Sukanya Samriddhi Account: 2 రోజుల్లో 11 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు
దిల్లీ: దేశంలోని పోస్టాఫీసుల్లో గత రెండురోజుల్లో దాదాపు 11 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు తెరుచుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 32,106 ఖాతాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 54,574 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా పోస్టాఫీసుల్లో ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో 10,90,000 ఖాతాలు తెరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలో గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి సగటున 33 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు 2.7 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. పదేళ్లలోపు బాలికల పేరుతో ఈ ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో డిపాజిట్ చేయడానికి వీలుంది. ఇలా 15ఏళ్లపాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఖాతా తెరిచిన నాటి నుంచి 21 ఏళ్ల తర్వాతే మెచ్యూరిటీ వస్తుంది. అమ్మాయికి 18ఏళ్ల తర్వాతకానీ, 10వ తరగతి పాస్ అయిన తర్వాతకానీ ఉన్నత విద్యకోసం ఖాతాలోని 50% మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలుకల్పిస్తున్నారు. 18ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వివాహం కోసం ఖాతాను ముందస్తుగా క్లోజ్ చేసుకోవడానికీ వీలుంది. ఇందులో చేసే డిపాజిట్‌కు ఆదాయపుపన్ను సెక్షన్ 80-సి కింద, దానిపై వచ్చే వడ్డీకి సెక్షన్10 కింద పన్నురాయితీ సౌలభ్యం ఉంది.
Feb 12 2023, 15:02