ఒకరు మాకు టికెట్లు ఇచ్చేదేంటి?అవసరం ఉంటే వాళ్లే వస్తారు: కూనంనేని
హైదరాబాద్: ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి భారత్ రాష్ట్ర సమితి (భారాస)తో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
భాజపాకు వ్యతిరేకంగా మునుగోడు ఉపఎన్నికలో భారాసకు మద్దతు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. భారాసకు మద్దతు ఇచ్చినప్పటికీ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. పొత్తులు.. పోరాటం.. ఈ రెండూ వేర్వేరని కూనంనేని స్పష్టం చేశారు.
‘‘రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది కమ్యూనిస్టులే. టికెట్లు ఒకరు మాకు ఇచ్చేదేంటి?అవసరం ఉందనుకుంటే మా దగ్గరకే భారాస వస్తుంది. లేదనుకుంటే ఎవరి దారి వారిదే. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర అక్కడికి చేరుకుంది. ఏఐటీయూసీ కావాలని పాదయాత్రలో పాల్గొనలేదు. సీపీఎం, సీపీఐ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. త్వరలోనే భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. అదాని కుంభకోణంపై ఒక్క సారి కూడా ప్రధాని మోదీ నోరు విప్పలేదు. సీపీఐ పోరాటం వల్లే పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది. 24గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టి సమస్య పరిష్కరించాలి’’ అని కూనంనేని కోరారు.
Feb 17 2023, 17:36