ఫోన్‌పే కొత్త సర్వీస్‌.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

దిల్లీ: విదేశాల్లోని భారతీయులు ఇకపై యూపీఐ (UPI) ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే(PhonePe) యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అంతర్జాతీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఫిన్‌టెక్‌ సంస్థగా ఫోన్‌పే అవతరించింది. ఇకపై భారతీయులు (Indians) విదేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా తమ భారతీయ బ్యాంకు ఖాతా ద్వారానే నగదు చెల్లింపులు చేయొచ్చు.

గత నెలలో భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (NPCI) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా యూపీఐ లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఏప్రిల్ 30 నాటికి విదేశాల్లో యూపీఐ చెల్లింపులు చేసేందుకు అనువైన సాంకేతికతను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఫోన్‌పే విదేశాల్లో సైతం పేమెంట్స్ చేసే అవకాశం కల్పిస్తోంది. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యాపారులకు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది.

‘‘గత ఆరేళ్లుగా యూపీఐ సేవలు దేశీయంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఇంటర్నేషనల్‌ను పరిచయం చేసింది. ఈ సేవలు అంతర్జాతీయంగా ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గర్విస్తున్నాం. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేందుకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. త్వరలోనే మరిన్ని దేశాల్లో తమ సేవలను విస్తరిస్తాం’’ అని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చారి తెలిపారు.

ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల: ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) (తితిదే) విడుదల చేయనుంది.

శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాతోపాటు, వాటికి సంబంధించిన దర్శన కోటాను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుందని తితిదే తెలిపింది. ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.

YS Jagan & YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

హైదరాబాద్/జనగామ : రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జైలుకెళ్తారు.. ఆయన సోదరి వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister) అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari)..

ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆమె ఏ ప్రాంతంలో పాదయాత్ర (YS Sharmila Padayatra) చేపట్టినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలపై (BRS Leaders) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (TS Budget) గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ఇందుకు కౌంటర్‌గా కడియం శ్రీహరి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. బడ్జెట్‌పై షర్మిల చేసిన కామెంట్స్ బాధాకరమన్నారు. వైస్ కుటుంబం (YS Family) మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు. సమైక్యంద్రే తమ నినాదం అని ఊరూర తిరిగిన వ్యక్తి షర్మిల అని ఈ సందర్భంగా కడియం గుర్తు చేశారు. అంతేకాదు.. పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా శ్రీహరి ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించారు.

కడియం కామెంట్స్ ఇవీ..

' అవును.. నిజంగానే షర్మిలకు రాజకీయంగా అన్యాయం జరిగింది. వైఎస్ జగన్ సీబీఐ కేసులో (CBI Case) జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు (Sharmila, Vijayamma) పాదయాత్రలు చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. తల్లీ, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. మీకష్టంతో అధికారంలోకి వచ్చి మీకు అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలి. రేపో మాపో సీబీఐ కేసులోనో, వివేకానందరెడ్డి హత్య (Viveka Murder Case) కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదు. ఏపీలో జగన్ గ్రాఫ్ (JaganGraph) పడిపోతోంది' అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.

రియాక్షన్ ఎలా ఉంటుందో..!

వాస్తవానికి.. వైసీపీపై ఎలాంటి కామెంట్స్ చేసినా ఏపీ (Andhra Pradesh) నుంచి కూడా అంతేరీతిలో రియాక్షన్ కూడా వస్తోంది. ఇప్పుడు ఏకంగా జగన్ జైలుకెళ్తారు.. గ్రాఫ్ పడిపోయిందని కడియం చేసిన కామెంట్స్‌పై ఎలాంటి కౌంటర్లు వస్తాయో మరి. ఇటు వైఎస్ షర్మిల కూడా తనపై కామెంట్స్ ఎవరూ చేసినా సరే.. ఎంత పెద్దోళ్లయినా లెక్కచేయకుండా తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్యనే ప్రజాసమస్యలపై తనతో కలిసి నడవాలని సీఎం కేసీఆర్‌కే ఒక జత బూట్లు ప్రగతిభవన్‌కు పంపించారు. మరి కడియం కామెంట్స్‌పై షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది వేచి చూడాలి.

మోదీజీ.. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి

చెన్నై: సివిల్‌ సర్వీస్‌ (Civil Service) అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోదీ (PM Modi)ని తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కోరారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. ‘‘ సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థుల విన్నపాన్ని మరోసారి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. కరోనా కారణంగా చాలా మంది సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులు తమ చివరి అవకాశాన్ని కోల్పోయారు. అందువల్ల వారందరికీ వయోపరిమితిని పెంచుతూ మరో అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని స్టాలిన్‌ తన లేఖలో పేర్కొన్నారు.

చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా సిఫార్సు చేసిందన్న విషయాన్ని స్టాలిన్‌ తన లేఖలో ప్రస్తావించారు. వివిధ పార్టీల నుంచి దాదాపు 150 మందికి పైగా ఎంపీలు మద్దతు తెలిపారని అన్నారు. రాష్ట్ర పరిధిలో నిర్వహించే ఉన్నత సర్వీసు పరీక్షల్లో అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల కేంద్ర స్థాయిలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మూడేళ్లపాటు వయోపరిమితిని పెంచిన విషయాన్ని స్టాలిన్‌ గుర్తు చేశారు. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులకు ఈ ఒక్కసారి మాత్రమే వయోపరిమితిని పెంచాలని దీనివల్ల ఆర్థికంగానూ పెద్దగా ఇబ్బందులు ఉండబోవని స్టాలిన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వేలాది మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీస్‌ కలను సాకారం చేసుకునే వీలుంటుందని అన్నారు.

వివాదంలో మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్

సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జోగిపేట బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో విరుచుకుపడ్డారు.

బాబుమోహన్‎కి ఫోన్ చేసిన బీజేపీ కార్యకర్త వెంకటరమణను ఫోన్‎లో బాబుమోహన్ నొటికి ఎంత వస్తే అంత మాట్లాడారు.. బాబుమోహన్ ఇలా మాట్లాడుతూ..‘‘నువ్వెంత, నీ బతుకెంత..

నువ్వు గల్లి లీడర్..నేను రాష్ట్ర నాయకుడిని..మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం’’ అంటూ కార్యకర్త వెంకటరమణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుమోహన్ మాట్లాడిన బూత్ పురాణం ఆడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‎గా మారింది..

వాట్సాప్‌లో భారీగా లిమిట్‌ పెంపు.. ఒకేసారి 30 నుంచి 100!

యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను పరిచయం చేస్తోంది. కేవలం మెసేజింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. గ్రూప్‌ కాలింగ్‌ (Group Calling), పేమెంట్స్‌ (Payments), ఫొటో ఎడిట్‌ (Photo Edit) వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఒకేసారి 100 మీడియా ఫైల్స్‌ ( Media Files)ను షేర్‌ చేయొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో 30కి మించి మీడియా ఫైల్స్‌ను షేర్‌ చేయలేం. తాజా అప్‌డేట్‌లో ఈ పరిమితిని 100కి పెంచుతున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఫీచర్‌ ఇప్పటికీ రాకుంటే యూజర్లు తమ ఫోన్లలో వాట్సాప్‌ ఆండ్రాయిడ్ 2.23.4.3 వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి.

త్వరలో ఐఓఎస్‌ (iOS) యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌ చాట్‌లో భాగంగా తరచూ ఫొటోలు షేర్ చేసేవారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవలే వాట్సాప్ వీడియో మోడ్‌ (Video Mode)ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వీడియో రికార్డింగ్‌ కోసం గతంలో మాదిరి కెమెరా బటన్‌ను నొక్కి పెట్టాల్సిన అవసరంలేదు. రికార్డింగ్‌ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఒరిజినల్‌ క్వాలిటీలో ఫొటోలను షేర్‌ చేసుకునేలా వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది.

AP News: ప్రభుత్వ పథకాలు పొందే వారి ఇళ్లకు జగన్ స్టిక్కర్లు.. వైసీపీ సరికొత్త కార్యక్రమం..

ఈ నెల 11న వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ పథకాలు అందుతున్న ఇళ్ల వివరాలు సేకరించి ఆ ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు..

గృహసారధులు, వాలంటీర్ల సమన్వయంతో అలాంటి ఇళ్లను గుర్తించనున్నారు.

ఆ ఇంటికి మా నమ్మకం నువ్వే అనే ట్యాగ్‌లైన్‌తో జగన్ స్టిక్కర్ వేయబోతున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని నిర్ణయించారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీసీ భేటీ.. పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఆమోదం..

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని తెలిపారు.

మరిన్ని ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

1. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్‌ మరియు ఫ్యూయెల్స్‌ కంపెనీ ప్రతిపాదన.

►మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం

► ఈ ఏడాది జూన్ లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

2. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు.

► మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు

►ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు.

► 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

౩. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు

►మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి.

►మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి.

►ఫేజ్ వన్‌లో 30 వేలమందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు.

► ఈ పార్క్ లో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్, హైడ్రోజన్‌ సంబంధిత ఉత్పత్తులు.

►మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 20౩౩ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

► ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ఎన్టీపీసీ..

4. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌. ఫ్యాక్టరీలు.

►డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ

►శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి.

► మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి.

►ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు.

► డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యం.

5. రామాయపట్నంలో అకార్డ్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ.

►రూ. 10వేల కోట్ల పెట్టుబడి.

►కాపర్‌ కాథోడ్, కాపర్‌ రాడ్, సల్ఫూరిక్‌ యాసిడ్‌, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ.

►ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు.

► మే 2023లో ప్రారంభమై, జూన్2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

► ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేదించిన నేపథ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదన ఆమోదించిన ఎస్‌ఐపీబీ..

6. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు

►1000 మెగావాట్ల విండ్, మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు

►ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌.

►నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి.

► 2వేలమందికి ఉద్యోగాలు.

► దశల వారీగా పూర్తిస్ధాయిలో మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

7. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్.

►100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ .

►మొదటి విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్‌, మూడేళ్ళలో పూర్తికి కంపెనీ సన్నాహాలు.

► మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగాలు.

►ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం.

8. రాష్ట్రంలో పెట్టబుడులకు ముందుకు వచ్చిన వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

►రూ. 1489.23కోట్ల పెట్టుబడి. తిరుపతిలో పరిశ్రమ.

►15 వేలమందికి ఉద్యోగాలు.

►టెలీ కమ్యూనికేషన్ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ ను తయారుచేస్తున్న కంపెనీ.

9. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటు.

►దీనికి ఎస్ఐపీబీ ఆమోదం.

►అత్యంత ఆధునిక సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశం.

Revanth Reddy: అన్నం ముద్దలు కలిపి రేవంత్ రెడ్డికి పెట్టిన మహిళలు

ములుగు: జనవరిలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు.పేదలందరికీ ఇల్లు ఇస్తాం .. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా వెంకటాపురం మండలం కేశవాపూర్‌లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు.

అలాగే కూలీలతో కలిసి కాసేపు రేవంత్ మిర్చి తెంపారు. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్‌, సీతక్కకు, మల్లు రవిలకు అన్నం ముద్దలు కలిపి పెట్టారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం చేసేందుకు సాధ్యమౌతుందని వారిని సూచించారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలతో రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు.

Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ.. ప్రస్తావించిన విషయాలు ఇవే..

చిత్తూరు: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడు (Tamilanadu) కు గ్రానైట్ అక్రమ రవాణా జరగుతుందని లేఖలో ఆయన ప్రస్తావించారు..

కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి కొత్తూరు ద్వారా వేపనపల్లికి గ్రానైట్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని లేఖ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు..