తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణ చేసినట్టు తెలిసింది. ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్‌ ఆమోదించినట్టు సమాచారం.

సోమేశ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించడంతో... ఆయనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది.

ఆయన జనవరి 12న అమరావతికి వచ్చి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ పోస్టింగ్‌ ఇవ్వలేదు. సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణకు దరఖాస్తు చేసుకోవడమే దానికి కారణమని తెలిసింది.

ఎంపీ కోమటిరెడ్డి పార్టీ లైన్‌లోనే ఉన్నారు: మాణిక్‌రావు ఠాక్రే

హైదరాబాద్‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, పార్టీ లైన్‌లోనే ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. రాహుల్‌గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఠాక్రే బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 34 మంది ఉపాధ్యక్షులు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 9మంది మాత్రమే హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుల గైర్హాజరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకు గైర్హాజరయ్యారో వివరణ అడగాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సూచించారు. ఎల్లుండి మరోసారి ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి హాథ్‌ సే హథ్‌ జోడో యాత్రలో పాల్గొంటానని చెప్పారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొందరు ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇంకోసారి మాట్లాడదామని సర్ది చెప్పారు.

M.Mareppa: జగన్ పాలనలో దళితులు, గిరిజనులకు అన్యాయం

ఏపీలో జగన్ పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి మారెప్ప. కుతుహులమ్మ మృతికి సంతాపం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు..

ఎస్సీ ఎస్టీల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్మోహన్ రెడ్డి దారిమళ్ళిస్తున్నారు. దళిత ఉద్యోగులను కూడా ఏపీలో వేధిస్తున్నారు. దళిత గిరిజన కార్పొరేషన్ లకు నిధులు లేవు. గతంలో జీవో వన్ లాంటి జీవో లు ఉండుంటే నీవు ప్రజల్లో తిరిగి ఉండేవాడివా జగన్. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశాడు జగన్ అని మారెప్ప విమర్శించారు..

మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి తనతో పాటు విజయ సాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లకు సీఎం పదవులు ఇస్తాడా? ఏపీ లో ప్రస్తుతం జగన్ పోవాలి పోవాలి అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఢిల్లీ లోని ఏపీ భవన్ లోనూ దళితులకు తీవ్ర అవమానం జరుగుతుంది. మాజీ మంత్రి అయిన నన్ను కూడా తీవ్రంగా అవమానించారని మారెప్ప విమర్శించారు..

Revanth Reddy: ఏసీ గదుల్లో కూర్చొని ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌రెడ్డి

మైలారం(జనగాం): కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తూ, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు.

9 ఏళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)తో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్నప్పుడు పొత్తులపై చర్చ అనవసరమన్నారు. హాథ్‌ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

''అనేక దుర్మార్గాలు, అక్రమాలు చేసి అనేక మంది కార్యకర్తలను జైళ్లకు పంపించారు. కొన్ని గ్రామాల్లో హత్యలు చేశారు ఈ భారాస నేతలు. అలాంటి పార్టీతో కలవాలనే ఆలోచన రావడం కూడా నేరమే అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది.. అధికారంలోకి రావడానికి అన్నీ అవకాశాలున్నాయి. అలాంటప్పుడు పొత్తులపై చర్చ ఎందుకు? సర్వేలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ప్రజల సమస్యలు తెలుసుకునే పనిలోనే నిమగ్నమైయ్యాను. కొంత మంది నాయకులు వారి విలాసవంతమైన, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏసీ గదుల్లో కూర్చొని ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.

AP Capitals: రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. అందుకే బుగ్గన అలా..!

AP Capitals: మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే సీఎం వైఎస్‌ జగన్‌ వైజాగ్ వెళ్తారని తెలిపారు..

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామని వెల్లడించారు..

విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అసెంబ్లీ అమరావతిలో.. హైకోర్టు కర్నూల్‌లో ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది మేం పెట్టుకున్న పేరు.. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎవరూ అస్పష్టత, అపోహలకు గురి కావద్దు.. వికేంద్రీకరణ అజెండాగానే రానున్న ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.

ప్రపంచాన్ని ఆకర్షించేలా కొండగట్టును తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్‌

►సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన ముగిసింది. కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరారు..

► కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు.

చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అన్నారు.

►దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని తెలిపారు.

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయానికి బయల్దేరారు. ప్రగతిభవన్‌ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి పయనమయ్యారు. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించనున్నారు. తరువాత జేఎన్టీయూ వెళ్లి.. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు.

కాగా కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయానికి గత వారమే రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే

తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో తెదేపా నేతలు పరస్పర విమర్శలు..
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న-విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం తిరువూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలికులు చింతా బత్తిన శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శావల దేవదత్ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య ఈ సమావేశంలో తనపై ఐ టిడిపి కార్యకర్త సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నాడు అని ఆవేదన వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య తిరువూరు తెదేపా పార్టీ ఇంచార్జీ దేవదత్ మద్దతు తోనే అసభ్య పోస్టులు పెడుతున్నాడు అని సమావేశం లో ఆవేదన చెందిన వాసం మునియ్య. అనుచిత పోస్టులు పెట్టిన ఐ టీడీపీ తిరువూరు నియోజకవర్గ అధ్యక్షుడు బండి శివకేశవ్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన- నెట్టం రఘురామ్. ఇకనుంచి పార్టీకి నష్టం కలిగించేవాళ్ళు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు-నెట్టెం రఘురాం ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓడిపోవాలి పైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే నాయకులు ఇక్కడ ఉన్నారని ఇక్కడ కొంతమంది నాయకులకు ఎలక్షన్లు అంటే పండగా అని అందువల్లనే తన ఓటమికి కారణం-నల్లగట్ల స్వామిదాస్. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకుండా కేవలం కాగితాల్లో చూపెట్టి హై కమాండ్ కు పార్టీ బలోపేతంగా ఉందని చూపిస్తున్నారు-నల్లగట్ల స్వామిదాసు ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలికులు చిట్టాబత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో సమస్యలు తలెత్తినప్పుడు బహిరంగంగా మాట్లాడటం వల్లన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది-చిట్టా బత్తిన శ్రీనివాసరావు ఇద్దరు,ముగ్గురు నాయకులు తనని కలిసినప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు ఒంటరిగా వచ్చి తనని కలిసినప్పుడు మరోలా మాట్లాడుతున్నారు, దీనివల్ల పార్టీకి చాలా నష్టం కలుగుతుంది-చింతా బత్తిన శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గంకి వచ్చినప్పుడు నాయకులలో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా వుంటున్నారు జగన్ వచ్చిన తర్వాత పూర్తిగా దౌర్జన్యం, అరాచకమే రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితి వచ్చింది-నెట్టెం రఘురాం ప్రజాప్రయోజనాలను ఎక్కడా కూడా పట్టించుకోకుండా ప్రజల్ని బెదిరించి అవసరమైతే కేసులు పెడతామని పరిస్థితులు ఉన్నాయి-నెట్టం రఘురాం తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో పూర్తిగా విజయం చేకూర్చకపోతే ఇవే చివరి ఎన్నికలు 2029 ఎన్నికలు మనం ఏమాత్రం చేయలేము-నెట్టెం రఘురాం
NIA RAids: 3 రాష్ట్రాల్లో 60 బృందాలతో ఎన్‌ఐఏ దాడులు.. ఐసిస్‌ సానుభూతిపరులే లక్ష్యంగా..

NIA RAids: ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి..

గతేడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 2022 అక్టోబర్‌లో కోయంబత్తూరులో జరిగిన పేలుళ్లలో జమేజా ముబిన్ మరణించారు. 2019లో ఐఎస్ఐఎస్‌ సంబంధాలపై కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.

ముబిన్ రెండు ఓపెన్ సిలిండర్లతో కారు నడుపుతుండగా, వాటిలో ఒకటి గత ఏడాది అక్టోబర్‌లో పేలిపోయిందని పోలీసులు తెలిపారు. అతని ఇంటిని వెతికిన తర్వాత తక్కువ-ఇంటెన్సివ్ పేలుడు పదార్థం రికవరీ అయింది. అవి భవిష్యత్తు ప్రణాళికలు కోసం ఉద్దేశించినవిగా అనిపించాయని తమిళనాడు పోలీసు చీఫ్ సి.శైలేంద్ర బాబు అన్నారు.

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

అమరావతి: వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు.

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు.

అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు.

Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన పెనుముప్పు..

బీబీనగర్‌: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) (Godavari Express)కు పెను ముప్పు తప్పింది..

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణహాని, గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఎస్‌-1, ఎస్‌-4, జీఎస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేశామని.. అదే రైలులో ప్రయాణికులను పంపిస్తున్నట్లు వెల్లడించింది.