1150కోట్లతో 50 లింకు రోడ్లు ప్రధాన రహదారులపై తగ్గనున్న భారం
ప్రయాణ ప్రయాస, సమయం ఆదా
రోడ్ల నిర్మాణానికి రూ.1150కోట్ల రుణం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఆమోదం
మిగిలిన నిధులను సర్దుబాటు చేయనున్న ప్రభుత్వం
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. శివారులో జనావాసాలూ పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనసాంద్రతకు తగ్గట్లుగా ప్రభుత్వం వసతులు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు, గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. సుమారు రూ.1500 కోట్లతో 120.92 కి.మీమేరలో 50 చోట్ల లింకు రోడ్లను నిర్మించే పనులకు శ్రీకారం చుట్టారు. 5 ప్యాకేజీల్లో చేపడుతున్న ఈ పనులకు నిధుల కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ. 1150 కోట్ల రుణం ఇస్తున్నది. ఈ మేరకు ఐవోబీ చీఫ్ రీజినల్ మేనేజర్ రంజయ మిశ్రా బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కలిసి మంజూరు పత్రాన్ని అందజేశారు. మిగిలిన నిధులను ఆయా మున్సిపాలిటీలు, ప్రభుత్వం నిధులతో పనులను పూర్తి చేయనున్నారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నది. నగరంలో చేపట్టిన లింకు రోడ్లతో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంతో విస్తరిత ప్రాంతాలైన శివారు మున్సిపాలిటీల్లోనూ రహదారులను మరింత విశాలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్‌తో పాటు శివారు మున్పిపాలిటీల్లో పెద్ద ఎత్తున లింకు రోడ్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే 120.92 కి.మీ మేర 50 చోట్ల లింకు రోడ్లను నిర్మించేందుకు సుమారు రూ.1500 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఐదు ఫ్యాకేజీల్లో చేపడుతున్న ఈ పనులకు కీలకమైన నిధుల అడ్డంకి తొలగిపోయింది. రూ.1150 కోట్ల రుణానికి ఆమోదం తెలుపుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ రంజయ మిశ్రా బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కలిసి మంజూరు పత్రాన్ని అందజేశారు. కాగా మిగిలిన నిధులను ఆయా మున్సిపాలిటీలు, ప్రభుత్వం నిధులతో పనులను పూర్తి చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీ విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న మిస్సింగ్ లింకు (లింకు రోడ్ల) పనులకు రుణాలు లైన్ క్లియర్ కావడంతో పనులపై ఆయా శాఖలు దృష్టి సారించాయి.
జనాభాకు అనుగుణంగా వసతులు…
పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. రూ. 2140 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే తొలి విడతలో రూ. 275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువ శాతం వెస్ట్‌జోన్‌లోనే ఉండగా..ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ క్రమంలోనే కోర్ సిటీలోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు ఒక్కటే మార్గం కాదని భావించి లింకు రోడ్లు నిర్మించేందుకు మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫ్లైఓవర్‌కు పెట్టే ఖర్చుతో నాలుగు లింకు రోడ్లు నిర్మితం అవుతుండటంతో ఈ దిశగా అడుగులు వేశారు. ఈ మేరకు కేటీఆర్ ఆదేశాలతో రూ. 207 .26 కోట్లతో 20.16 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా..80 శాతం పనులు పూర్తయ్యాయి. తాజాగా ఫేజ్-3కి శ్రీకారం చుట్టారు. 50 రోడ్లను 120.92 కి.మీ మేర నిర్మించేందుకు రూ.1500 కోట్లతో పనులు చేపట్టారు. శివారు మున్సిపాలిటీల్లో పనులు పట్టాలెక్కగా..మిగిలిన చోట టెండర్ దశలో ఉన్నాయి.
శివారు ప్రాంతాల్లో…
కొత్తూరు, శంషాబాద్, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, పోచారం, బండ్లగూడ జాగీర్, ఘట్‌కేసర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్ సిటీలో ప్రస్తుతం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వచ్చే 50 ఏండ్ల వరకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోయేలా రోడ్ నెట్ వర్క్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
Feb 16 2023, 09:34