మత్తు వలలో పాఠశాల విద్యార్థినులు.. కేరళ పోలీసుల విచారణలో విస్తుబోయే అంశాలు
తిరువనంతపురం : కొద్ది రోజుల క్రితం కేరళ పోలీసుల ఎదుట గంజాయి మత్తులో ఓ యువతి హల్‌చల్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విచారణ చేస్తే తేలిన విషయం ఏంటంటే.. ఆ యువతి చదువులో ఒకప్పుడు టాపర్ అని. గంజాయి మాఫియా ఆమెను ఒక క్యారియర్‌గా మార్చి.. చివరకు మత్తుకు బానిసను చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం కేరళలో ఇలా మత్తు వలలో చిక్కుకున్న యువతులు అనేక మంది ఉన్నారని పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీంతో డ్రగ్స్ నుంచి వారిని విముక్తులను చేసే దిశగా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా కేరళ పోలీసులు చేపట్టిన సర్వేలో 21 ఏళ్లలోపు ఉన్న యువత డ్రగ్స్‌కు బానిసలైనట్లు వెల్లడైంది. అందులోనూ 40 శాతం మంది వయసు 18 ఏళ్లలోపే ఉండటం విస్తుగొలుపుతోంది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే బాలికలు ఎక్కువగా డ్రగ్స్ వాడటం. మత్తుకు బానిసలైన పలువురు విద్యార్థినులు క్యారియర్లుగా పని చేయడం.
గతంలో కళాశాలలో ఎక్కువగా డ్రగ్స్ కేసులు బయటపడ్డాయని, ఇప్పుడు పాఠశాలల్లో డ్రగ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయని కేరళ అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్’ ఎంఆర్ రంజిత్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గంజాయి రవాణాకు పాల్పడే కొందరు మహిళలు బాలికలను ఈ రొంపిలోకి దించుతున్నారు. బాలికలతో సన్నిహితంగా మెలుగుతూ వారితో మాటలు కలిసి డ్రగ్స్ బానిసలుగా మారుస్తున్నారు. పాఠశాలల చుట్టూ ఉన్న 18301 చిన్న చిన్న దుకాణాల్లో దాడులు చేయగా డ్రగ్స్ అక్కడి నుంచే సరఫరా అవుతున్నట్లు తేలింది. దాంతో 401 కేసులు నమోదు చేశాం. 462 మందిని అరెస్టు చేసి.. 20.97 కిలోల గంజాయి, 186.38 గ్రాముల ఎండీఎంఏ పదార్థం, 1122.1 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. పాఠశాలలపై నిఘా పెంచడంతో కొన్ని ముఠాలు ట్యూషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకున్నాయని’ సంచలన విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 472 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 1337 డ్రగ్స్ బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు.
ఇక విద్యార్థులను డ్రగ్స్ నుంచి విముక్తులను చేసేందుకు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు అనేక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు కూర్చునే బెంచీలు, డెస్కులు, పుస్తకాల సంచుల్లో డ్రగ్స్ కనిపించడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. చెడు వ్యసనాలను మాన్పించేందుకు కొందరు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, డ్రగ్స్ వాడేయడం మానేస్తామని చెప్పిన ఆ విద్యార్థులు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగితే నోరు విప్పలేదని కౌన్సిలర్ అంజుదాస్ చెప్పారు. 13ఏళ్లు పైబడిన చాలా మంది విద్యార్థినులకు డ్రగ్స్‌ను వారి బాయ్‌ఫ్రెండ్స్ అలవాటు చేశారని, లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఇలాంటి దురలవాట్లను వాడుకున్నారని వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించి తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని హెచ్చరించారు. తరచూ పిల్లల బ్యాగులు చెక్ చేయడం, వారి మానసిక, శారీరక ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు.
Feb 12 2023, 16:07