Rahul Gandhi: జీవీకేను బెదిరించి అదానీకి అనుభవం లేకున్నా ముంబై విమానాశ్రయం కట్టబెట్టారు
ఆంధ్రాలో కూడా రేవులను అప్పగించారు.
మోదీ... అదానీతో మీ సంబంధాలేంటి?
రక్షణ నుంచి అన్ని కాంట్రాక్టులూ అదానీకే
ఆయన కోసమే మోదీ విదేశీ యాత్రలు
609 నుంచి 2వ స్థానానికి ఎలా ఎదిగారు?
8 ఏళ్లలో ఆయన సంపద 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లు ఎలా అయింది?
యాత్రలో ప్రతిచోటా ప్రజలు ఇవే ప్రశ్నలు అడిగారు
లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
అదానీ విమానంలో మోదీ ఉన్న ఫొటో ప్రదర్శన.
అదానీ వ్యాపార సామ్రాజ్యానికి ప్రధాని మోదీ అండదండలు న్నాయి. విమానాశ్రయాల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేకపోయినా.. ఆయన కంపెనీ కోసం నిబంధనలు మార్చారు. 6 విమానాశ్రయాలు కట్టబెట్టారు. జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న ముంబై విమానాశ్రయాన్నీ బలవంతంగా వారి నుంచి లాక్కొని అదానీకి అప్పగించారు. అదానీతో మోదీకి ఉన్న సంబంధం ఏమిటి?
అదానీ వ్యాపార సామ్రాజ్యానికి ప్రధాని మోదీ అండదండలున్నాయి. విమానాశ్రయాల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేకపోయినా.. ఆయన కంపెనీ కోసం నిబంధనలు మార్చారు. 6 విమానాశ్రయాలు కట్టబెట్టారు. జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న ముంబై విమానాశ్రయాన్నీ బలవంతంగా వారి నుంచి లాక్కొని అదానీకి అప్పగించారు. అదానీతో మోదీకి ఉన్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై విరుచుకుపడ్డారు. అదానీ వ్యాపార సామ్రాజ్యానికి మోదీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. విమానాశ్రయాల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ అదానీకి అనుకూలంగా నిబంధనలు మార్చి, ఆయనకు ఆరు విమానాశ్రయాలు కట్టబెట్టారని తెలిపారు. ముంబై విమానాశ్రయాన్ని జీవీకే గ్రూపు నిర్వహిస్తుండగా, సీబీఐ, ఈడీలతో ఈ గ్రూపుపై దాడి చేయించి, ఆ విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించేలా చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రేవులను ఇదే విధంగా అదానీకి కట్టబెట్టారన్నారు. తన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది అదానీ అని చెప్పారు.
ఏ వ్యాపారంలోకి ప్రవేశించినా అదానీకి విజయమే తప్ప వైఫల్యం లేకపోవడానికి కారణం ఏంటని ప్రజలు తనను అడిగారని తెలిపారు. అదానీ విమానంలో ఆయనతో కలిసి మోదీ ప్రయాణిస్తున్నట్లున్న ఫొటోను రాహుల్ ప్రదర్శించారు. నిన్నటి వరకు అదానీ వ్యవహారంపై పార్లమెంటును స్తంభింపచేసిన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మంగళవారం తమ వ్యూహాన్ని మార్చుకుని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున చర్చను రాహుల్ గాంధీ ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రసంగించిన రాహుల్... అదానీతో మోదీకి ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటని నిలదీశారు. ఒకప్పుడు ప్రపంచంలో 609వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు రెండో స్థానానికి ఎదిగారని, 2014 నుంచి 2022 మధ్య ఆయన సంపద 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఇదెలా సాధ్యమైందని జోడోయాత్రలో తనను ప్రజలు అడిగారని చెప్పారు. మోదీతో సాన్నిహిత్యం వల్లే అనేక రంగాల్లో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు, అదానీకి మధ్య సంబంధాలు ప్రారంభమయ్యాయని, వారిద్దరూ భుజం భుజం కలిపి నడిచారన్నారు. మోదీ 2014లో ఢిల్లీ చేరుకున్న తర్వాత అసలైన అద్భుతాలు జరిగాయని అన్నారు. విమానాశ్రయాలు, రేవులు, డాటా సెంటర్లు, హరిత విద్యుత్ వంటి రకరకాల వ్యాపారాల్లోకి అదానీ ప్రవేశించగలిగారని చెప్పారు. అదానీకి విమానాశ్రయాల నిర్వహణలో అనుభవం లేకపోయినా ఆయనకు అనుకూలంగా నిబంధనలు మార్చారని, ఆరు విమానాశ్రయాలు కట్టబెట్టారన్నారు.
మోదీ బంగ్లాదేశ్ వెళ్లిన తర్వాత అక్కడ విద్యుత్తు కాంట్రాక్టు అదానీకి దక్కిందని, శ్రీలంకలో మోదీ అప్పటి అధ్యక్షుడు రాజపక్సపై ఒత్తిడి తెచ్చి అదానీకి గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్టు దక్కేలా చేశారని ఆ దేశ విద్యుత్ బోర్డు అధికారే చెప్పారని తెలిపారు. మారిష్‌సలో అదానీకి షెల్ కంపెనీలు ఉన్నాయని, అక్కడి నుంచి భారత్‌కు నిధులు భారత్‌కు ప్రవహించాయన్నారు. ఇలాంటి వ్యక్తికి రక్షణ రంగ కాంట్రాక్టులు అప్పగించడం ప్రమాదకరం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో విమర్శించారు. భారీ కుంభకోణాలతో దేశ ప్రతిష్ఠను మసకబార్చింది కాంగ్రెసేనని అన్నారు. అదానీ గ్రూపు అక్రమాల పుట్ట అంటూ హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తునకు జేపీసీ ఏర్పాటు చేయాని రాజ్యసభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Feb 08 2023, 18:07