పతంగ్ కారెక్కుతుందా? ‘చేతి’కి చిక్కుతుందా??
అసెంబ్లీ ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో జరగనున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ ఇప్పుడు చర్చోపచర్చలకు కేంద్ర బిందువైంది. అసెంబ్లీలో ‘నువ్వా-నేనా’ అన్నట్లు మంత్రి కేటీఆర్, మజ్లిస్ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో.. అధికార బీఆర్ఎస్‌కు, మజ్లిస్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఆ వెంటనే.. కాంగ్రెస్ ముఖ్య నేత అక్బరుద్దీన్‌ను కలవడం.. సుదీర్ఘంగా భేటీ అవ్వడంతో పతంగ్(మజ్లిస్ పార్టీ గుర్తు) కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలపై చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ పక్కపక్కనే కూర్చొని, పిచ్చాపాటి మాట్లాడడం.. పాతనగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడం మళ్లీ చర్చనీయాంశమైంది.
మజ్లిస్ వ్యూహమే సపరేటు..!
మజ్లిస్ పార్టీ రాజకీయ ప్రస్తానం 60లలో అప్పటి మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) ఎన్నికలతో ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో అప్పటి పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ(సాలార్) పోటీ చేసి, విజయం సాధించారు. ఆ తర్వాత.. క్రమంగా పాతనగరంపై పట్టు సాధించారు. చార్మినార్, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర నియోజకవర్గాలను కంచుకోటగా మార్చుకున్నారు. పాతనగరం పరిధిలోని మలక్‌పేట్, కార్వాన్‌లు అప్పట్లో బీజేపీ కంచుకోటలు కాగా.. ఆసిఫ్‌నగర్(ప్రస్తుతం నాంపల్లి)పై కాంగ్రెస్ పట్టు ఉండేది. మజ్లిస్ తాను టార్గెట్‌గా చేసుకున్న నియోజకవర్గాల్లో తొలుత క్యాడర్‌ను పెంచుకుంటుంది. తర్వాత ఓటుబ్యాంకును అభవృద్ధి చేసుకుంటుంది. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కొనసాగిస్తుంది. ఓటుబ్యాంకు, ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుని.. అవసరమైన చోట సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుంది.
అలా.. 1999లో కార్వాన్‌ను, 2004లో ఆసిఫ్‌నగర్(ప్రస్తుతం నాంపల్లి)ను దక్కించుకుంది. అప్పట్లో ఆసిఫ్‌నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు టికెట్ దొరక్క.. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశాలతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాతి పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని అవకాశంగా మలచుకున్న మజ్లిస్.. వివాద రహితుడైన నవాబ్ మౌజంఖాన్‌ను బరిలోకి దింపి, ఆ స్థానంలో పాగా వేసింది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు మజ్లిస్‌కు హైదరాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఏడు నియోజకవర్గాలు కంచుకోటల్లా ఉన్నాయి. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. ఇతర ప్రాంతాల్లోనూ పాగా వేసింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ బలాబలాలు, ఓటుబ్యాంకును బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఘంటాపథంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడమే కాకుండా.. 15 స్థానాలను గెలుచుకుంటామని తేల్చిచెప్పారు.
మజ్లిస్ మద్దతు కీలకమే!
మజ్లిస్ పార్టీ మద్దతు ప్రధాన పార్టీలకు అవసరమే అని గత ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు కాంగ్రెస్-మజ్లిస్ కలిసే ఎన్నికల బరిలోకి వెళ్లేవి. మజ్లిస్ కంచుకోటల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీ చేయగా.. ఇతర నియోజకవర్గాల్లోని మజ్లిస్ ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు కలిసి వచ్చేది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మజ్లిస్‌కు-కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన అక్బరుద్దీన్‌పై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో.. 2014లో మజ్లిస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలవడంతో.. 2018లో ఇరుపార్టీలు అవగాహనతో తమ అభ్యర్థులను నిలబెట్టాయి.
టీఆర్ఎస్‌కు మజ్లిస్ మద్దతు అవసరమా?
2014లో నిజామాబాద్ అర్బన్ స్థానంలో మజ్లిస్ పోటీ చేసి.. 23% ఓట్లను సాధించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి 31% ఓట్లను పొందారు. అలా.. రాజేంద్రనగర్‌లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన సున్నం రాజమోహన్‌కూ ఓట్ల శాతం ఫర్వాలేదనిపించింది. అప్పట్లో టీడీపీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్(ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు) విజయం సాధించారు. ఇలా పలు నియోజకవర్గాల్లో మజ్లిస్ తనకు ఓటుబ్యాంకు ఉందని నిరూపించుకుంది. పలు స్థానిక సంస్థల్లోనూ మజ్లిస్ ప్రతినిధులున్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా.. కేంద్రంలో మోదీ సర్కారును గద్దెదింపాలని కంకణబద్ధుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ మజ్లిస్ దోస్తీని వదులుకోబోరని తెలుస్తోంది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌ను ఆహ్వానించారని, పాతనగర అభివృద్ధిపై అప్పటికప్పుడు సమీక్ష జరిపారని స్పష్టముతోంది.
కాంగ్రెస్‌కూ అవసరమే..!
తెలంగాణను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అటు ఏపీలో మొత్తానికి ఖాళీ అయినంతపనైంది. తెలంగాణలో అత్తెసరు సీట్లు వచ్చినా.. ఆ పార్టీ శాసనసభ్యులు చాలా వరకు బీఆర్ఎస్‌లో చేరడంతో.. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఆవేశంగా మాట్లాడడం.. పాతనగరానికి ఏమిచ్చారంటూ ప్రభుత్వాన్ని నిలదీయడంతో.. కాంగ్రెస్ ఆ పార్టీకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్‌తో టీపీసీసీ నేత భట్టి విక్రమార్క సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో వివరాలేమీ బయటకు రాలేదు. అటు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం.. మజ్లిస్‌తో పొత్తుపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా?
మజ్లిస్‌తో తమకు గ్యాప్ పెరిగిందని బీఆర్ఎస్ తన వ్యూహంలో భాగంగానే క్రియేట్ చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. హిందుత్వ కార్డుతోనే ఎన్నికల బరిలో దిగుతుందనేది నిర్వివాదాంశం. మజ్లిస్‌తో పొత్తు బూచీని చూపి, బీఆర్ఎస్ ఓటుబ్యాంకులోని హిందువుల ఓట్లను చీల్చే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్‌కు దూరమైతే ఆ పరిస్థితి ఉండదనేది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌తో మజ్లిస్ జతకడితే.. అది టీఆర్ఎస్‌కే లబ్ధి చేకూర్చే అవకాశాలున్నట్లు గులాబీ నేతలు భావిస్తున్నారు. 50 స్థానాల్లో పోటీపై ప్రకటన చేసిన మజ్లిస్.. ఆ స్థాయిలోనే స్థానాలను పొత్తులో భాగంగా అడిగే అవకాశాలున్నాయి. ముస్లింలు చాలా వరకు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. అయితే.. మజ్లిస్ బరిలో ఉంటే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు చీలిపోయి, టీఆర్ఎస్‌కు కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో.. మజ్లిస్-బీఆర్ఎస్‌ల గ్యాప్ గులాబీ సృష్టే అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు.. ఎన్నికల నాటికి వ్యూహాలు-ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతాయి? పతంగ్ కారెక్కుతుందా? లేక ‘చేతి’కి చిక్కుతుందా? అనేది తేలాలంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచిచూడాల్సిందే..!
Feb 09 2023, 06:52