Ap Cabinet Meeting: ఏపీ కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో 55 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇక న్యూ ఎనర్జీ పార్క్ తో పాటు కర్నూల్, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..

Mekapati Chandrashekar Reddy: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. చెన్నైకు తరలింపు ?

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు..

ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించారు.

గుండెలో రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్టు డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకు తరలించే అవకాశం ఉందని సమాచారం..

దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్​ కేసు దర్యాప్తులో ఈడీ, సీబీఐలు దూకుడు పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు పాత్ర ఉందని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఈ కేసు అనుబంధ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్​లో భాగంగా సౌత్‌గ్రూప్‌ విజయ్‌నాయర్ ద్వారా… ఆప్‌ నేతలకు 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని తెలిపింది.

విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65శాతం కవిత…. మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత 3 కోట్ల 40 లక్షలు, మాగుంట 5కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

Joe Biden: చైనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన బైడెన్‌..

Joe Biden: తమ సార్వభౌమత్వాన్ని ఎవరూ అడ్డుకున్నా.. వారికి బలంగా సమాధానం ఇస్తామని బైడెన్ అన్నారు. ఇవాళ ఆయన అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన చైనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తమ సార్వభౌమత్వానికి చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని అన్నారు. దానికి తగినట్లే వ్యవహరిచామని కూడా ఆయన తెలిపారు. గత శనివారం చైనా నిఘా బెలూన్‌ను పేల్చివేసిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో పరోక్షంగా వెల్లడించారు.

ఒక విషయంలో అందరూ స్పష్టంగా ఉండాలని, చైనాతో జరుగుతున్న వ్యాపార పోరాటంలో గెలుపు అనేది అందర్నీ కలపాలని, ప్రపంచవ్యాప్తంగా తమ దేశానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని, గత రెండేళ్లలో ప్రజాస్వామ్యాలు బలపడ్డాయని, కానీ బలహీనపడలేదని బైడెన్ తెలిపారు. అమెరికా ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు.

స్టేట్ ఆఫ్ ద యూనియన్‌లో బైడెన్ ప్రసంగించడం ఇది రెండోసారి. ఈసారి ఆయన ఉభయసభలను ఉద్దేశించి గంటా 15 నిమిషాలు మాట్లాడారు. బైడెన్ ప్రసంగాన్ని రిపబ్లికన్లు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు.

RBI: రెపోరేటును పెంచిన ఆర్బీఐ.. మరింత పెరగనున్న వడ్డీల భారం..

RBI Policy Review: అంచనాలకు అనుగుణంగానే రిజర్వు బ్యాంకు ఇండియా రెపోరేటును పావుశాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది..

దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

బుధవారం ద్రవ్య విధాన ప్రకటనను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా ద్రవ్యపరపతి విధానంలో సవాళ్లు ఎదురయ్యాయన్నారు. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచింది..

నారాయణ విద్యాసంస్థల వేధింపులకు బలవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి

•విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల రూపంలో ప్రచార కార్యక్రమం

నారాయణ విద్యాసంస్థల వేధింపులకు బలవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల రూపంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగాపిడిఎస్యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ ఏఐఎస్ఎ జిల్లా కార్యదర్శి అబ్దుల్ ఆలం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యచంద్ర యాదవ్, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, విద్యార్థి యువజన నాయకులు కసాపురం ఆంజనేయులు, అనంత హక్కుల పోరాట సంఘం సోమర రాహుల్, అనంత విద్యార్థి సంఘం వెంకటేష్, మాట్లాడుతూ

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల నాలాయన గర్ల్స్ క్యాంపస్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నారాయణ యాజమాన్యం మొత్తం ఫీజులో 2000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కాలేజీ యాజమాన్యం ఫీజు కట్టమని విద్యార్థిని ఒత్తిడి చేశారు . విద్యార్థిని అవమానంతో ఒత్తిడి తట్టుకోలేక 6-2-2023 తేది సోమవారం మధ్యాహ్నం సమయంలో కాలేజీ భవనం మూడవ అంతస్తు నుండి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థికి తీవ్ర గాయాలైనాయి . సవేరా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని బెంగళూరు హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నారాయణ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి . ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి. ఫీజుల పేరుతో ఎవరిని వేధించరాదు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రతిభ భారతి, పిడిఎస్యు నగర అధ్యక్షులు శంకర్, మరియు నాయకులు

వేణు, చిన్న, హరీష్ ,హర్ష ,అజయ్, ప్రవీణ్ ,కార్తీక్ ,మహేష్, తదితరులు పాల్గొన్నారు

SPO ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి

PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు:మల్లెల ప్రసాద్

రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన SPO లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి రాష్ట్రంలో ఎస్ పి ఓ ఉద్యోగాలు తొలగించడం వల్ల చెక్ పోస్ట్ వద్ద భద్రత లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కర్ణాటక మద్యం మాదకద్రవ్యాలు గుట్కా ప్యాకెట్లు విచ్చలవిడిగా

గ్రామస్థాయిలో కూడా మద్యపానం మాదకద్రవ్యాలు గుట్కా అన్ని కూడా సరఫరా అవుతున్నాయి, వీటిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీఓ ఉద్యోగాలను ఎలాంటి సమాచారం వారికి ఇవ్వకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు ప్రకటించడం దారుణం ఎంతోమంది యువకులకు ఉపాధి లేకుండా చేసేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి.

ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ SPO లకు మళ్ళీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా యువకులకు పూర్తిగా ఉపాధి లేకుండా చేస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు చెక్ పోస్టులు వద్ద SPO లు లెక్క పోవడం తో కర్ణాటక రాష్ట్రము నుంచి మద్యం గుట్కా మాధక ద్రవ్యలు విచ్చలవిడిగా వస్తున్నపటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి ఈ SPO ఉద్యోగాలపై సరైన వంటి పద్ధతి కాదు మీ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఎస్పీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలిలేని పక్షంలో చలో అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.

డబుల్ డెక్కర్.. ఖుషీగా టూర్

నగర ప్రయాణికులకు ఇది ఖుషీ ఖబర్‌. ప్రజల ఆకాంక్ష మేరకు మంత్రి కేటీఆర్‌ చొరవతో నగరానికి డబుల్‌ డెక్కర్‌ బస్సులు వచ్చాయి. ఒకప్పుడు డీజిల్‌తో నడిచిన ఈ బస్సులు తాజాగా ఎలక్ట్రిక్‌ బస్సులుగా మహానగరంలో పరుగులు పెట్టనున్నాయి. మంగళవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయంలో ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్‌ బస్సులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మొబిలిటీ వీక్‌ కార్యక్రమంలో భాగంగా హైటెక్స్‌లో జరిగే ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శనలో ఈ బస్సులను ఉంచనున్నారు.

డబుల్‌ డెక్కర్‌ బస్సులు హైదరాబాద్‌ మహానగరంలో అడుగు పెట్టాయి. ఒకప్పుడు డీజిల్‌తో నడిచిన ఈ బస్సులు తాజాగా ఎలక్ట్రిక్‌తో నడువనున్నాయి. గతంలో నగర వాసులను ఎంతగానో అలరించిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తే, మళ్లీ వాటిని తీసుకురావాలన్న ప్రజల డిమాండ్‌ మేరకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. మంగళవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ప్రాంగణానికి చేరుకున్న 3 ఎలక్ట్రిక్‌ బస్సులను చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న మొబిలిటీ వీక్‌లో భాగంగా ఈ బస్సులను ఈవీ ప్రదర్శనలో ఉంచనున్నారు.

11న నగరంలో పరుగులు..

అంతర్జాతీయ ఫార్ములా -ఇ పోటీలు ఫిబ్రవరి 11న నగరంలో జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను అదే రోజు ఫార్ములా-ఈ ట్రాక్‌లో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులను ప్రధానంగా ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, ప్యారడైజ్‌ మరియు నిజాం కాలేజీ ప్రాంతాలను చుట్టి వచ్చేలా ఒక మార్గాన్ని నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి 11 తర్వాత, నగరానికి పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్‌ సర్యూట్‌లో ఉపయోగించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్‌లో డబుల్‌ డెకర్‌ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. సంప్రదాయ డబుల్‌ డెకర్‌ బస్సులు నిజాం కాలంలో ప్రారంభించగా, అప్పటి నుంచి 2003 వరకు నగరంలో తిరిగాయి. ట్విట్టర్‌లో పౌరుల అభ్యర్థన మేరకు, ఆ బస్సుల్లో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్‌, డబుల్‌ డెకర్‌ బస్సులను తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు హెచ్‌ఎండీఏ ఆరు ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెకర్‌ బస్సుల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. అందులో మూడు బస్సులను మంగళవారం డెలివరీ చేయడంతో జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.

డబుల్‌ డెక్కర్‌ బస్సు ప్రత్యేకతలు

ఒకో బస్సు ధర 2.16 కోట్లు కాగా, 7 సంవత్సరాల వార్షిక నిర్వహణ ఒప్పందం ఉంటుంది. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఒకే చార్జ్‌లో 150 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా చార్జ్‌ చేయబడతాయి. బస్సు మొత్తం పొడవు 9.8మీటర్లు, ఎత్తు 4.7మీటర్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. వేగంగా చార్జింగ్‌ చేసేందుకు రెండు చార్జింగ్‌ గన్‌లను ఈ బస్సుల్లో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏసీతో కూడిన ఈ బస్సులను నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్విచ్‌ ఈఐవీ 22 మోడల్‌ పేరుతో ఉన్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు హైటెక్స్‌లో జరిగే ఈవీ షోలో బుధవారం ప్రదర్శించనున్నామని అధికారులు తెలిపారు. కాగా నగరానికి వచ్చిన మూడు బస్సులను వేరే రూట్లలో నడపాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆర్టీసీ అధికారులతో చర్చించి డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు తిరిగే మార్గాలను నిర్ణయించనున్నారు.

ఫోన్‌పే కొత్త సర్వీస్‌.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

దిల్లీ: విదేశాల్లోని భారతీయులు ఇకపై యూపీఐ (UPI) ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే(PhonePe) యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అంతర్జాతీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఫిన్‌టెక్‌ సంస్థగా ఫోన్‌పే అవతరించింది. ఇకపై భారతీయులు (Indians) విదేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా తమ భారతీయ బ్యాంకు ఖాతా ద్వారానే నగదు చెల్లింపులు చేయొచ్చు.

గత నెలలో భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (NPCI) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా యూపీఐ లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఏప్రిల్ 30 నాటికి విదేశాల్లో యూపీఐ చెల్లింపులు చేసేందుకు అనువైన సాంకేతికతను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఫోన్‌పే విదేశాల్లో సైతం పేమెంట్స్ చేసే అవకాశం కల్పిస్తోంది. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యాపారులకు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది.

‘‘గత ఆరేళ్లుగా యూపీఐ సేవలు దేశీయంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఇంటర్నేషనల్‌ను పరిచయం చేసింది. ఈ సేవలు అంతర్జాతీయంగా ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గర్విస్తున్నాం. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేందుకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. త్వరలోనే మరిన్ని దేశాల్లో తమ సేవలను విస్తరిస్తాం’’ అని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చారి తెలిపారు.

ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల: ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) (తితిదే) విడుదల చేయనుంది.

శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాతోపాటు, వాటికి సంబంధించిన దర్శన కోటాను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుందని తితిదే తెలిపింది. ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.