తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ (Telangana Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Elections) అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. కాగా మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr) పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న కొత్త సచివాలయం ప్రారంభించాల్సి ఉంది.
ఈ అంశంపై సీఈసీతో (CEC) సీఎస్ సంప్రదింపులు జరిపారు. కానీ సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు నగారా మోగిన విషయం తెలిసిందే. త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
Feb 11 2023, 12:17