యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి
•వెబ్‌సైట్‌లో ఈ-సేవలు
యాదగిరిగుట్ట: మొక్కు పూజల నిర్వహణలో భక్తుల ఆశయాలకు ఆటంకం కలగకుండా, భావాలను మరింత పెంచేలా విధానాలు అమలు కావాలన్న సీఎం దిశానిర్దేశంతో దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
బ్రహ్మోత్సవాల టికెట్లకు సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తెచ్చారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరమయ్యాయి.
వెబ్‌సైట్‌లో ఈ-సేవలు
యాదాద్రిలో ఈ-సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ‘యాదాద్రిటెంపుల్.తెలంగాణ.జీవోవీ.ఇన్’ అనే వెబ్‌సైట్‌లో ఈ సేవలను పొందొచ్చు. ఇందులో నిజాభిషేకం (ఇద్దరికి రూ.800, ఒక్కరికి రూ.400), సహస్రనామార్చన రూ.300, శ్రీ సుదర్శన నారసింహహోమం రూ.1,250, స్వామి వారి కల్యానం రూ.1,500, శయనోత్సవం రూ.100, స్వర్ణపుష్పార్చన రూ.600, సుప్రభాత దర్శనం రూ.100, దర్బార్ సేవ రూ.516, అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ.800, స్కూటర్ పూజ రూ.300, ఆటో పూజ రూ.400, కారు పూజ రూ.500, బస్సు, లారీ, ట్రాక్టర్ పూజ రూ.1000, శాశ్వత నిత్యపూజ పదేళ్లకు రూ.15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ.15వేలుగా నిర్ణయించారు. రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద గదులు ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్ ఏసీకి రూ.560, లక్ష్మీనిలయం నాన్ ఏసీ డీలక్స్ రూ.1000గా నిర్ణయించారు.
బ్రేక్ దర్శనం టికెట్లు..
తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్ దర్శనం టికెట్లను పొందుపరిచారు. ఒక్కోరికి టికెట్ ధర రూ.300, రూ.150 శీఘ్రదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఆలయంలో జరిపే వివిధ ఏర్పాట్లకు విరాళమిచ్చేందుకు ఈ డొనేషన్ సదుపాయం కల్పించారు. దీన్ని ఈ హుండీ అంటారు. ప్రధానాలయం దివ్యవిమాన గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు ఆన్‌లైన్‌లో వితరణ చేయొచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకల్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ధర రూ.3వేలు, ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 28న తిరుకల్యాణం జరగనుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో పేరు, పూజ వివరాలు, గోత్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, తేదీ, వెల, ఎన్ని టికెట్లు, చిరునామా నింపాలి. ఆప్షనల్‌గా నక్షత్రం, రాశి, ఆధార్ నెంబర్, వయసు, ఆలయ సందర్శన వేళల వివరాలు నింపాలి.
Feb 14 2023, 18:51