గ్రామ గ్రామాన పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి

•భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్

•బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి బీజేపీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బిజెపి సమావేశానికి హాజరైనారు. బిజెపి చిట్యాల మండలం ఇంచార్జ్ గోపీనాథ్ గారు మాట్లాడుతూ

గ్రామ గ్రామాన పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి ఆ పథకాల పైన అవగాహన కల్పిస్తూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ బూత్ కమిటీ సమావేశంలో తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను అందేలాగా ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ

వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మన బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఉరుమడ్ల భారతీయ జనతా పార్టీ 91వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఉయ్యాల లింగస్వామి, 92వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఈదుల పవన్, 93వ బూత్ కమిటీ అధ్యక్షులుగా బొమ్మకంటి రాము ముదిరాజ్ గార్లను నియమించడం జరిగింది ఈ బూత్ కమిటీలు 22 మందితో సభ్యులతో అన్ని వర్గాల వారిని కలుపుకొని కమిటీలు వేసి పూర్తి చేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఇట్టి బూత్ కమిటీలు ఉరుమడ్ల గ్రామ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనునిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పట్ల పరిష్కార దిశగా అడుగులు వేస్తూ కమిటీ సభ్యులు తోడ్పాటు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లపు ఇస్తారు, పల్లపు బజారు, పాలకూరి వెంకన్న, జన్నపాల జగన్, పాకాల అర్జున్, పల్లపు లింగయ్య, గుంటోజు పవన్, పల్లపు వెంకటేష్, బొడ్డు రాము, కొండ మహేష్, పల్లపు లక్ష్మమ్మ, పల్లపు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు..

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

కిలో రూపాయి పలుకుతున్న టమాట ధర

టమాటాను రోడ్లపై పారబోస్తున్న రైతులు

కర్నూలు

ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిలో రూపాయి పలకడంతో టమోటా రైతులు రవాణా ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు తెచ్చిన టమోటా బాక్స్ లను మార్కెట్ లోనే వదిలి వెళ్లిపోతుండగా.. కొందరు రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్...

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు

2. కడప అనంతపురం కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు

2. కడప- అనంతపురం- కర్నూలు

3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం

ఫిబ్రవరి 16న నోటిఫికేషన్

మార్చి 13న పోలింగ్

మార్చి 16న కౌంటింగ్

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు..

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు..

రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2(PSLVD2) రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు..

నింగిలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు:

సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్‌.

ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా టెస్ట్‌ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.

హైదరాబాద్ లో నేటి నుంచి వివేకా కేసు విచారణ-సీబీఐ కోర్టు ముందుకు ఐదుగురు నిందితులు..

హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగే వైఎస్ వివేకా కేసు విచారణకు హాజరు కావాలని ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు పంపింది. ఇందులో ఇప్పటికే జైల్లో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన సీబీఐ కోర్టు.. బెయిల్ పై ఉన్న మరో ఇద్దరు నిందితులుఎర్ర గంగిరెడ్డి, దస్తగిరికి సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఐదుగురు సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు. వీరంతా హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు తొలిసారి హాజరవుతున్నారు..

వివేకా కేసు సీబీఐ విచారణ మారిన నేపథ్యంలో సీబీఐ దూకుడు కూడా పెంచింది. ఇంతకాలం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ పిలిపించి ప్రశ్నించిన సీబీఐ..

ఆ తర్వాత పులివెందులకు సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ ను పిలిపించి విచారించింది. ఇవాళ సీబీఐ కోర్టు విచారణ ఆధారంగా మరిన్ని చర్యలకు సీబీఐ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే ఈ కేసుతో తమను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల వంటి వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిళలు మసీదుకి వచ్చి ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తారు

మహిళలు మసీదులో నమాజ్ చేయవచ్చని ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో పేర్కొంది

మహిళలు మసీదుకు వచ్చి ప్రార్థనలు చేయకూడదా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ప్రకారం, మసీదులో ప్రార్థనలు చేయడానికి మహిళలకు అనుమతి ఉంది. వాస్తవానికి మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని ఏఐఎంపీఎల్‌బీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదులోకి ప్రవేశించడానికి స్వేచ్ఛ ఉందని, మసీదులో ప్రార్థనలు చేసే హక్కును వినియోగించుకోవాలా వద్దా అనేది వారి ఇష్టం అని బోర్డు పేర్కొంది. దీనితో పాటు, ఇస్లాంలో మహిళలు రోజుకు ఐదుసార్లు సామూహికంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పబడింది.

AIMPLB కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఈ సమాచారం ఇచ్చింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళ్లేందుకు సంబంధించిన పిటిషన్‌కు సంబంధించి ఈ అఫిడవిట్ దాఖలు చేయబడింది. న్యాయవాది MR శంషాద్ ద్వారా దాఖలు చేయబడిన అఫిడవిట్, ప్రార్థనా స్థలాలు (ప్రస్తుత కేసులో ఉన్న మసీదులు) పూర్తిగా ప్రైవేట్ సంస్థలు మరియు మసీదుల 'ముత్తవలీలు' (నిర్వాహకులు) నియంత్రణలో ఉన్నాయని పేర్కొంది.

AIMPLB అనేది నిపుణుల సంఘం అని, దానికి ఎలాంటి అధికారాలు లేవని, ఇస్లాం సూత్రాలపై సలహాలు మాత్రమే జారీ చేయగలదని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం అనుచరుల మత గ్రంథాలు, సూత్రాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం సూత్రాల ప్రకారం ముస్లిం మహిళలు ఇంట్లో నమాజ్ చేసినా లేదా మసీదులో నమాజ్ చేసినా వారికి సమానమైన సవాబ్ (మెరిట్) లభిస్తుందని పేర్కొంది.

భారతదేశంలోని మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆరోపించిన నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని మరియు దీనిని చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫరా అన్వర్ హుస్సేన్ షేక్ 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మీకు తెలియజేద్దాం. ఈ పిటిషన్ మార్చిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

పెను విషాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం..

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా అందులోకి జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

మొదట ఒక వ్యక్తి ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేయడానికి దిగగా..కాలు జారి లోపల పడ్డాడు.

దానిని గమించిన మిగతా కార్మికులు ఒక్కొక్కరు ట్యాంక్ లోకి దిగారు. దీనితో ట్యాంకర్ లో ఊపిరాడకపోవడంతో వీరంతా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు కాగా ఇద్దరు పెద్దాపురం మండలం పులివేరు వాసులుగా తెలుస్తుంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కుల లో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలి

•PDSU కళ్యాణదుర్గం డివిజన్ కార్యదర్శి:పూలగుర్ల వినయ్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టంలోని రాయలసీమ హక్కుగా వచ్చినటువంటి అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి 2016 నవంబర్ లో డీపీర్ లో చెప్పిన విదంగా తక్షణ కర్తవ్యం గా మొత్తం 902 కోట్లకు పైగా నిధులను కేటాయింపు అవసరమని ఈ నిధులను దశల వారీగా కేటాయిస్తామని డీపీర్ ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామం దగ్గర రైతుల నుంచి 495 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. ఇందులో నూతన భవనాలను నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రహరీ గోడల నిర్మించడానికి 9 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు దానిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు.కనుక, రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో నూతన భవనాలను నిర్మించుటకు బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు యూనివర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి చదువు కొరకు వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.

నిజానికి,టీచింగ్ స్టాప్ 49 మంది,నాన్ టీచింగ్ స్టాప్ 51 మంది అవసరం ఉన్నా ఇంతవరకు భర్తీ చేయలేదు.2016 నవంబర్ కేంద్రం సమర్పించిన డీపీర్ లో చెప్పిన విధంగా 2023 కంతా పూర్తిగా భవనాలు నిర్మించి, నూతన భవనాల్లో అడ్మిషన్లు చేపట్టి, బోధన తరగతులు ప్రారంభం అవ్వాలి. కానీ, ఇప్పటి వరకు అసలు రెగ్యులర్ రిజిస్టార్ ని కూడా నియమించ లేదంటే రాయలసీమ పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కనుక, పి డి ఎస్ యు,గా ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కండస్తున్నాము, రానున్న కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి నూతన భవనాన్ని పూర్తి చేయాలి, పూర్తిస్థాయిలో స్టాప్ ని రిక్రూట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము నిధులు కేటాయింపు జరగనియెడల కచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకొని , PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అనీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

ఇంటర్‌ ఫస్టియర్‌.. 70% సిలబస్‌ నుంచే ఎంసెట్‌ ప్రశ్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు.

ఎంసెట్‌ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్‌ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్‌ ఉంటుందన్నారు.

నువ్వా.. నేనా!

•ఆస్ట్రేలియాతో భారత్‌ ఢీ

•నేటి నుంచే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ

•ఉదయం 9.30 నుంచి

ప్రపంచాన్ని జయించినా భారత్‌లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదన్న అసంతృప్తి కసిని పెంచుతుండగా.. సూపర్‌ ఫామ్‌, బలమైన జట్టు ఆత్మవిశ్వాసాన్నిస్తుండగా.. సమరోత్సాహంతో ఆస్ట్రేలియా..!

కంగారూల గడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు నెగ్గడం.. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు, సానుకూల పరిస్థితులు, స్టార్‌ ఆటగాళ్లిస్తున్న ధీమాతో పోరాటానికి సై అంటూ టీమ్‌ఇండియా..!

రసవత్తర సమరానికి వేళైంది. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుండగా సమవుజ్జీలుగా కనిపిస్తోన్న జట్ల మధ్య బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ తొలి టెస్టు నేటినుంచే. విజయంతో శుభారంభం చేసి సిరీస్‌లో పైచేయి సాధించాలన్నది రెండు జట్ల పట్టుదల. మరి స్పిన్‌కు విపరీతంగా సహకరిస్తుందని భావిస్తున్న పిచ్‌పై పైచేయి ఎవరిదో! చూడాలి.. అంచనాలనుందుకునేదెవరో, బోల్తాకొట్టేదెవరో?

పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెప్టెన్‌గా తన అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తుపై కన్నేసిన భారత్‌కు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఆస్ట్రేలియాకు మధ్య బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌ గురువారం ఆరంభమవుతోంది. ఎన్నో మలుపులు, ఎన్నో ఆశ్చర్యకర అంశాలు, ఆటగాళ్ల కెరీర్‌ గమనాన్ని నిర్దేశించే ప్రదర్శనలు ఉండే అవకాశమున్న ఈ సిరీస్‌ క్రికెట్‌ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతోంది. పేలవ ప్రదర్శన చేస్తే ఈ సిరీస్‌ తర్వాత కొందరి కెరీర్‌లు ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్‌, ఆస్ట్రేలియా నాగ్‌పుర్‌లో మొదటి టెస్టుకు సిద్ధమయ్యాయి. కొందరు మాజీలు కంగారూలవైపు మొగ్గు చూపుతున్నా సిరీస్‌లో ఏ జట్టూ ఫేవరెట్‌గా బరిలోకి దిగట్లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఈ సిరీస్‌ మరింత కీలకం. కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే రోహిత్‌సేన డబ్ల్యూటీసీ టైటిల్‌ సమరానికి అర్హత సాధించగలుగుతుంది.

స్పిన్నే ఆయుధంగా..: సొంతగడ్డపై ఆడుతుండడం, స్పిన్‌ బలం టీమ్‌ఇండియాకు సానుకూలాంశాలే. కానీ కీలక బౌలర్‌ బుమ్రా లేకపోవడం లోటే. రోహిత్‌ శర్మ నాయకత్వ పటిమకు ఈ సిరీస్‌ సవాలే. భారత బ్యాటింగ్‌ చూడడానికి బాగానే కనిపిస్తున్నా ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే బ్యాటర్లు సామర్థ్యం మేర రాణించాలి. కోహ్లి ఇటీవల కాలంలో ఫామ్‌ను అందుకున్నట్లే కనిపిస్తున్నా.. ఆస్ట్రేలియాపై పరుగుల వేటలో విజయవంతం కావాలంటే తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సివుంది. రోహిత్‌ కూడా మంచి ఫామ్‌ను అందుకోవడం కీలకం. తుది జట్టు కూర్పు టీమ్‌ఇండియాకు సవాలే. రోహిత్‌కు జోడీగా శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌లో ఎవరిని ఓపెనర్‌గా పంపుతారన్నది ఆసక్తికరం. అంతగా ఫామ్‌లో లేకపోయినా రాహుల్‌కే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ గిల్‌ ఓపెనింగ్‌కు రాకపోతే ఆరో స్థానంలో రావచ్చు. కానీ అక్కడ అతడితో సూర్యకుమార్‌ పోటీ పడుతున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ గమనాన్ని మార్చగల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ దూరం కావడం భారత్‌కు దెబ్బే. అతడి గైర్హాజరీలో పరిస్థితులకు జట్టు ఎలా సర్దుకుపోతుందన్నది మ్యాచ్‌లో కీలకం. పంత్‌ స్థానాన్ని కేఎస్‌ భరత్‌ భర్తీ చేయొచ్చు. అతడి వికెట్‌కీపింగ్‌ నైపుణ్యంపై ఎలాంటి సందేహలు లేవు కానీ.. బ్యాటర్‌గా నాణ్యమైన ఆసీస్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నదే ప్రశ్న. ఇక స్పిన్నే ప్రధాన ఆయుధంగా సిరీస్‌కు సిద్ధమైన భారత్‌.. ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. జడేజా, అశ్విన్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌లలో ఎవరు అవకాశం దక్కించుకుంటారో చూడాలి. సిరాజ్‌, షమి పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు.

కసితో కంగారూలు: స్వదేశంలో గత రెండు సిరీస్‌లలో (2018-19, 2020-21) భారత్‌ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్‌ను భారత్‌లో ఓడించి లెక్క సరి చేయాలనుకుంటోంది. భారత్‌లో సిరీస్‌ విజయం యాషెస్‌ కన్నా మిన్న అని స్టీవ్‌ స్మిత్‌ ఇప్పటికే చెప్పాడు. 1969 నుంచి పది సార్లు భారత్‌లో పర్యటించిన కంగారూ జట్టు.. ఒకే ఒక్కసారి టెస్టు సిరీస్‌ గెలవగలిగింది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్నానని భావిస్తోన్న ఆసీస్‌.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. విపరీతంగా తిరిగే పిచ్‌లు ఉంటాయన్న అంచనాతో బాగానే సన్నద్ధమైంది. కమిన్స్‌ నేతృత్వంలోని ఆ జట్టు సిరీస్‌ ఆశలు నెరవేరాలంటే మాత్రం అసాధారణంగా రాణించాల్సిందే. సవాళ్లను అధిగమించాలంటే శ్రమించాల్సిందే. కేవలం అశ్విన్‌పైనే దృష్టిపెడితేనే సరిపోదు. అయితే ఖవాజా, స్మిత్‌, లబుషేన్‌, వార్నర్‌ రూపంలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోనే బ్యాటర్లు జట్టులో ఉండడం కంగారూలకు గొప్ప బలం. ముఖ్యంగా ఖవాజా, స్మిత్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. లైయన్‌తో ఆస్టన్‌ అగర్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోవచ్చు. పేస్‌ విభాగానికి కమిన్స్‌ నాయకత్వం వహిస్తాడు. గాయంతో ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ దూరం కావడం ఆస్ట్రేలియాకు దెబ్బే.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌/రాహుల్‌, పుజారా, కోహ్లి, జడేజా, శుభ్‌మన్‌ గిల్‌/సూర్యకుమార్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌/కుల్‌దీప్‌, షమి, సిరాజ్‌

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఖవాజా, లబుషేన్‌, స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, హ్యాండ్స్‌కాంబ్‌, కేరీ, కమిన్స్‌, అగర్‌, లైయన్‌, స్కాట్‌ బోలాండ్‌

పిచ్‌

సందేహం లేదు. అంతా ఊహిస్తున్నట్లే పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనుంది. రెండు జట్ల స్పిన్నర్లే మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు బయటికి వచ్చిన ఫొటోల్లో ఏమాత్రం పచ్చిక లేకుండా, పగుళ్లతో కనిపిస్తున్న పిచ్‌ను చూస్తుంటే.. తొలి రోజు నుంచే స్పిన్నర్ల హవా నడిస్తే ఆశ్చర్యం లేదు.

8

స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ విజయాలు. ఈ రెండు జట్ల మధ్య భారత్‌లో 14 సిరీస్‌లు జరిగాయి. అందులో ఆసీస్‌ నాలుగు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి. మొత్తంగా 27 సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా 12, భారత్‌ 10 గెలిచాయి. మరో 5 డ్రాగా ముగిశాయి.

30

ఆస్ట్రేలియాతో ఆడిన 102 టెస్టుల్లో భారత్‌ సాధించిన విజయాలు. 43 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరో మ్యాచ్‌ టైగా ముగిసింది.

1

టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు అశ్విన్‌కు అవసరమైన వికెట్లు. అనిల్‌ కుంబ్లే (619) ముందున్నాడు.

2

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ (9)ను దాటేందుకు స్మిత్‌కు అవసరమైన శతకాలు.

64

అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీకి అవసరమైన పరుగులు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 24,936 పరుగులు చేశాడు. భారత క్రికెటర్లలో సచిన్‌ (34,357) మాత్రమే అతని కంటే ముందున్నాడు.