ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి: కొత్త గవర్నర్ల నయామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు.

నజీర్‌ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించారు.

నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి. ఉదయం మండలి ప్రారంభంకాగానే డిప్యూటీ చైర్మెన్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అధికారికంగా ప్రకటించి ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు.

ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్‌ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగడంతోపాటు ఆమోదం కూడా పొందాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం శాసనసభలో మంత్రి హరీశ్‌ రావు ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై మంత్రులు సమాధానం ఇస్తారు.

Sukanya Samriddhi Account: 2 రోజుల్లో 11 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు

దిల్లీ: దేశంలోని పోస్టాఫీసుల్లో గత రెండురోజుల్లో దాదాపు 11 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు తెరుచుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 32,106 ఖాతాలు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 54,574 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా పోస్టాఫీసుల్లో ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో 10,90,000 ఖాతాలు తెరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

దేశంలో గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి సగటున 33 లక్షల సుకన్య సమృద్ధి ఖాతాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు 2.7 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. పదేళ్లలోపు బాలికల పేరుతో ఈ ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో డిపాజిట్‌ చేయడానికి వీలుంది. ఇలా 15ఏళ్లపాటు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఖాతా తెరిచిన నాటి నుంచి 21 ఏళ్ల తర్వాతే మెచ్యూరిటీ వస్తుంది. అమ్మాయికి 18ఏళ్ల తర్వాతకానీ, 10వ తరగతి పాస్‌ అయిన తర్వాతకానీ ఉన్నత విద్యకోసం ఖాతాలోని 50% మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలుకల్పిస్తున్నారు. 18ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వివాహం కోసం ఖాతాను ముందస్తుగా క్లోజ్‌ చేసుకోవడానికీ వీలుంది. ఇందులో చేసే డిపాజిట్‌కు ఆదాయపుపన్ను సెక్షన్‌ 80-సి కింద, దానిపై వచ్చే వడ్డీకి సెక్షన్‌10 కింద పన్నురాయితీ సౌలభ్యం ఉంది.

Delhi-Mumbai Expressway: దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవే.. నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ప్రత్యేకతలివే..

Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు..

ప్రత్యేకతలివే..

ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేకు 2019 మార్చి 9న కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. రాజస్థాన్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ మీదుగా ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. మొత్తం ఈ రహదారి నిర్మాణానికి రూ. లక్ష కోట్లను వెచ్చిస్తోంది. దీని నిర్మాణం కోసం 80 లక్షల టన్నుల సిమెంట్, 12 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. 8 లేన్లుగా నిర్మితం అవుతున్న ఈ రహదారిలో ఒక లైన్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం మాత్రమే..

ఫుడ్ స్టోర్లు, హోటళ్లు వంటివి రహదారిపై ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటళ్లు, హెలిప్యాడ్లు, మొత్తం 94 రకాల సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. రోడ్ వెంబడి 20 లక్షల మొక్కలను నాటుతున్నారు. మధ్యలో వచ్చే అభయారణ్యాల్లో జంతువులకు ఇబ్బంది కలుగకుండా.. భూగర్భం నుంచి రోడ్డు నిర్మించారు. ఇలాంటి సదుపాయాలు ఉన్న రోడ్డు ఆసియాలో మొదటిది కాగా.. ప్రపంచంలో రెండోది. 12 గంటల ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఏటా 32 మిలియన్ లీటర్ల చమురు ఆదా అవడంతో పాటు 850 మిలియన్ కిలోల కర్భన ఉద్గారాలు తగ్గతాయి.

ఏపీ ఉద్యోగులకు షాక్.. నేటికీ అందని జీతాలు !

ఏపీ ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఎప్పటి లాగే నేటికీ జీతాలు అందలేదు.

కొత్త ఏడాదిలో సమయానికి జీతాలు వస్తాయని ఊహించిన ఉద్యోగులకు, పెన్షనర్లకు నిరాశే మిగిలింది..

ఇంకా జీతాలు అందలేదు.

అటు ప్రతి మంగళవారం ఆర్బిఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి దక్కకపోవడంతో, ఇవాళ రుణం పొందే అవకాశం లేదు. దీంతో జీతాలు, పెన్షన్ల చెల్లింపు కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అటు జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయోనని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. కాగా, మరో రెండు రోజుల్లో జీతాలు పడతాయని అధికారులు చెబుతున్నారు.

తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్

బెంగళూరు: గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది.

జనవరి 28న ఆయనను కుప్పం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. హృద్రోగంతో పాటు, నాడీ(న్యూరో) సమస్యలకు ఆ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

విద్యుత్‌ డిమాండ్‌ 14,649 మెగావాట్లు.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికమిదే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో విద్యుత్‌ డిమాండ్‌ అత్యధికంగా రికార్డు స్థాయిలో శనివారం నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 14,649 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ నమోదైనట్టు విద్యుత్‌శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్‌ వినియోగం నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. నిన్న 14,169 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదు కాగా, ఇవాళ అంతకు మించి 14,649 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు అయినట్టు వెల్లడించారు. విద్యుత్‌ వినియోగంలో దక్షిణ భారత దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

వ్యవసాయ నాట్లు ముగింపు దశలో ఉండటం, మొదట్లో వేసిన పంటలు ఏపుగా పెరగడంతో నీటి వినియోగం భారీగా పెరిగింది. ఉద్యాన పంటలకు సైతం నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం బోరుబావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు.

దీంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయానికి 35శాతం మాత్రమే విద్యుత్‌ వినియోగించేవారు. ప్రస్తుతం ఆ వినియోగం 37శాతానికి పెరిగిందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్‌ వినియోగం 6,666 మెగావాట్లు మాత్రమే ఉండేదన్నారు. రానున్న రోజుల్లో 15వేల మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంత డిమాండ్‌ వచ్చినా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 18న భారత్‌కు 12 చిరుతలు

శ్యోపుర్‌: దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా భారత్‌కు రావాల్సిన 12 చిరుతలు ఈ నెల 18న కునో నేషనల్‌ పార్కుకు చేరుకోనున్నాయని అటవీ ఉన్నతాధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు.

తొలుత ఇవి వాయుమార్గం ద్వారా గ్వాలియర్‌కు చేరుకుంటాయని, అక్కడి నుంచి కునోకు వస్తాయని తెలిపారు.

వాటిలో ఆడవి, మగవి ఎన్ని ఉన్నాయనే విషయం తనకు తెలియదని వెల్లడించారు. నిబంధనల ప్రకారం వాటిని ఒక నెల క్వారంటైన్‌లో ఉంచుతామని అధికారి తెలిపారు.

పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల సమస్యలకు సీఎం కేసీఆర్‌ (CM KCR) కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. పోడు భూములపై సీఎంకు గుబులు పుట్టిందని ఆయన విమర్శించారు.

అర్హులైన వారికి అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూముల పట్టాలు ఇస్తామని 2014 నుంచి చెబుతున్నారు.. కానీ, 9ఏళ్లుగా పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. హాథ్‌ సే హథ్‌ జోడో అభియాన్‌ పాదయాత్రలో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లెందు సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అసెంబ్లీని వేదికగా చేసుకుని సీఎం కేసీఆర్‌ పేద ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ సభకు వెళ్తే పోడు భూములకు పట్టాలు రావని భారాస నేతలు బెదిరిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తామని హెచ్చరించారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే.. ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.

CM KCR: 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్‌

•అంజన్న క్షేత్రం అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్‌పై చర్చ!

హైదరాబాద్‌-మల్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్‌ 14న ఆలయానికి చేరుకుని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.

మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి ఆదివారం కొండగట్టు వెళ్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన రూపొందించనున్నారు. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో కొండగట్టు అంజన్న ఆలయం యాదాద్రితరహాలో అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ శాభావం వ్యక్తం చేశారు.

త్వరలో లాల్‌ దర్వాజ ఆలయ పనులు: తలసాని

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ పాతనగరంలోని ప్రసిద్ధ లాల్‌ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ చేపడతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు అక్కడ 10 రోజుల్లో భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం శాసనసభలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆలయ అభివృద్ధిపై మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే బలాలతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘లాల్‌ దర్వాజ ఆలయ విస్తరణకు 1100 గజాల స్థలం గుర్తించాం. ఆ భూముల యజమానులకు పరిహారం ఇచ్చేందుకు కేసీఆర్‌ రూ.8.95 కోట్లు మంజూరు చేశారు. కంచన్‌బాగ్‌, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణాలకు రూ.19 కోట్లు ఇచ్చారు’’ అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.