మోడీ కంటే మన్మోహనే బెటర్.. అదానీ తెలంగాణకు రాలేదు, మన అదృష్టం బాగుంది : అసెంబ్లీలో కేసీఆర్

పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ కంటే మోడీ పాలనలోనే దేశం ఎక్కువగా నష్టపోయిందని.. పార్లమెంట్‌లొ మోడీ స్పీచ్ అధ్వాన్నంగా వుందని కేసీఆర్ చురకలంటించారు.

అదానీ గురించి ప్రధాని ఏం మాట్లాడలేదన్నారు. అదానీ రూపంలో దేశానికి ఉపద్రవం వచ్చిందని.. ఇంత గొడవ జరుగుతున్నా అదానీ గురించి ప్రధాని మాట్లాడలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదానీ ఆస్తి కరిగిపోయిందని.. ఆయన సంస్థలు ఉంటాయో, పోతాయోనని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చాడని.. అదృష్టం బాగుండి మన దగ్గర అదానీ కంపెనీ రాలేదన్నారు.

Etala Rajender: నన్ను డ్యామేజ్‌ చేసేందుకే కేసీఆర్‌ అలా మాట్లాడారు.. ఆ మాటల వెనుక..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) పదే పదే తన పేరు ప్రస్తావించడంపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు..

తనను డ్యామేజ్‌ చేసే వ్యూహంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడారని ఈటల అన్నారు. ఇక అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు.

బీఆర్ఎస్ (BRS)లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లు పిలిచినా పోను అని ఈటల స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో కూడా ఇలానే ప్రచారం చేశారని, తన ప్రశ్నలకు జవాబు చెప్పినంత మాత్రాన పొంగిపోను అని ఈటల తెలిపారు. టీఆర్ఎస్‌లో సైనికుడిగా పనిచేశా.. ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పనిచేస్తానని ఎమ్మెల్యే ఈటల వెల్లడించారు..

ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ పిట్టకథ.. సభలో నవ్వులే నవ్వులు

హైదరాబాద్‌: దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉందని, అయితే, అలా జరగడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ(PM Modi) కి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో సరిపెడుతున్నారు. ఆయన కూడా వాటిని విని మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. అన్నీ తెలిసే సమయానికి ఆయన మాజీ ప్రధాని అయిపోతారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కథను కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

‘‘భారతదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందటున్నారు. అది చాలా తక్కువ. అభివృద్ధికి సూచిక అయిన తలసరి ఆదాయంలో భారత్‌ 138వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువ. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉంది. కానీ, అలా జరగట్లేదు. పైగా అక్కడ అందరూ మోదీని పొగుడుతున్నారు. పార్లమెంట్‌లో ఈ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తోంది. తిరుమల రాయుడనే రాజు ఉన్నాడు. దురదృష్టవశాత్తూ ఆయనకు ఒకటే కన్ను. ఇదే విషయంలో ఆయన బాధపడుతుంటాడు. అదే రాజ్యంలో ఒక కవి కూడా ఉన్నాడు. అతడికి ఏవో సమస్యలు రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయన్ను పొగడాలని అందరూ సలహా ఇస్తారు. కవికి అవసరం ఉంది కాబట్టి, ఇష్టం లేకపోయినా ‘అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురుండవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు.

అంటే, భార్యతో ఉన్నప్పుడు నువ్వు మూడు కళ్ల శివుడవు. ఆయన భార్య రెండు కళ్లతో కలిపి మూడు కళ్లు కలిగినవాడని అర్థం. ఇక భార్యతో లేనప్పుడు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా ‘కౌరవపతి’. అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివి’ అని పొగుడుతాడు. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రధాని మోదీని ఉద్దేశించి ఇలాగే పొగుడుతున్నారు. మంచి పనులు చేయాలి.. అభివృద్ధి చేయాలని చెప్పకుండా ‘బాగుంది.. బాగుంది..’ అని చెబుతున్నారు. మాజీ ప్రధాని అయిన తర్వాత అప్పుడు అసలు సంగతి చెబుతారు. అయినా మాజీ ప్రధాని అంటే తక్కువా. మంచి ప్రదర్శన లేనప్పుడు కూడా అనవసరంగా పొగడటం మంచికి దారితీయదు’’ అంటూ కేసీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నేను చెప్పింది వేరు.. మోదీ చేసింది వేరు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: నోట్ల రద్దు సమయంలో తాను ప్రధాని మోదీని సమర్థించానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే, ఆ వేళ ప్రధానిని కలిసి తాను చెప్పింది వేరని.. మోదీ చేసింది వేరని అన్నారు.

కొందరు భయంతో మాట్లాడకపోవచ్చు.. అందరికీ భయం ఉండదు కదా అని అన్నారు. ‘‘1871 నుంచి 140 ఏళ్లలో దేశంలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదు.

రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ ఆగలేదు. మరి, మోదీ సర్కార్‌ జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు? ఇదే జరిగితే వారి బండారం బయపడుతుందని భయపడుతున్నారు’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

ఈ లెక్కలు అవాస్తవమైతే రాజీనామా చేస్తా: కేసీఆర్‌

హైదరాబాద్‌: అదానీ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. దీనిపై కాకుండా మోదీ ఏవేవో ప్రసంగించారన్నారు.

హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ‘‘మోదీ సర్కారు హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి రేటు ఉందా?

మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 శాతం. ఇప్పుడు 7.1శాతమే. పారిశ్రామిక వృద్ధిరేటు అప్పుడు 5.87 శాతం.. ఇప్పుడు 3.27శాతం. మేకిన్‌ ఇండియా, విశ్వగురు ఎటుపాయె.. నేను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఓటీటీలోకి వీరసింహారెడ్డి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 23(గురువారం) సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

అసలు కథేంటంటే..?

జై అలియాస్ జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ) (Balakrishna), ఆయ‌న‌ తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటారు. అనుకోని సంఘ‌ట‌న వ‌ల్ల జై, ఈషా (శ్రుతి హాసన్) (shruti haasan) ప్రేమలోపడతారు. ఇదే విషయాన్ని ఈషా త‌న తండ్రి (మురళీ శర్మ)తో చెప్పగా.. ఓకే అనడమే కాకుండా జై కుటుంబాన్ని భారత్‌కు రమ్మని చెబుతాడు. ఈ క్రమంలోనే తన తండ్రి వీర సింహారెడ్డి (Balakrishna) బతికే ఉన్నాడనే నిజం జైకి తెలుస్తోంది. మీనాక్షి మాటతో వీర సింహారెడ్డి ఇంస్తాబుల్‌కు వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న వీరసింహారెడ్డి సోదరి భాను (వరలక్ష్మీ శరత్ కుమార్), ఆమె భర్త ప్రతాప్‌రెడ్డి (దునియా విజయ్‌) ఆయనపై దాడి చేస్తారు. అస‌లు త‌న అన్నను చంపాల‌ని భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డికి వీర సింహారెడ్డికి ఉన్న విరోధం ఏంటి? వీర సింహారెడ్డి, మీనాక్షి విడిపోవ‌డాని కార‌ణ‌మేంటి? త‌న తండ్రి గ‌తం తెలుసుకున్న జై శత్రువుల‌కు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగ‌తా క‌థ‌.

మత్తు వలలో పాఠశాల విద్యార్థినులు.. కేరళ పోలీసుల విచారణలో విస్తుబోయే అంశాలు

తిరువనంతపురం : కొద్ది రోజుల క్రితం కేరళ పోలీసుల ఎదుట గంజాయి మత్తులో ఓ యువతి హల్‌చల్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విచారణ చేస్తే తేలిన విషయం ఏంటంటే.. ఆ యువతి చదువులో ఒకప్పుడు టాపర్‌ అని. గంజాయి మాఫియా ఆమెను ఒక క్యారియర్‌గా మార్చి.. చివరకు మత్తుకు బానిసను చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం కేరళలో ఇలా మత్తు వలలో చిక్కుకున్న యువతులు అనేక మంది ఉన్నారని పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీంతో డ్రగ్స్‌ నుంచి వారిని విముక్తులను చేసే దిశగా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా కేరళ పోలీసులు చేపట్టిన సర్వేలో 21 ఏళ్లలోపు ఉన్న యువత డ్రగ్స్‌కు బానిసలైనట్లు వెల్లడైంది. అందులోనూ 40 శాతం మంది వయసు 18 ఏళ్లలోపే ఉండటం విస్తుగొలుపుతోంది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే బాలికలు ఎక్కువగా డ్రగ్స్‌ వాడటం. మత్తుకు బానిసలైన పలువురు విద్యార్థినులు క్యారియర్లుగా పని చేయడం.

గతంలో కళాశాలలో ఎక్కువగా డ్రగ్స్ కేసులు బయటపడ్డాయని, ఇప్పుడు పాఠశాలల్లో డ్రగ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయని కేరళ అదనపు డీజీపీ(లా అండ్‌ ఆర్డర్‌’ ఎంఆర్‌ రంజిత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గంజాయి రవాణాకు పాల్పడే కొందరు మహిళలు బాలికలను ఈ రొంపిలోకి దించుతున్నారు. బాలికలతో సన్నిహితంగా మెలుగుతూ వారితో మాటలు కలిసి డ్రగ్స్‌ బానిసలుగా మారుస్తున్నారు. పాఠశాలల చుట్టూ ఉన్న 18301 చిన్న చిన్న దుకాణాల్లో దాడులు చేయగా డ్రగ్స్‌ అక్కడి నుంచే సరఫరా అవుతున్నట్లు తేలింది. దాంతో 401 కేసులు నమోదు చేశాం. 462 మందిని అరెస్టు చేసి.. 20.97 కిలోల గంజాయి, 186.38 గ్రాముల ఎండీఎంఏ పదార్థం, 1122.1 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. పాఠశాలలపై నిఘా పెంచడంతో కొన్ని ముఠాలు ట్యూషన్‌ సెంటర్లను లక్ష్యంగా చేసుకున్నాయని’ సంచలన విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 472 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 1337 డ్రగ్స్‌ బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు.

ఇక విద్యార్థులను డ్రగ్స్‌ నుంచి విముక్తులను చేసేందుకు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్ సభ్యులు అనేక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు కూర్చునే బెంచీలు, డెస్కులు, పుస్తకాల సంచుల్లో డ్రగ్స్‌ కనిపించడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. చెడు వ్యసనాలను మాన్పించేందుకు కొందరు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని, డ్రగ్స్‌ వాడేయడం మానేస్తామని చెప్పిన ఆ విద్యార్థులు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగితే నోరు విప్పలేదని కౌన్సిలర్‌ అంజుదాస్‌ చెప్పారు. 13ఏళ్లు పైబడిన చాలా మంది విద్యార్థినులకు డ్రగ్స్‌ను వారి బాయ్‌ఫ్రెండ్స్‌ అలవాటు చేశారని, లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఇలాంటి దురలవాట్లను వాడుకున్నారని వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించి తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని హెచ్చరించారు. తరచూ పిల్లల బ్యాగులు చెక్‌ చేయడం, వారి మానసిక, శారీరక ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు.

శాస్త్రీయ విధానంతో రాష్ట్రంలో వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. నేలపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే.. బ్యాక్టీరియా ముప్పు ఉంటుందన్నారు. భూమికి రెండున్నర ఫీట్ల ఎత్తులో ఆహార పదార్థాలు ఉంటే మేలని తెలిపారు.

మోండా మార్కెట్‌ మాదిరిగా రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించామని చెప్పారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నామని.. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. మార్కెట్ల అంశంపై అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడారు.

అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ఆధునికతకు నాంది పలుకుతూ.. అభివృద్ధి పథంలో భారత్‌ : మోదీ

దిల్లీ: వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లడాన్ని భారత్‌ ఎంతో గర్వంగా భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఆధునికతను కొనసాగిస్తూనే సంప్రదాయాలను బలోపేతం చేసుకుంటోందని ఉద్ఘాటించారు. దేశం అనుసరిస్తోన్న విధానాలు ఎటువంటి వివక్షకు తావివ్వడం లేదని.. పేదలు, వెనకబడిన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఆర్యసమాజ్‌ (Arya Samaj) వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి ( Dayananda Saraswati) 200వ జయంతి వేడుకలను దిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడాన్ని భారత్‌ ఎంతో గర్వంగా భావిస్తోంది. ఆధునికతకు నాంది పలుకుతూనే సంప్రదాయాలను కూడా బలోపేతం చేస్తోంది. వారసత్వం, అభివృద్ధి పథంలో దేశం పయనిస్తోంది. పర్యావరణంలో ప్రపంచానికే భారత్‌ మార్గం చూపిస్తోంది. ఈ ఏడాది జీ20 సదస్సును నిర్వహించడం కూడా ఎంతో గర్వకారణం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక దయానంద సరస్వతి చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశలు చిగురింపజేసిందని గుర్తుచేశారు.

మహిళ సాధికారతకు దయానంద సరస్వతి గొంతుకగా మారారని.. సామాజిక వివక్ష, అంటరానితనంపై పోరాటానికి అది ఎంతో దోహదం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సియాచిన్‌లో బాధ్యతలు నిర్వర్తించడం నుంచి రఫేల్‌ వంటి యుద్ధ విమానాలు నడిపే వరకూ మహిళలు ఎన్నో గొప్ప ఆశయాలు సాధిస్తున్నారని అన్నారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమం చరిత్రాత్మకమైందని.. భవిష్యత్తులో మానవాళికి ఇది ప్రేరణగా నిలుస్తుందని వెల్లడించారు.

బస్తీ దవాఖానాల్లో మార్చి ఆఖరుకు 134 రకాల పరీక్షలు: హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చికిత్స అందుతుందని.. త్వరగా రోగాలు కూడా నయమవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.

బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు కోటి మందికిపైగా ప్రజలు చికిత్స పొందారని తెలిపారు. ఇందులో ఉచితంగా లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వివరించారు. మార్చి ఆఖరునాటికి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

బస్తీ దవాఖానాల్లో 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. వీటి ఏర్పాటు వల్ల ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిపై ఓపీ భారం తగ్గిందన్నారు. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషియన్‌ కిట్స్ అందిస్తామని చెప్పారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో త్వరలోనే 1540 ఆశా పోస్టుల భర్తీ చేపడతామన్నారు. క్రమంగా అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు.