ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం
పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బుధవారం నుంచి అల్పాహారం పంపిణీని ప్రారంభించనున్నది.
ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం
పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
4,785 స్కూళ్లలో 1,89,791 మంది పిల్లలకు ప్రయోజనం
రాష్ట్రంలో 34 రోజులపాటు ఈ పథకం అమలు
పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బుధవారం నుంచి అల్పాహారం పంపిణీని ప్రారంభించనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, మాడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికి స్నాక్స్ అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 9.67 కోట్లు వెచ్చించనున్నది. రాష్ట్రంలోని 4,785 స్కూళ్లలో 1,89,791 మంది విద్యార్థులకు 34 రోజుల పాటు ఈ అల్పాహారం అందించనున్నారు.
ఈ అల్పాహారంలో పోషకాలుండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటీన్లు, ఐరన్, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్నే స్నాక్స్‌గా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గుడ్లు, శనగలు, పల్లీలు, బెల్లం, తాజా పండ్లను అందించనున్నారు. ఇందుకోసం పలు జిల్లాల్లో ప్రత్యేకంగా మెనూను రూపొందించారు. హనుమకొండ జిల్లాలోని 123 స్కూళ్లల్లో 3,258 మంది విద్యార్థులుండగా, రాగిజావ, శనగలు, గుడాలు, ఉప్మాతో పాటు వారంలో ఒకట్రెండు రోజులు ద్రాక్ష, సంత్రాలు, అరటిపండ్లు ఇవ్వాలని నిర్ణయించారు.
మధ్యాహ్న భోజనంలో..
రాష్ట్రంలో అమలవుతున్న మధ్యా హ్న భోజనం పథకంలో కూడా పోషకాలుండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పూర్తిగా సొంత నిధులతో వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, లేదా అరటిపండును అందజేస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి పోషకాల సమ్మేళనమైన ఫోర్టిఫైడ్ రైస్‌తో కూడిన భోజనాన్ని సమకూరుస్తున్నది. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరో 36,154 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సమకూరుస్తున్నది. రాగిజావ, లేత మొలకలు, బెల్లం, పల్లీపట్టి వంటి వాటిని సైతం పిల్లలకు అందజేస్తున్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు 60 రోజుల పాటు వీటిని అందించనున్నారు. తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలు మాత్రమే 9, 10వ తరగతుల వారికి మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుండగా, మిగతా రాష్ట్రాలు కేవలం 1 నుంచి 8వ తరగతుల వారికి మాత్రమే అందజేస్తున్నాయి. ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే నెలకు 12 ఉడకబెట్టిన కోడిగుడ్లను, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని విద్యార్థుల
కిస్తున్నది.
Feb 15 2023, 16:57