చల్లని చంద్రుడినే ఆపలేకపోయారు.. ఇప్పుడు మండే సూర్యుడిని ఆపగలరా?
•కేటీఆర్, కేసీఆర్‌లపై మల్లారెడ్డి పొగడ్తలు
హైదరాబాద్: తెలంగాణలో రామచంద్రుల చల్లని పాలన నడుస్తోందని కేటీఆర్, కేసీఆర్‌లను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి పొగడ్తలు గుప్పించారు. ‘రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’ అంటూ ప్రస్తుతించారు.
సభలో పద్దులపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు విరిశాయి. ‘తెలంగాణలో యాదాద్రి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ రూపంలో ఏడు అద్భుతాల్ని చూస్తున్నాం. 28 రాష్ట్రాల్లో కేటీఆర్‌లాంటి ఐటీ మంత్రి ఎక్కడైనా ఉన్నారా..? మొన్న దావోస్ వెళ్లి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. కేటీఆర్ 110 ఏళ్లు దీర్ఘాయుష్షుతో జీవించాలి. కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి మాపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోంది. మీ దోస్త్ అదానీకి అన్నీ అప్పగిస్తే పది దినాల్లోనే రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. టీఆర్‌ఎస్ అంటే చంద్రుడు.. బీఆర్‌ఎస్ అంటే సూర్యుడు. అప్పటి చల్లని చంద్రుడినే ఆపలేకపోయారు ఇప్పుడు మండే సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని తట్టుకోగలరా? రామన్న సీఎం.. కేసీఆర్ పీఎం అవుతారు’ అన్నారు.
Feb 11 2023, 17:54