డబుల్ డెక్కర్.. ఖుషీగా టూర్
నగర ప్రయాణికులకు ఇది ఖుషీ ఖబర్. ప్రజల ఆకాంక్ష మేరకు మంత్రి కేటీఆర్ చొరవతో నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. ఒకప్పుడు డీజిల్‌తో నడిచిన ఈ బస్సులు తాజాగా ఎలక్ట్రిక్ బస్సులుగా మహానగరంలో పరుగులు పెట్టనున్నాయి. మంగళవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం మొబిలిటీ వీక్ కార్యక్రమంలో భాగంగా హైటెక్స్‌లో జరిగే ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనలో ఈ బస్సులను ఉంచనున్నారు.
డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ మహానగరంలో అడుగు పెట్టాయి. ఒకప్పుడు డీజిల్‌తో నడిచిన ఈ బస్సులు తాజాగా ఎలక్ట్రిక్‌తో నడువనున్నాయి. గతంలో నగర వాసులను ఎంతగానో అలరించిన డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తే, మళ్లీ వాటిని తీసుకురావాలన్న ప్రజల డిమాండ్ మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. మంగళవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ప్రాంగణానికి చేరుకున్న 3 ఎలక్ట్రిక్ బస్సులను చేవెళ్ల ఎంపీ జి.రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న మొబిలిటీ వీక్‌లో భాగంగా ఈ బస్సులను ఈవీ ప్రదర్శనలో ఉంచనున్నారు.
11న నగరంలో పరుగులు..
అంతర్జాతీయ ఫార్ములా -ఇ పోటీలు ఫిబ్రవరి 11న నగరంలో జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను అదే రోజు ఫార్ములా-ఈ ట్రాక్‌లో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులను ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్ మరియు నిజాం కాలేజీ ప్రాంతాలను చుట్టి వచ్చేలా ఒక మార్గాన్ని నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి 11 తర్వాత, నగరానికి పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్యూట్‌లో ఉపయోగించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్‌లో డబుల్ డెకర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. సంప్రదాయ డబుల్ డెకర్ బస్సులు నిజాం కాలంలో ప్రారంభించగా, అప్పటి నుంచి 2003 వరకు నగరంలో తిరిగాయి. ట్విట్టర్‌లో పౌరుల అభ్యర్థన మేరకు, ఆ బస్సుల్లో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్, డబుల్ డెకర్ బస్సులను తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు హెచ్‌ఎండీఏ ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులను మంగళవారం డెలివరీ చేయడంతో జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.
డబుల్ డెక్కర్ బస్సు ప్రత్యేకతలు
ఒకో బస్సు ధర 2.16 కోట్లు కాగా, 7 సంవత్సరాల వార్షిక నిర్వహణ ఒప్పందం ఉంటుంది. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఒకే చార్జ్‌లో 150 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా చార్జ్ చేయబడతాయి. బస్సు మొత్తం పొడవు 9.8మీటర్లు, ఎత్తు 4.7మీటర్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. వేగంగా చార్జింగ్ చేసేందుకు రెండు చార్జింగ్ గన్‌లను ఈ బస్సుల్లో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏసీతో కూడిన ఈ బస్సులను నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్విచ్ ఈఐవీ 22 మోడల్ పేరుతో ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు హైటెక్స్‌లో జరిగే ఈవీ షోలో బుధవారం ప్రదర్శించనున్నామని అధికారులు తెలిపారు. కాగా నగరానికి వచ్చిన మూడు బస్సులను వేరే రూట్లలో నడపాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆర్టీసీ అధికారులతో చర్చించి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే మార్గాలను నిర్ణయించనున్నారు.
Feb 08 2023, 09:38