శాస్త్రీయ విధానంతో రాష్ట్రంలో వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. నేలపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే.. బ్యాక్టీరియా ముప్పు ఉంటుందన్నారు. భూమికి రెండున్నర ఫీట్ల ఎత్తులో ఆహార పదార్థాలు ఉంటే మేలని తెలిపారు.

మోండా మార్కెట్‌ మాదిరిగా రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించామని చెప్పారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నామని.. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. మార్కెట్ల అంశంపై అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడారు.

అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ఆధునికతకు నాంది పలుకుతూ.. అభివృద్ధి పథంలో భారత్‌ : మోదీ

దిల్లీ: వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లడాన్ని భారత్‌ ఎంతో గర్వంగా భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఆధునికతను కొనసాగిస్తూనే సంప్రదాయాలను బలోపేతం చేసుకుంటోందని ఉద్ఘాటించారు. దేశం అనుసరిస్తోన్న విధానాలు ఎటువంటి వివక్షకు తావివ్వడం లేదని.. పేదలు, వెనకబడిన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఆర్యసమాజ్‌ (Arya Samaj) వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి ( Dayananda Saraswati) 200వ జయంతి వేడుకలను దిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడాన్ని భారత్‌ ఎంతో గర్వంగా భావిస్తోంది. ఆధునికతకు నాంది పలుకుతూనే సంప్రదాయాలను కూడా బలోపేతం చేస్తోంది. వారసత్వం, అభివృద్ధి పథంలో దేశం పయనిస్తోంది. పర్యావరణంలో ప్రపంచానికే భారత్‌ మార్గం చూపిస్తోంది. ఈ ఏడాది జీ20 సదస్సును నిర్వహించడం కూడా ఎంతో గర్వకారణం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక దయానంద సరస్వతి చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశలు చిగురింపజేసిందని గుర్తుచేశారు.

మహిళ సాధికారతకు దయానంద సరస్వతి గొంతుకగా మారారని.. సామాజిక వివక్ష, అంటరానితనంపై పోరాటానికి అది ఎంతో దోహదం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సియాచిన్‌లో బాధ్యతలు నిర్వర్తించడం నుంచి రఫేల్‌ వంటి యుద్ధ విమానాలు నడిపే వరకూ మహిళలు ఎన్నో గొప్ప ఆశయాలు సాధిస్తున్నారని అన్నారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమం చరిత్రాత్మకమైందని.. భవిష్యత్తులో మానవాళికి ఇది ప్రేరణగా నిలుస్తుందని వెల్లడించారు.

బస్తీ దవాఖానాల్లో మార్చి ఆఖరుకు 134 రకాల పరీక్షలు: హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చికిత్స అందుతుందని.. త్వరగా రోగాలు కూడా నయమవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.

బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు కోటి మందికిపైగా ప్రజలు చికిత్స పొందారని తెలిపారు. ఇందులో ఉచితంగా లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వివరించారు. మార్చి ఆఖరునాటికి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

బస్తీ దవాఖానాల్లో 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. వీటి ఏర్పాటు వల్ల ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిపై ఓపీ భారం తగ్గిందన్నారు. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషియన్‌ కిట్స్ అందిస్తామని చెప్పారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో త్వరలోనే 1540 ఆశా పోస్టుల భర్తీ చేపడతామన్నారు. క్రమంగా అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు.

భాజపా, మోదీ గెలిచారు.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు!

హైదరాబాద్‌: ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో భాజపా, మోదీలకు ఓటు వేస్తే, వాళ్లు గెలిచారని, అయితే, భారతదేశ ప్రజలు ఓడిపోయారని అన్నారు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లు అయిందని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు.

‘‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి కారణం ఏంటనేదాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆక్రోశాలపై ప్రజా జీవితంలో ఉన్న వారు చర్చ జరపాలి. అలాంటి వాటికే పవిత్ర దేవాలయం ఈ శాసనసభ. అసలు విషయం పక్కన పెట్టి, ఇంకేదో మాట్లాడుతున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ రోజుకీ పక్షపాత ధోరణులు కనపడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్‌కాలేజ్‌లు ఇస్తే, ఒకటి కూడా రాదు. ఇది ప్రజాస్వామ్యమా? కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం అంటే ఇదేనా? 157 నర్సింగ్‌ కాలేజ్‌ మంజూరు చేస్తే, ఒకటి కూడా రాదా? కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా జరిగినట్టే. ఈటెల రాజేందర్‌ అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిని స్వాగతిస్తాం. వాటిపై చర్చిస్తాం’’

‘‘ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. లోకమంతా తెలుసు. రూ.495కోట్లు మనకు రావాలి. వాళ్ల ఖాతాలో వేశారు. ఏడేళ్లుగా అడుగుతున్నా, వాటిని ఇవ్వరేం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, తెలంగాణకు నిధులు కేటాయించలేదని అడిగితే ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నారు. ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. మితిమీరి అహంకార పూరితంగా మాట్లాడకూడదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం మాటలు చూస్తే, కోటలు దాటుతున్నాయి. ఇంతా చేస్తే, దేశ రాజధాని దిల్లీలో తాగటానికి నీరులేదు. రత్నగర్భంలాంటి ఈ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భాజపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారు. సిటిజన్‌షిప్‌ వదులుకునే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావటం లేదు. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారు ప్రజలు ఓడిపోతున్నారు. 2014లో భాజపా గెలిచింది. మన్మోహన్‌ సింగ్‌ మంచి వ్యక్తి. పని ఎక్కువ చేస్తారు. ప్రచారం తక్కువ చేసుకుంటారు. మోదీ కన్నా కూడా ఆయన ఎక్కువ పనిచేశారు. అయితే, ఆయన అవేవీ చెప్పుకోలేదు. మధ్యలో ఉన్నవాళ్లు, మన్మోహన్‌సింగ్‌ పనిచేయలేదని డప్పు కొట్టారు. దేశాన్ని నమ్మించి గెలిచారు.. పూజా మెహ్రా రాసిన ‘ది లాస్ట్‌ డెకేడ్‌’ అందరూ చదవాలి. ప్రజలు పౌరసత్వం వదులుకుని పోతున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. పరిశ్రమలు మూతబడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. 2014లో వీళ్లేదో చేస్తారని అధికారం ఇస్తే, పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిపోయినట్లు అయింది. మోదీ, భాజపా గెలిచాయి.. భారతదేశ ప్రజలు ఓడిపోయారు. ఆ ప్రజల్లో మన తెలంగాణ కూడా ఉంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

‘‘వాస్తవంగా మోదీ స్థానంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఉన్నా, లేకపోతే తెలంగాణ అభివృద్ధి గణాంకాలను అందుకుని ఉన్నా మన జీఎస్‌జీపీ 16లక్షల కోట్లు ఉండాలి. ఒక్క తెలంగాణ 3లక్షల కోట్లు నష్టపోయింది. ప్రతి రంగంలో దేశం దెబ్బతింది. దివాళ తీసుకుంటూ కూడా తామే గొప్పవాళ్లమని అనుకుంటున్నారు. అదానీ వ్యవహారం చూస్తుంటే, దేశ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం తప్పించేందుకు ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతోంది? అని కాంగ్రెస్‌, భారాస అడుగుతుంటే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కనీసం కమిటీ వేసి విచారణ జరుపుతామని కూడా చెప్పటం లేదు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం చెబుతారు? ఆయన సంస్థ ఏం చేసిందో తెలియదు. అదానీ సంపద 112 బిలియన్‌ డాలర్లు కరిగిపోయిందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తెలంగాణలోనూ పెట్టుబడులు పెడతామని వచ్చారు. కానీ, మన జాగా చూపించలేకపోయాం. పలు బ్యాంకులతో పాటు, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయబోతోందనే విషయాన్ని ‘ది ఎకానమిస్ట్‌’ తన కథనంలో రాసింది. అసలు విషయం పక్కన పెట్టి, మోదీ జబ్బలు చరుకుంటున్నారు. మాట్లాడితే నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి మాట్లాడతారు. వాళ్లు చనిపోయి ఎంతో కాలమైంది. వాళ్లు ఏం చేశారో చెప్పటం ఇప్పుడు అవసరమా? మధ్యలో రాహుల్‌గాంధీ లేచి, మోదీ ఏం కూలగొట్టారో మాట్లాడతారు. వాళ్ల వ్యవహారం చూస్తుంటే ‘ఛోటా భాయ్‌ శుభానల్లా.. బడే భాయ్‌ మాషాల్లా’ అన్నట్లు ఉంది. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇదేనా జరిగేది చర్చ. చైనా, జపాన్‌ దేశాల పురోగతి ఎలా ఉందో చూడరా? అత్యంత సమర్థ ప్రధాని మోదీ’’

Telangana: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్..అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్..అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ (Banda Prakash) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్బంగా ఆయనను సీఎం కేసీఆర్ (Cm Kcr) స్వయంగా సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.

Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు..

Hyderabad Langer House: హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో దొంగ వీఐపీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. భూతవైద్యం పేరుతో ఇప్పటివరకూ ఈ బాబా 7 పెళ్లిళ్లు చేసుకున్నాడు..

దయ్యం పట్టిందని నమ్మించి, యువతులను లొంగదీసుకోవడం ఈ బాబా స్పెషాలిటీ. ఇప్పుడు ఇతను 8వ పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఈ పెళ్లికి హాజరయ్యేందుకు సుమారు 200 మంది ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే.. ఆ బాబా రాలేదు. అతని కోసం కొద్దిసేపు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. అమ్మాయి తరఫు వాళ్లు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆ దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగ బాబాకు పక్కం రాష్ట్రంలో ఉన్న బడా రాజకీయ నాయకుల అండ ఉందని సమాచారం.

ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి: కొత్త గవర్నర్ల నయామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు.

నజీర్‌ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించారు.

నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి. ఉదయం మండలి ప్రారంభంకాగానే డిప్యూటీ చైర్మెన్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అధికారికంగా ప్రకటించి ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు.

ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్‌ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగడంతోపాటు ఆమోదం కూడా పొందాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం శాసనసభలో మంత్రి హరీశ్‌ రావు ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై మంత్రులు సమాధానం ఇస్తారు.

Sukanya Samriddhi Account: 2 రోజుల్లో 11 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు

దిల్లీ: దేశంలోని పోస్టాఫీసుల్లో గత రెండురోజుల్లో దాదాపు 11 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు తెరుచుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 32,106 ఖాతాలు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 54,574 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా పోస్టాఫీసుల్లో ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో 10,90,000 ఖాతాలు తెరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

దేశంలో గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి సగటున 33 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు 2.7 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. పదేళ్లలోపు బాలికల పేరుతో ఈ ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో డిపాజిట్‌ చేయడానికి వీలుంది. ఇలా 15ఏళ్లపాటు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఖాతా తెరిచిన నాటి నుంచి 21 ఏళ్ల తర్వాతే మెచ్యూరిటీ వస్తుంది. అమ్మాయికి 18ఏళ్ల తర్వాతకానీ, 10వ తరగతి పాస్‌ అయిన తర్వాతకానీ ఉన్నత విద్యకోసం ఖాతాలోని 50% మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలుకల్పిస్తున్నారు. 18ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వివాహం కోసం ఖాతాను ముందస్తుగా క్లోజ్‌ చేసుకోవడానికీ వీలుంది. ఇందులో చేసే డిపాజిట్‌కు ఆదాయపుపన్ను సెక్షన్‌ 80-సి కింద, దానిపై వచ్చే వడ్డీకి సెక్షన్‌10 కింద పన్నురాయితీ సౌలభ్యం ఉంది.

Delhi-Mumbai Expressway: దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవే.. నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ప్రత్యేకతలివే..

Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు..

ప్రత్యేకతలివే..

ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేకు 2019 మార్చి 9న కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. రాజస్థాన్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ మీదుగా ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. మొత్తం ఈ రహదారి నిర్మాణానికి రూ. లక్ష కోట్లను వెచ్చిస్తోంది. దీని నిర్మాణం కోసం 80 లక్షల టన్నుల సిమెంట్, 12 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. 8 లేన్లుగా నిర్మితం అవుతున్న ఈ రహదారిలో ఒక లైన్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం మాత్రమే..

ఫుడ్ స్టోర్లు, హోటళ్లు వంటివి రహదారిపై ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటళ్లు, హెలిప్యాడ్లు, మొత్తం 94 రకాల సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. రోడ్ వెంబడి 20 లక్షల మొక్కలను నాటుతున్నారు. మధ్యలో వచ్చే అభయారణ్యాల్లో జంతువులకు ఇబ్బంది కలుగకుండా.. భూగర్భం నుంచి రోడ్డు నిర్మించారు. ఇలాంటి సదుపాయాలు ఉన్న రోడ్డు ఆసియాలో మొదటిది కాగా.. ప్రపంచంలో రెండోది. 12 గంటల ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఏటా 32 మిలియన్ లీటర్ల చమురు ఆదా అవడంతో పాటు 850 మిలియన్ కిలోల కర్భన ఉద్గారాలు తగ్గతాయి.