Kohinoor diamond : కోహినూర్.. రాజులకు అరిష్టం.. రాణులకు అదృష్టం!
వలస పాలనకు గుర్తుగా బ్రిటన్(britain) రాచకుటుంబం చేతిలో ఇప్పటికీ కోహినూర్ వజ్రం(Kohinoor diamond) ఉంది. గతేడాది రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. మరణించే వరకు ఆమె కిరీటంలోనే కోహినూర్ వజ్రం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె దాన్ని ధరిస్తూ వచ్చారు. రాణి మరణం తరువాత ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-3(king charles) పట్టాభిషిక్తుడు కానున్నాడు. విక్టోరియా మహారాణి కోహినూర్ గురించి రాసిన వీలునామా ప్రకారం ఛార్లెస్ భార్య, బ్రిటన్ రాణి కెమిల్లా(camilla) దానిని ధరించాల్సి ఉంటుంది. కానీ కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని ఇటీవల బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. చరిత్రలో కోహినూర్ ధరించిన రాజులందరూ చరిత్రలో కలిసిపోయారు. అందుకే ఛార్లెస్-3, కెమిల్లా కోహినూర్‌ను దూరం పెడుతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి.
తెలుగు నేలపై కోహినూర్ పుట్టుక!
కోహినూర్ పుట్టుక గురించి అనేక ఊహాగానాలున్నాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కోహినూర్ దొరికిందని చెబుతారు. అప్పుడు దాని బరువు గురించి కచ్చితమైన రికార్డులు లేవు. ప్రస్తుతం కోహినూర్ 105.6 క్యారెట్లు ఉంది. ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. వారి ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. దిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధి చేసుకొని అపారమైన సంపద, కోహినూర్ వజ్రం సమర్పించుకున్నాడని అంటారు.
చేతులు మారుతూ.. రాజ్యాలు తిరుగుతూ..
ఈ వజ్రాన్ని 1304లో దిల్లీ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని సమర్‌ఖండ్‌కు పంపించారు. 1526 నాటికి ఈ వజ్రం మొఘల్ రాజు బాబర్ చేతికి వచ్చింది. ఆయన ‘బాబర్ నామా’లో ప్రత్యేకంగా వజ్రం గురించి రాశాడు. దానిని సుల్తాన్ ఇబ్రహీం లోడి తనకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ప్రపంచంలో ఒక రోజు ఉత్పత్తి అయ్యే సంపదలో సగం ధరకు సమానమైనది కోహినూర్ అని బాబర్‌నామాలో వ్యాఖ్యానించాడు. బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఈ వజ్రం మొఘల్ వారసుల చేతులు మారుతూ వచ్చింది. ఔరంగజేబు మనవడైన సుల్తాన్ మహమ్మద్ కాలంలో ఇది పరాయివారి సొంతమైంది.
పర్షియన్ జనరల్ నాదిర్ షా 1739 నాటికి భారత్‌లో అడుగుపెట్టాడు. ఆ వెంటనే సుల్తాన్ మహమ్మద్ కిరీటంపై కన్నేశాడు. నాదిర్ షాకు లొంగిపోయిన సుల్తాన్ మహమ్మద్ ఖరీదైన వజ్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. అప్పుడే నాదిర్ షా వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూర్‌గా నామకరణం చేశాడు. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే ‘కాంతిశిఖరం’ అని అర్థం. అయితే కోహినూర్‌ను చేజిక్కించుకుని భారత్ విడిచి పర్షియా(ఇరాన్) వెళ్లిన నాదిర్‌షా దాన్ని తన బంగారు సింహాసనంలో పొదిగాడు. షా 1747లో హత్యకు గురికావడంతో షా జనరల్స్‌లో ఒకరైన అహ్మద్ షా దుర్రాని చేతుల్లోకి కోహినూర్ వెళ్లింది. దుర్రానీ వారసుడు షా షుజా దుర్రానీ 1813లో కోహినూర్‌ను తిరిగి భారత్‌కు తీసుకొచ్చాడు. సిక్కు రాజ్యం స్థాపించిన రంజిత్ సింగ్‌కు దానిని అప్పగించాడు. ప్రతిగా అఫ్గాన్ సింహాసనం షా షుజా దక్కించుకునేందుకు రంజిత్ సింగ్ సహాయం చేశాడు.
ఆంగ్లో-సిక్కు యుద్ధం
బ్రిటిష్ వారు పంజాబ్ ఆక్రమణకు దండెత్తడంతో సిక్కు రాజులకు, బ్రిటిష్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. 1849 నాటికి బ్రిటిష్ పాలకులు పంజాబ్‌ను పూర్తిగా ఆక్రమించి ఆభరణాలను జప్తు చేశారు. రంజిత్ సింగ్ చనిపోవడంతో ఆయన సతీమణి రాణి జిందన్‌ను ఖైదు చేసి జైలుకు పంపించారు. వారి కుమారుడైన బాలుడు దులీప్‌సింగ్‌తో బ్రిటిష్ వారు లాహోర్ ఒప్పందం పేరిట సంతకాలు చేయించుకున్నారు. వెంటనే కోహినూర్ వజ్రాన్ని లాహోర్‌లోని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అటు నుంచి భారీ ఓడలో డైమండ్‌ను తరలిస్తుండగా కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. 1850వ సంవత్సరంలో బ్రిటన్‌లో ఉన్న క్వీన్ విక్టోరియా వద్దకు డైమండ్ చేరింది. ఆమె దాన్ని లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే కోహినూర్ వన్నె తగ్గిందని భావించిన విక్టోరియా 1852లో దానికి మెరుగులు దిద్దించాలని నిర్ణయించారు. డచ్‌కు చెందిన జువెలర్ కాంటోర్‌కు ఆ పనిని అప్పగించగా కోహినూర్ 108.93 క్యారట్లకు తగ్గిపోయింది.
విక్టోరియా వీలునామా
కోహినూర్ చరిత్రలో దానిని ధరించిన లేదా తమ వద్ద దాచుకున్న రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. దాంతో విక్టోరియా జాగ్రత్తపడింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే దానిని ధరిస్తూ వచ్చింది. మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలంటూ ఆమె వీలునామా కూడా రాసింది. ఒక వేళ రాజు పాలిస్తుంటే అతడి భార్యగా రాణికి ఆ వజ్రాన్ని ధరించే హక్కుంటుందని అందులో పేర్కొంది. విక్టోరియా తరువాత దాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్-2(queen elizabeth) తమ కిరీటంలో ధరించారు. ప్రస్తుతం కోహినూరు వజ్రం టవర్ ఆఫ్ లండన్ వద్దనున్న జువెల్ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం మాకు ఇవ్వాలని భారత్(india) పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ తిరస్కరించింది. పాక్, అఫ్గాన్ దేశాలు కూడా ఈ వజ్రం తమ సొంతమని.. తమకే ఇవ్వాలని అడుగుతున్నాయి.
Feb 17 2023, 07:25