ్చాడు. రానున్న ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తానని గతంలో చెప్పాడు. ఈ క్రమంలోనే లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నాడు. గతనెల 27న కుప్పంలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Hyderabad: పథకం ప్రకారమే నగలున్న కారుతో పరారీ

•డ్రైవర్‌ను పట్టుకునేందుకు నాలుగు బృందాలు

•శ్రీనివాస్‌ ఎత్తుకెళ్లిన కారు

అమీర్‌పేట: ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం రూ.7 కోట్ల వజ్రాభరణాలున్న కారుతో ఉడాయించిన డ్రైవర్‌ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే మహిళా జ్యువెలరీ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌(28) కారులో ఉన్న రూ.7 కోట్ల విలువచేసే వజ్రాభరణాలతో పరారైన విషయం తెలిసిందే.

మధురానగర్‌కు చెందిన అనూషకు రూ.50 లక్షల విలువచేసే వజ్రాభరణాలను ఇచ్చేందుకు సేల్స్‌మెన్‌ అక్షయ్‌తో కలిసి వచ్చిన శ్రీనివాస్‌ నగలున్న కారుతో సహా ఉడాయించాడు. కేసు నమోదుచేసుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు శ్రీనివాస్‌ ఉడాయించిన అరగంటలో కారు నంబరును అన్ని ఠాణాలకు పంపి గాలింపు చేపట్టారు. శ్రీనివాస్‌ కారును ఎక్కడో వదిలి బైక్‌పై పరారవుతున్నట్లు గుర్తించారు. శ్రీశైలం రోడ్డు కడ్తాల్‌ వరకు బైక్‌పై శ్రీనివాస్‌ వెళ్లినట్లు గుర్తించారు.

మూడు నెలల కిందటే పనిలోకి.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మూడు నెలల కిందట నగరానికి వచ్చిన శ్రీనివాస్‌ ఎస్సార్‌నగర్‌ సమీపంలోని సాయి హాస్టల్‌లో ఉంటున్నాడు. మూడు నెలల కిందటే రాధిక వద్ద పనిలో చేరాడు. నగరంలోని వివిధ నగల దుకాణం నుంచి వజ్రాభరణాలను కావాల్సిన వారికి రాధిక సరఫరా చేస్తుంటుంది. రోజూ కారులో పెద్దమొత్తంలో వజ్రాభరణాలు తరలిస్తుంటారు. ఈ విషయం గ్రహించిన శ్రీనివాస్‌ చోరికి ముందే పథకం వేసినట్లు తెలుస్తుంది. రెండు రోజుల ముందుగానే భార్యను బెంగళూరు పంపినట్లు పోలీసులు గుర్తించారు. తన ఇద్దరు కుమారులను సోదరుల వద్ద వదిలాడు. తల్లిదండ్రులు మాత్రం కొవ్వూరులోనే ఉంటున్నారు.

భారాస ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిల అరెస్ట్

మహబూబాబాద్‌: వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైతెపా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్‌ శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం షర్మిలను అరెస్ట్‌ చేశారు.

Shiv Sena: ‘పెద్ద ప్రభావమేమీ ఉండదు..’ ఎన్నికల గుర్తుపై ఉద్ధవ్‌తో శరద్‌ పవార్‌!

ముంబయి: శివసేన(Shiv Sena) పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’.. మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ECI) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివసేన(యూబీటీ) వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray).. ఈసీ వ్యవహార తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని విమర్శించారు. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NC) చీఫ్ శరద్ పవార్‌(Sharad Pawar) తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. పార్టీ ఎన్నికల గుర్తు కోల్పోవడంతో పెద్ద ప్రభావమేమీ ఉండదని తన మిత్రపక్షం ఉద్ధవ్ వర్గంతో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అంగీకరించి, కొత్త గుర్తును తీసుకోవాలని ఠాక్రేకు సూచించారు. కొత్త గుర్తును ప్రజలు అంగీకరిస్తారని కూడా ఆయన చెప్పారు.

‘కాంగ్రెస్‌ కూడా మార్చుకుంది..’

‘ఇది ఎన్నికల సంఘం నిర్ణయం. ఒకసారి నిర్ణయం వెలువడ్డాక చర్చలకు తావులేదు. దానిని శిరసావహించండి. పాత గుర్తును కోల్పోవడంతో పెద్దగా ప్రభావం ఉండదు. ప్రజలు కొత్త ఎన్నికల గుర్తును ఆమోదిస్తారు. ఈ విషయం ఓ 15- 30 రోజులపాటు చర్చలో ఉంటుంది, అంతే’ అని పవార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ సైతం ‘జోడెద్దులు- కాడె’ నుంచి ‘హస్తం’ గుర్తుకు మార్చుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసిన శరద్‌ పవార్‌.. అదే విధంగా శివసేన(యూబీటీ) కొత్త గుర్తునూ ప్రజలు అంగీకరిస్తారని తెలిపారు. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్‌ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. గత ఏడాది అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈసీ దీనిని కేటాయించింది.

సుప్రీంకోర్టు కు ఉద్ధవ్

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ శిందే వర్గానికి శివసేన పేరు, గుర్తును కేటాయించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకుగానూ ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఠాక్రే నివాసం 'మాతోశ్రీ'లో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడంతో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత భాజపా ఎమ్మెల్యేల మద్దతుతో శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం రెండు వర్గాలు పోటీపడ్డాయి.