భాజపా, మోదీ గెలిచారు.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు!
హైదరాబాద్: ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో భాజపా, మోదీలకు ఓటు వేస్తే, వాళ్లు గెలిచారని, అయితే, భారతదేశ ప్రజలు ఓడిపోయారని అన్నారు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లు అయిందని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు.
‘‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి కారణం ఏంటనేదాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆక్రోశాలపై ప్రజా జీవితంలో ఉన్న వారు చర్చ జరపాలి. అలాంటి వాటికే పవిత్ర దేవాలయం ఈ శాసనసభ. అసలు విషయం పక్కన పెట్టి, ఇంకేదో మాట్లాడుతున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ రోజుకీ పక్షపాత ధోరణులు కనపడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్‌కాలేజ్‌లు ఇస్తే, ఒకటి కూడా రాదు. ఇది ప్రజాస్వామ్యమా? కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? 157 నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తే, ఒకటి కూడా రాదా? కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా జరిగినట్టే. ఈటెల రాజేందర్ అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిని స్వాగతిస్తాం. వాటిపై చర్చిస్తాం’’
‘‘ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. లోకమంతా తెలుసు. రూ.495కోట్లు మనకు రావాలి. వాళ్ల ఖాతాలో వేశారు. ఏడేళ్లుగా అడుగుతున్నా, వాటిని ఇవ్వరేం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, తెలంగాణకు నిధులు కేటాయించలేదని అడిగితే ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నారు. ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. మితిమీరి అహంకార పూరితంగా మాట్లాడకూడదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం మాటలు చూస్తే, కోటలు దాటుతున్నాయి. ఇంతా చేస్తే, దేశ రాజధాని దిల్లీలో తాగటానికి నీరులేదు. రత్నగర్భంలాంటి ఈ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భాజపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారు. సిటిజన్‌షిప్ వదులుకునే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావటం లేదు. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారు ప్రజలు ఓడిపోతున్నారు. 2014లో భాజపా గెలిచింది. మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి. పని ఎక్కువ చేస్తారు. ప్రచారం తక్కువ చేసుకుంటారు. మోదీ కన్నా కూడా ఆయన ఎక్కువ పనిచేశారు. అయితే, ఆయన అవేవీ చెప్పుకోలేదు. మధ్యలో ఉన్నవాళ్లు, మన్మోహన్‌సింగ్ పనిచేయలేదని డప్పు కొట్టారు. దేశాన్ని నమ్మించి గెలిచారు.. పూజా మెహ్రా రాసిన ‘ది లాస్ట్ డెకేడ్’ అందరూ చదవాలి. ప్రజలు పౌరసత్వం వదులుకుని పోతున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. పరిశ్రమలు మూతబడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. 2014లో వీళ్లేదో చేస్తారని అధికారం ఇస్తే, పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిపోయినట్లు అయింది. మోదీ, భాజపా గెలిచాయి.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు. ఆ ప్రజల్లో మన తెలంగాణ కూడా ఉంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘‘వాస్తవంగా మోదీ స్థానంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఉన్నా, లేకపోతే తెలంగాణ అభివృద్ధి గణాంకాలను అందుకుని ఉన్నా మన జీఎస్‌జీపీ 16లక్షల కోట్లు ఉండాలి. ఒక్క తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయింది. ప్రతి రంగంలో దేశం దెబ్బతింది. దివాళ తీసుకుంటూ కూడా తామే గొప్పవాళ్లమని అనుకుంటున్నారు. అదానీ వ్యవహారం చూస్తుంటే, దేశ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం తప్పించేందుకు ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతోంది? అని కాంగ్రెస్, భారాస అడుగుతుంటే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కనీసం కమిటీ వేసి విచారణ జరుపుతామని కూడా చెప్పటం లేదు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం చెబుతారు? ఆయన సంస్థ ఏం చేసిందో తెలియదు. అదానీ సంపద 112 బిలియన్ డాలర్లు కరిగిపోయిందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తెలంగాణలోనూ పెట్టుబడులు పెడతామని వచ్చారు. కానీ, మన జాగా చూపించలేకపోయాం. పలు బ్యాంకులతో పాటు, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయబోతోందనే విషయాన్ని ‘ది ఎకానమిస్ట్’ తన కథనంలో రాసింది. అసలు విషయం పక్కన పెట్టి, మోదీ జబ్బలు చరుకుంటున్నారు. మాట్లాడితే నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి మాట్లాడతారు. వాళ్లు చనిపోయి ఎంతో కాలమైంది. వాళ్లు ఏం చేశారో చెప్పటం ఇప్పుడు అవసరమా? మధ్యలో రాహుల్‌గాంధీ లేచి, మోదీ ఏం కూలగొట్టారో మాట్లాడతారు. వాళ్ల వ్యవహారం చూస్తుంటే ‘ఛోటా భాయ్ శుభానల్లా.. బడే భాయ్ మాషాల్లా’ అన్నట్లు ఉంది. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇదేనా జరిగేది చర్చ. చైనా, జపాన్ దేశాల పురోగతి ఎలా ఉందో చూడరా? అత్యంత సమర్థ ప్రధాని మోదీ’’
Feb 12 2023, 16:22