ప్రపంచాన్ని ఆకర్షించేలా కొండగట్టును తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్
►సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ముగిసింది. కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరారు..
► కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు.
చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అన్నారు.
►దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని తెలిపారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయానికి బయల్దేరారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి పయనమయ్యారు. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించనున్నారు. తరువాత జేఎన్టీయూ వెళ్లి.. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు.
కాగా కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయానికి గత వారమే రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే
Feb 15 2023, 15:50