Diabetes: సెనగపిండితో మధుమేహం దూరం

లండన్‌: సెనగలు, కాయధాన్యాలు, బీన్స్‌ వంటివి ఆహారంలో భాగమైతే గుండెజబ్బుల ముప్పు తక్కువనే విషయం తెలిసిందే. వీటిలో పెద్ద మొత్తంలో పీచుపదార్థాలు ఉండటమే దీనికి కారణం.

తాజా పరిశోధనల మేరకు గోధుమ పిండి స్థానంలో సెనగ పిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపునిండిన భావన కలిగిస్తుందని, అలాగే ఇన్సులిన్‌, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని తేలింది.

తద్వారా అధిక బరువు సమస్యతో పాటు, టైప్‌-2 మధుమేహం బారిన పడకుండా తప్పించుకోవచ్చని వెల్లడైంది. 30% కొమ్ముసెనగ పిండి కలిపిన గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్‌ భుజిస్తే.. సాధారణ రొట్టె తిన్నప్పటితో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 40% తగ్గినట్లు గుర్తించారు. దీనికి ఇందులో ఉండే పిండిపదార్థం అరుగుదల స్థాయిని నెమ్మదింపచేయడమే కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

Birth Control: పురుషులకు సంతానోత్పత్తి నిరోధక మాత్ర!

వాషింగ్టన్‌: మగ ఎలుకల్లో వీర్యకణాల విడుదలను తాత్కాలికంగా అడ్డుకోవడం ద్వారా ఆడ ఎలుకల్లో గర్భధారణను నిరోధించగల రసాయనాన్ని అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ సంస్థ పరిశోధకులు రూపొందించారు.

ఆ రసాయన మాత్ర పేరు టీడీఐ-11861. గర్భం నివారణ కోసం ప్రస్తుతం పురుషులకు కండోమ్‌లు, వేసెక్టమీ శస్త్రచికిత్స వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఎలుకల మీద ప్రస్తుత ప్రయోగాలు విజయవంతంగా పూర్తయితే మగవాళ్లకూ సంతానోత్పత్తి నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

టీడీఐ-11861 మాత్రను మగ ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి వీర్యకణాలు రెండున్నర గంటలసేపు స్తంభించిపోయాయి. ఆడ ఎలుకల్లో ప్రవేశించిన మూడు గంటల తరవాత కొన్ని వీర్యకణాలు కొంతమేరకు తిరిగి క్రియాశీలమయ్యాయి.

Hyderabad: కింద షీట్లు.. పైన కరెన్సీ నోట్లు

•అప్పు ఇస్తామని మోసానికి యత్నించిన 9 మంది అరెస్టు

•ట్రంకు పెట్టెల్లో పేర్చిన థర్మాకోల్‌ షీట్లు

నాగోలు: పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చే నెపంతో దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని 9 మందిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుంచి రూ. 1.23 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై లింగారెడ్డి వివరాల ప్రకారం...

మహారాష్ట్రలోని పుణెకు చెందిన వైభవ్‌, రాజేష్‌ ఉత్తమ్‌ చందానీలు వ్యాపారులు డబ్బు అవసరం రావడంతో హైదరాబాద్‌లో స్థిరపడిన తమ స్నేహితుడు నీలేష్‌ను ఇటీవల సంప్రదించారు. ఈ క్రమంలో మన్సూరాబాద్‌ సమీపంలోని సాయి సప్తగిరి కాలనీలో 6 శాతం వడ్డీతో అప్పు పుడుతుందన్న విషయం తెలియడంతో.. వారు నగరానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి ఓ ఇంట్లో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న తొమ్మిది మందిని కలిశారు. వారిలో మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌.. పుణెకు చెందిన వ్యక్తులతో హిందీలో మాట్లాడాడు. రూ.2 కోట్లు అప్పు కావాలని వీరు కోరగా.. తొలుత రూ.20 లక్షలే ఇస్తామని, నమ్మకం కుదిరేందుకు నెలరోజుల్లో మరో రూ.20 లక్షలు కలిపి ఇవ్వాలని శ్రీనివాస్‌ సహా ఇతరులు సూచించారు.

ఆ తర్వాతే రూ.2 కోట్లు ఇస్తామంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి యజమాని శంకరమ్మ ఇంట్లోని రెండు భారీ ట్రంకు పెట్టెలు తెరిచి అందులో పేర్చిన నోట్ల కట్టలను దూరం నుంచే చూపిస్తూ.. రూ.వందల కోట్లు తమ వద్ద ఉన్నాయని నమ్మబలికారు. వారిపై అనుమాన కలిగి పుణె వాసులు ఎల్బీనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడిచేశారు. ట్రంకుపెట్టెలు తెరిచి చూడగా... పైన మాత్రమే అసలైన నోట్లు పేర్చి ఉంచారు.. కిందిభాగంలో థర్మాకోల్‌ షీట్లు ఉన్నాయి. దీంతో శ్రీనివాస్‌, శంకరమ్మతోపాటు మెదక్‌కు చెందిన రమేష్‌, రాములు, కొంపల్లికి చెందిన నాగయ్య, నిజామాబాద్‌కు చెందిన భోజన్న, మన్సూరాబాద్‌లో వాసులు రవి, సుంకమ్మ, దుర్గప్పలను అరెస్టు చేశారు.

ఏప్రిల్‌ 1 నుంచే రిటర్నులు: సీబీడీటీ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

2023-24 మదింపు సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని సీబీడీటీ బుధవారం వెల్లడించింది.

గత ఏడాది ఐటీఆర్‌ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపింది. సాధారణంగా జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అనివార్య సందర్భాల్లో సీబీడీటీ ఈ గడువును పొడిగిస్తూ ఉంటుంది.

1150కోట్లతో 50 లింకు రోడ్లు ప్రధాన రహదారులపై తగ్గనున్న భారం

ప్రయాణ ప్రయాస, సమయం ఆదా

రోడ్ల నిర్మాణానికి రూ.1150కోట్ల రుణం

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ఆమోదం

మిగిలిన నిధులను సర్దుబాటు చేయనున్న ప్రభుత్వం

విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. శివారులో జనావాసాలూ పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనసాంద్రతకు తగ్గట్లుగా ప్రభుత్వం వసతులు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించేందుకు, గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. సుమారు రూ.1500 కోట్లతో 120.92 కి.మీమేరలో 50 చోట్ల లింకు రోడ్లను నిర్మించే పనులకు శ్రీకారం చుట్టారు. 5 ప్యాకేజీల్లో చేపడుతున్న ఈ పనులకు నిధుల కోసం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ రూ. 1150 కోట్ల రుణం ఇస్తున్నది. ఈ మేరకు ఐవోబీ చీఫ్‌ రీజినల్‌ మేనేజర్‌ రంజయ మిశ్రా బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కలిసి మంజూరు పత్రాన్ని అందజేశారు. మిగిలిన నిధులను ఆయా మున్సిపాలిటీలు, ప్రభుత్వం నిధులతో పనులను పూర్తి చేయనున్నారు.

హైదరాబాద్‌ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నది. నగరంలో చేపట్టిన లింకు రోడ్లతో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంతో విస్తరిత ప్రాంతాలైన శివారు మున్సిపాలిటీల్లోనూ రహదారులను మరింత విశాలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్‌తో పాటు శివారు మున్పిపాలిటీల్లో పెద్ద ఎత్తున లింకు రోడ్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే 120.92 కి.మీ మేర 50 చోట్ల లింకు రోడ్లను నిర్మించేందుకు సుమారు రూ.1500 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఐదు ఫ్యాకేజీల్లో చేపడుతున్న ఈ పనులకు కీలకమైన నిధుల అడ్డంకి తొలగిపోయింది. రూ.1150 కోట్ల రుణానికి ఆమోదం తెలుపుతూ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రీజినల్‌ మేనేజర్‌ రంజయ మిశ్రా బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కలిసి మంజూరు పత్రాన్ని అందజేశారు. కాగా మిగిలిన నిధులను ఆయా మున్సిపాలిటీలు, ప్రభుత్వం నిధులతో పనులను పూర్తి చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీ విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న మిస్సింగ్‌ లింకు (లింకు రోడ్ల) పనులకు రుణాలు లైన్‌ క్లియర్‌ కావడంతో పనులపై ఆయా శాఖలు దృష్టి సారించాయి.

జనాభాకు అనుగుణంగా వసతులు…

పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. రూ. 2140 కోట్లతో హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే తొలి విడతలో రూ. 275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువ శాతం వెస్ట్‌జోన్‌లోనే ఉండగా..ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ క్రమంలోనే కోర్‌ సిటీలోనూ ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు ఒక్కటే మార్గం కాదని భావించి లింకు రోడ్లు నిర్మించేందుకు మంత్రి కేటీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫ్లైఓవర్‌కు పెట్టే ఖర్చుతో నాలుగు లింకు రోడ్లు నిర్మితం అవుతుండటంతో ఈ దిశగా అడుగులు వేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆదేశాలతో రూ. 207 .26 కోట్లతో 20.16 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా..80 శాతం పనులు పూర్తయ్యాయి. తాజాగా ఫేజ్‌-3కి శ్రీకారం చుట్టారు. 50 రోడ్లను 120.92 కి.మీ మేర నిర్మించేందుకు రూ.1500 కోట్లతో పనులు చేపట్టారు. శివారు మున్సిపాలిటీల్లో పనులు పట్టాలెక్కగా..మిగిలిన చోట టెండర్‌ దశలో ఉన్నాయి.

శివారు ప్రాంతాల్లో…

కొత్తూరు, శంషాబాద్‌, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌, నాగారం, పోచారం, బండ్లగూడ జాగీర్‌, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్‌ సిటీలో ప్రస్తుతం ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వచ్చే 50 ఏండ్ల వరకు ఎలాంటి ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోయేలా రోడ్‌ నెట్‌ వర్క్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణ చేసినట్టు తెలిసింది. ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్‌ ఆమోదించినట్టు సమాచారం.

సోమేశ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించడంతో... ఆయనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది.

ఆయన జనవరి 12న అమరావతికి వచ్చి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ పోస్టింగ్‌ ఇవ్వలేదు. సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణకు దరఖాస్తు చేసుకోవడమే దానికి కారణమని తెలిసింది.

ఎంపీ కోమటిరెడ్డి పార్టీ లైన్‌లోనే ఉన్నారు: మాణిక్‌రావు ఠాక్రే

హైదరాబాద్‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, పార్టీ లైన్‌లోనే ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. రాహుల్‌గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఠాక్రే బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 34 మంది ఉపాధ్యక్షులు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 9మంది మాత్రమే హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుల గైర్హాజరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకు గైర్హాజరయ్యారో వివరణ అడగాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సూచించారు. ఎల్లుండి మరోసారి ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి హాథ్‌ సే హథ్‌ జోడో యాత్రలో పాల్గొంటానని చెప్పారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొందరు ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇంకోసారి మాట్లాడదామని సర్ది చెప్పారు.

M.Mareppa: జగన్ పాలనలో దళితులు, గిరిజనులకు అన్యాయం

ఏపీలో జగన్ పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి మారెప్ప. కుతుహులమ్మ మృతికి సంతాపం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు..

ఎస్సీ ఎస్టీల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్మోహన్ రెడ్డి దారిమళ్ళిస్తున్నారు. దళిత ఉద్యోగులను కూడా ఏపీలో వేధిస్తున్నారు. దళిత గిరిజన కార్పొరేషన్ లకు నిధులు లేవు. గతంలో జీవో వన్ లాంటి జీవో లు ఉండుంటే నీవు ప్రజల్లో తిరిగి ఉండేవాడివా జగన్. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశాడు జగన్ అని మారెప్ప విమర్శించారు..

మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి తనతో పాటు విజయ సాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లకు సీఎం పదవులు ఇస్తాడా? ఏపీ లో ప్రస్తుతం జగన్ పోవాలి పోవాలి అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఢిల్లీ లోని ఏపీ భవన్ లోనూ దళితులకు తీవ్ర అవమానం జరుగుతుంది. మాజీ మంత్రి అయిన నన్ను కూడా తీవ్రంగా అవమానించారని మారెప్ప విమర్శించారు..

Revanth Reddy: ఏసీ గదుల్లో కూర్చొని ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌రెడ్డి

మైలారం(జనగాం): కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తూ, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు.

9 ఏళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)తో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్నప్పుడు పొత్తులపై చర్చ అనవసరమన్నారు. హాథ్‌ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

''అనేక దుర్మార్గాలు, అక్రమాలు చేసి అనేక మంది కార్యకర్తలను జైళ్లకు పంపించారు. కొన్ని గ్రామాల్లో హత్యలు చేశారు ఈ భారాస నేతలు. అలాంటి పార్టీతో కలవాలనే ఆలోచన రావడం కూడా నేరమే అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది.. అధికారంలోకి రావడానికి అన్నీ అవకాశాలున్నాయి. అలాంటప్పుడు పొత్తులపై చర్చ ఎందుకు? సర్వేలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ప్రజల సమస్యలు తెలుసుకునే పనిలోనే నిమగ్నమైయ్యాను. కొంత మంది నాయకులు వారి విలాసవంతమైన, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏసీ గదుల్లో కూర్చొని ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.

AP Capitals: రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. అందుకే బుగ్గన అలా..!

AP Capitals: మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే సీఎం వైఎస్‌ జగన్‌ వైజాగ్ వెళ్తారని తెలిపారు..

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామని వెల్లడించారు..

విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అసెంబ్లీ అమరావతిలో.. హైకోర్టు కర్నూల్‌లో ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది మేం పెట్టుకున్న పేరు.. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎవరూ అస్పష్టత, అపోహలకు గురి కావద్దు.. వికేంద్రీకరణ అజెండాగానే రానున్న ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.