viveka Murder case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

కడప: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది..

గత నెల 28న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి

ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్‌ ద్వారా అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు. అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు రెండోసారి నోటీసులివ్వటం గమనార్హం.

చంద్రబాబు విజనరీ కాదు.. విజన్‌ లేని వ్యక్తి: మంత్రి వేణు

రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు విజనరీ కాదు.. విజన్‌ లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు.

''చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందే. పోలీసుల పట్ల చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు'' అని మంత్రి వేణు అన్నారు.

Chandrababu: సజ్జల డైరెక్షన్‌లోనే పోలీసుల అరాచకం: మండిపడ్డ చంద్రబాబు

అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.

నిన్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు తెదేపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని.. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రజల్లో వ్యతిరేకత గమనించే వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. నిన్న అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి... అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకొచ్చాయి. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలి..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. చట్టవ్యతిరేకంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే కొంతమంది పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కావాలనే తెదేపా కార్యకర్తలపై గురిపెట్టి దాడి చేశారు. కార్యకర్త ప్రకాశ్‌నాయుడిని గుండెలపై కొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు సహకరించొద్దని కోరుతున్నాను. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి'' అని చంద్రబాబు పోలీసులకు సూచించారు..

Cheetahs: మళ్లీ ఎగిరొచ్చిన చీతాలు.. దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్‌ చేరుకున్న విమానం

గ్వాలియర్‌: దాదాపు 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి చీతాలు (Cheetahs) ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికా (South Africa)తో ఒప్పందంలో భాగంగా 12 చీతాలు శనివారం భారత్‌ చేరుకున్నాయి..

ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్‌ జిల్లాలోని కునో జాతీయ పార్కు (Kuno National Park)కు తరలించనున్నారు.

ఈ మధ్యాహ్నం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ వీటిని కునో నేషనల్‌ పార్క్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటి కోసం కునో పార్కులో పది క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం.. నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

అమెరికాలో కాల్పుల కలకలం.. మూడు చోట్ల పేలిన తుపాకీ.. ఆరుగురు మృతి..

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు..

అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లలో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్(52)గా గుర్తించారు.

అయితే ఇతడు మొదట తన మాజీ భార్య, ఇతర కుటుంబసభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకుముందే ఓ స్టోర్‌లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎందుకు ఈ దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. అతడ్ని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Kotamreddy: పోరాడుతూనే ఉంటా.. భయపడే ప్రసక్తే లేదు: కోటంరెడ్డి

నెల్లూరు: ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్పష్టం చేశారు..

తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ''తన అనుచరులు తాటి వెంకటేశ్వర్లు, జావెద్‌, రఘు అరెస్టు తీరును ఖండిస్తున్నాం. పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లకుండా హైవేలో తిప్పారు. షాడో సీఎం సజ్జల సూచనల మేరకు పోలీసులు పని చేస్తున్నారు.

నాతో సహా 11మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల వేధింపులకు భయపడను. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాను.. తగ్గేదే లేదు'' అని కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి తేల్చి చెప్పారు.

'నీదొక పాదయాత్ర.. నువ్వొక లీడర్‌వి'

తాడేపల్లి: డైరెక్ట్‌గా పోటీ చేస్తే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవని నారా లోకేష్‌.. దొడ్డిదారిన మంత్రి అయిన విషయం గుర్తించుకుంటే బాగుంటుందని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు..

ప్రస్తుతం లోకేష్‌ చేస్తున్న యాత్ర పాదయాత్ర కాదని, పనికిమాలిన యాత్రను దుయ్యబట్టారు మంత్రి జోగి రమేష్‌. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్‌.. చంద్రబాబు, నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు.

'చంద్రబాబు, లోకేష్‌ వీది రౌడీల్లా తయారయ్యారు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. పనికిమాలిన యాత్ర. సీఎంను పట్టుకుని ఇష్టానుసారి మాట్లాడతారా. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్‌ డబ్బుంటే సరిపోదు.. ఖలేజా ఉండాలి. చంద్రబాబే రాష్ట్రంలో పెద్దసైకో.భయం అంటే తెలియన వ్యక్తి సీఎం జగన్‌. ఢిల్లీ కోటను గజగజలాడించిన దమ్మున మొనగాడు జగన్‌. దమ్మున నాయకుడికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్‌ జగన్‌' అని పేర్కొన్నారు..

ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది

ముంబయి: ఐపీఎల్‌-2023 సీజన్‌ షెడ్యూలును బీసీసీఐ ప్రకటించింది.

మార్చి 31 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో సీజన్‌ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 70 మ్యాచ్‌లుంటాయి.

IND vs AUS: తొలి రోజు ఆట పూర్తి.. భారత్‌ 21/0

దిల్లీ: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయింది.

ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

క్రీజులో రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. అంతకుముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. షమి 4 వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా చెరో 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఆసీస్‌ బ్యాటర్లలో ఖవాజా (81), పీటర్ (72*) అర్ధశతకాలు సాధించారు.

ఒకరు మాకు టికెట్లు ఇచ్చేదేంటి?అవసరం ఉంటే వాళ్లే వస్తారు: కూనంనేని

హైదరాబాద్: ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)తో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

భాజపాకు వ్యతిరేకంగా మునుగోడు ఉపఎన్నికలో భారాసకు మద్దతు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. భారాసకు మద్దతు ఇచ్చినప్పటికీ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. పొత్తులు.. పోరాటం.. ఈ రెండూ వేర్వేరని కూనంనేని స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది కమ్యూనిస్టులే. టికెట్లు ఒకరు మాకు ఇచ్చేదేంటి?అవసరం ఉందనుకుంటే మా దగ్గరకే భారాస వస్తుంది. లేదనుకుంటే ఎవరి దారి వారిదే. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర అక్కడికి చేరుకుంది. ఏఐటీయూసీ కావాలని పాదయాత్రలో పాల్గొనలేదు. సీపీఎం, సీపీఐ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. త్వరలోనే భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. అదాని కుంభకోణంపై ఒక్క సారి కూడా ప్రధాని మోదీ నోరు విప్పలేదు. సీపీఐ పోరాటం వల్లే పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది. 24గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టి సమస్య పరిష్కరించాలి’’ అని కూనంనేని కోరారు.