CM KCR: ఈ నెలాఖరులోపు పోడు భూముల పంపిణీ.. హామీని అతిక్రమిస్తే పట్టాలు రద్దు: కేసీఆర్
హైదరాబాద్: పోడు, అటవీ భూములు కొందరికి ఆటవస్తువుల్లా తయారయ్యాయని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. పోడుభూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో (TS Assembly) కేసీఆర్ మాట్లాడారు.
''గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసు. పోడు భూములపై మాకు ప్రత్యేక విధానం ఉంది. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరులోపు పోడు భూముల పంపిణీని ప్రారంభిస్తాం. 11.5లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తాం. ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని.. పట్టాలు ఇచ్చాక గజం భూమినీ ఆక్రమించబోమని ప్రభుత్వానికి హామీ ఇవ్వాలి. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తాం.
ఆ భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పి్స్తాం. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోం. గుత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికివేయిస్తున్నారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయొద్దు.. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులను సహించబోం. ఇకపై అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టూ కొట్టనివ్వం'' అని కేసీఆర్ అన్నారు.
Feb 10 2023, 19:00