నువ్వా.. నేనా!
•ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
•నేటి నుంచే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ
•ఉదయం 9.30 నుంచి
ప్రపంచాన్ని జయించినా భారత్‌లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదన్న అసంతృప్తి కసిని పెంచుతుండగా.. సూపర్ ఫామ్, బలమైన జట్టు ఆత్మవిశ్వాసాన్నిస్తుండగా.. సమరోత్సాహంతో ఆస్ట్రేలియా..!
కంగారూల గడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు నెగ్గడం.. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు, సానుకూల పరిస్థితులు, స్టార్ ఆటగాళ్లిస్తున్న ధీమాతో పోరాటానికి సై అంటూ టీమ్‌ఇండియా..!
రసవత్తర సమరానికి వేళైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుండగా సమవుజ్జీలుగా కనిపిస్తోన్న జట్ల మధ్య బోర్డర్-గావస్కర్ సిరీస్ తొలి టెస్టు నేటినుంచే. విజయంతో శుభారంభం చేసి సిరీస్‌లో పైచేయి సాధించాలన్నది రెండు జట్ల పట్టుదల. మరి స్పిన్‌కు విపరీతంగా సహకరిస్తుందని భావిస్తున్న పిచ్‌పై పైచేయి ఎవరిదో! చూడాలి.. అంచనాలనుందుకునేదెవరో, బోల్తాకొట్టేదెవరో?
పరిమిత ఓవర్ల క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా తన అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తుపై కన్నేసిన భారత్‌కు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఆస్ట్రేలియాకు మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్ గురువారం ఆరంభమవుతోంది. ఎన్నో మలుపులు, ఎన్నో ఆశ్చర్యకర అంశాలు, ఆటగాళ్ల కెరీర్ గమనాన్ని నిర్దేశించే ప్రదర్శనలు ఉండే అవకాశమున్న ఈ సిరీస్ క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతోంది. పేలవ ప్రదర్శన చేస్తే ఈ సిరీస్ తర్వాత కొందరి కెరీర్‌లు ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా నాగ్‌పుర్‌లో మొదటి టెస్టుకు సిద్ధమయ్యాయి. కొందరు మాజీలు కంగారూలవైపు మొగ్గు చూపుతున్నా సిరీస్‌లో ఏ జట్టూ ఫేవరెట్‌గా బరిలోకి దిగట్లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఈ సిరీస్ మరింత కీలకం. కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే రోహిత్‌సేన డబ్ల్యూటీసీ టైటిల్ సమరానికి అర్హత సాధించగలుగుతుంది.
స్పిన్నే ఆయుధంగా..: సొంతగడ్డపై ఆడుతుండడం, స్పిన్ బలం టీమ్‌ఇండియాకు సానుకూలాంశాలే. కానీ కీలక బౌలర్ బుమ్రా లేకపోవడం లోటే. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఈ సిరీస్ సవాలే. భారత బ్యాటింగ్ చూడడానికి బాగానే కనిపిస్తున్నా ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే బ్యాటర్లు సామర్థ్యం మేర రాణించాలి. కోహ్లి ఇటీవల కాలంలో ఫామ్‌ను అందుకున్నట్లే కనిపిస్తున్నా.. ఆస్ట్రేలియాపై పరుగుల వేటలో విజయవంతం కావాలంటే తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సివుంది. రోహిత్ కూడా మంచి ఫామ్‌ను అందుకోవడం కీలకం. తుది జట్టు కూర్పు టీమ్‌ఇండియాకు సవాలే. రోహిత్‌కు జోడీగా శుభ్‌మన్ గిల్, రాహుల్‌లో ఎవరిని ఓపెనర్‌గా పంపుతారన్నది ఆసక్తికరం. అంతగా ఫామ్‌లో లేకపోయినా రాహుల్‌కే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ గిల్ ఓపెనింగ్‌కు రాకపోతే ఆరో స్థానంలో రావచ్చు. కానీ అక్కడ అతడితో సూర్యకుమార్ పోటీ పడుతున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగల వికెట్‌కీపర్ బ్యాటర్ పంత్ దూరం కావడం భారత్‌కు దెబ్బే. అతడి గైర్హాజరీలో పరిస్థితులకు జట్టు ఎలా సర్దుకుపోతుందన్నది మ్యాచ్‌లో కీలకం. పంత్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేయొచ్చు. అతడి వికెట్‌కీపింగ్ నైపుణ్యంపై ఎలాంటి సందేహలు లేవు కానీ.. బ్యాటర్‌గా నాణ్యమైన ఆసీస్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నదే ప్రశ్న. ఇక స్పిన్నే ప్రధాన ఆయుధంగా సిరీస్‌కు సిద్ధమైన భారత్.. ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. జడేజా, అశ్విన్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లలో ఎవరు అవకాశం దక్కించుకుంటారో చూడాలి. సిరాజ్, షమి పేస్ బాధ్యతలు పంచుకుంటారు.
కసితో కంగారూలు: స్వదేశంలో గత రెండు సిరీస్‌లలో (2018-19, 2020-21) భారత్ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్‌ను భారత్‌లో ఓడించి లెక్క సరి చేయాలనుకుంటోంది. భారత్‌లో సిరీస్ విజయం యాషెస్ కన్నా మిన్న అని స్టీవ్ స్మిత్ ఇప్పటికే చెప్పాడు. 1969 నుంచి పది సార్లు భారత్‌లో పర్యటించిన కంగారూ జట్టు.. ఒకే ఒక్కసారి టెస్టు సిరీస్ గెలవగలిగింది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్నానని భావిస్తోన్న ఆసీస్.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. విపరీతంగా తిరిగే పిచ్‌లు ఉంటాయన్న అంచనాతో బాగానే సన్నద్ధమైంది. కమిన్స్ నేతృత్వంలోని ఆ జట్టు సిరీస్ ఆశలు నెరవేరాలంటే మాత్రం అసాధారణంగా రాణించాల్సిందే. సవాళ్లను అధిగమించాలంటే శ్రమించాల్సిందే. కేవలం అశ్విన్‌పైనే దృష్టిపెడితేనే సరిపోదు. అయితే ఖవాజా, స్మిత్, లబుషేన్, వార్నర్ రూపంలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోనే బ్యాటర్లు జట్టులో ఉండడం కంగారూలకు గొప్ప బలం. ముఖ్యంగా ఖవాజా, స్మిత్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. లైయన్‌తో ఆస్టన్ అగర్ స్పిన్ బాధ్యతలు పంచుకోవచ్చు. పేస్ విభాగానికి కమిన్స్ నాయకత్వం వహిస్తాడు. గాయంతో ఆల్‌రౌండర్ గ్రీన్ దూరం కావడం ఆస్ట్రేలియాకు దెబ్బే.
తుది జట్లు (అంచనా)... భారత్: రోహిత్, శుభ్‌మన్ గిల్/రాహుల్, పుజారా, కోహ్లి, జడేజా, శుభ్‌మన్ గిల్/సూర్యకుమార్, కేఎస్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్/కుల్‌దీప్, షమి, సిరాజ్
ఆస్ట్రేలియా: వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, హ్యాండ్స్‌కాంబ్, కేరీ, కమిన్స్, అగర్, లైయన్, స్కాట్ బోలాండ్
పిచ్
సందేహం లేదు. అంతా ఊహిస్తున్నట్లే పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. రెండు జట్ల స్పిన్నర్లే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు బయటికి వచ్చిన ఫొటోల్లో ఏమాత్రం పచ్చిక లేకుండా, పగుళ్లతో కనిపిస్తున్న పిచ్‌ను చూస్తుంటే.. తొలి రోజు నుంచే స్పిన్నర్ల హవా నడిస్తే ఆశ్చర్యం లేదు.
8
స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ విజయాలు. ఈ రెండు జట్ల మధ్య భారత్‌లో 14 సిరీస్‌లు జరిగాయి. అందులో ఆసీస్ నాలుగు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి. మొత్తంగా 27 సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా 12, భారత్ 10 గెలిచాయి. మరో 5 డ్రాగా ముగిశాయి.
30
ఆస్ట్రేలియాతో ఆడిన 102 టెస్టుల్లో భారత్ సాధించిన విజయాలు. 43 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరో మ్యాచ్ టైగా ముగిసింది.
1
టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు అశ్విన్‌కు అవసరమైన వికెట్లు. అనిల్ కుంబ్లే (619) ముందున్నాడు.
2
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ (9)ను దాటేందుకు స్మిత్‌కు అవసరమైన శతకాలు.
64
అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీకి అవసరమైన పరుగులు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 24,936 పరుగులు చేశాడు. భారత క్రికెటర్లలో సచిన్ (34,357) మాత్రమే అతని కంటే ముందున్నాడు.
Feb 09 2023, 08:11