TSNews

Nov 21 2020, 13:37

స‌రిహ‌ద్దుల్లో పాక్ కాల్పులు.. సైనికుడి వీర‌మ‌ర‌ణం

శ్రీన‌గ‌ర్‌: 

నియంత్ర‌ణ రేఖ‌వెంబ‌డి పాక్ దుశ్చర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. కాల్పుల‌‌ విర‌మ‌ణ ఒప్పందానికి దాయాది దేశం మ‌రోమారు తూట్లు పొడిచింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్ సైనికులు జ‌రిపిన కాల్పుల్లో భార‌త జ‌వాన్ అమ‌రుడ‌య్యారు. ‌నౌషెరా సెక్టార్‌లోని లామ్ ప్రాంతంలో స‌రిహ‌ద్దుల అవ‌త‌లివైపు నుంచి నిన్న‌ అర్థ‌రాత్రి 1 గంట‌ల‌కు పాక్ కాల్పులు ప్రారంభించింద‌ని భార‌త సైన్యం వెల్ల‌డించింది. ఈ కాల్పుల్లో 16 కార్ప్‌కు చెందిన హ‌వ‌ల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది. కాగా, పాక్ కాల్పులను భార‌త సైన్యం స‌మ‌ర్థంగా తిప్పికొట్టింద‌ని తెలిపింది.  

జ‌మ్ములో నలుగురు ఉగ్ర‌వాదులను హ‌త‌మార్చిన రెండు రోజుల త‌ర్వాత పాక్ అప్ర‌క‌టిత‌ కాల్పుల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. గురువారం ఉద‌యం జ‌మ్ము జిల్లాలోని న‌గ్‌రోటా ప్రాంతంలో జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ‌ర‌హ‌దారిపై ఉన్న బాన్ టోల్‌ప్లాజా వ‌ద్ద ఓ ట్ర‌క్కులో దాక్కున్న ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో భ‌‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన ఎదురు కాల్పుల్లో న‌లుగురు ముష్క‌రులు హ‌త‌మైన విష‌యం తెలిసిందే.

TSNews

Nov 21 2020, 13:34

మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం రూ.116 కోట్లు ఇచ్చింది... - కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్

  మధ్యాహ్న భోజన పథకం కింద జీహెచ్ఎంసీ ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద వంట ఖర్చు కోసం 2015-16 నుంచి కేంద్ర సర్కార్ రూ.116.9 కోట్లు విడుదల చేసిందన్నారు. జీహెచ్‌‌ఎంసీ ప్రాంతంలోని 1,393 పాఠశాలల్లో (హైదరాబాద్‌లో 959 పాఠశాలలు, మేడ్చల్-మల్కాజ్‌‌గిరి 264, రంగారెడ్డిలో 170) 2 లక్షలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 2,215 వంట-సహాయకులు (సీసీహెచ్) పని చేస్తున్నారని వివరించారు.

TSNews

Nov 21 2020, 13:29

ఔత్సాహికులకు అనేక అవకాశాలు... : మోదీ

   కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలనుకునేవారికి, ఉపాధి పొందాలనుకునేవారికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ కాన్వొకేషన్ సందర్భంగా శనివారం వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడారు. 

కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో కూడా ప్రధాన మార్పులు జరుగుతున్న తరుణంలో విద్యార్థులు ఈ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ వృద్ధికి, ఉపాధికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు తమ నైపుణ్యం, ప్రతిభ, ప్రొఫెషనలిజం ద్వారా ప్రస్తుత పరిస్థితి నుంచి ఎదిగి, ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌కు కృషి చేస్తారని తనకు నమ్మకం ఉందని తెలిపారు.

మన దేశంలో కర్బన ఉద్గారాల గురించి మాట్లాడుతూ, కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను 30 నుంచి 35 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంధన అవసరాల కోసం ప్రస్తుత దశాబ్దంలో సహజ వాయువు వినియోగాన్ని నాలుగు రెట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

ప్రపంచం చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో గ్రాడ్యుయేట్ కావడం సులువైన విషయం కాదన్నారు. ఈ సవాళ్ళ కన్నా విద్యార్థుల సామర్థ్యం చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. విజయాలు సాధించినవారు సమస్యలను ఎదుర్కొనరని కాదని, సవాళ్ళను స్వీకరించేవారు, ఎదిరించేవారు, ఓడించేవారు, సమస్యలను పరిష్కరించేవారు అంతిమంగా విజయం సాధిస్తారని అన్నారు.

TSNews

Nov 21 2020, 13:16

ఆన్లైన్ రమ్మీ ఆడితే జైలుకే - సీపీ వి.సత్యనారాయణ

 రామగుండం కమిషనరేట్, 
✍️ మనోజ్ పాండే

ఆన్లైన్ రమ్మీపై తెలంగాణలో ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని కూడా నిషేధించడంతో నకిలీ జిపిఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రమ్మీ కల్చర్, ఆన్లైన్ రమ్మీ వంటి అప్లికేషన్ల ద్వారా తెలంగాణ లో ఉండి కూడా వేరే ప్రాంతంలో ఉన్నట్టు చూపిస్తూ ఆన్లైన్ రమ్మీ ఆడడం జరుగుతుంది.ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని చాలామంది ఆన్లైన్ జూదగాళ్ళని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది.ఇక ముందు కూడా ఈదాడులు కొనసాగుతాయి. తప్పుడు జిపిఎస్ లొకేషన్ పెట్టి మోసం చేస్తూ వారిపై 420 IPC చిటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి శిక్ష 7 YRS ఉంటుంది. ఇక రమ్మీ ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడం జరుగుతుంది. ఆన్ లైన్ గేమింగ్ హౌస్ నడిపితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థినెన్స్ జారీ చేసింది. కొంతమంది వ్యక్తులు రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆన్లైన్లోనే ఆడుతున్న వారి వివరాలు సమాచారం సేకరించడం జరుగుతుంది.  కొంతమంది సిద్ధం చేయడం జరిగింది వారిపై త్వరలోనే పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది.ఈ ఆటల్లో డబ్బులు కోల్పోయిన అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నరు వారి కుటుంబాలు రోడ్డు నా పడుతున్నాయి. ఆట కోసం అప్పుల పాలు అవుతున్నారు.

TSNews

Nov 21 2020, 12:13

ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు...

ముంబయి

  ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంతర్గత కమిటీ శుక్రవారం ఓ నివేదికను విడుదల చేసింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 15 ఏళ్ల తర్వాత ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాకింగ్‌ నిబంధనల ప్రకారం ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రమోటర్లు తమ యాజమాన్య వాటాను మూడేళ్లలో 40%, 15 ఏళ్లలో 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది.

బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేశాకే భారీ కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు బ్యాకింగ్‌ లైసెన్సులు ఇవ్వాలని కమిటీ సూచించింది. పర్యవేక్షణ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయాలని పేర్కొంది. భారతీయ ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యం, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌ మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీకే మహంతీ నేతృత్వంలో జూన్‌లో ఈ కమిటీ వేశారు.

ఐదేళ్ల లాకిన్‌ కాలపరిమితి ముగిసిన వెంటనే ఎప్పుడైనా ప్రమోటర్ల యాజమాన్య వాటాను 26 శాతానికి తగ్గించాలని కమిటీ సిఫార్సు చేసింది. నాన్‌ ప్రమోటర్ల వాటా విషయానికి వస్తే, ఓటింగ్‌ హక్కుతో కూడిన బ్యాంకు ఈక్విటీ చెల్లింపు వాటా పరిమితి 15%గా ఉండాలని నిర్ణయించింది. రూ.50వేల కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులున్న భారీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామంది. అయితే ఆ సంస్థలు కనీసం పదేళ్లు సేవలందించి ఉండాలని తెలిపింది. ఇక మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న పేమెంటు బ్యాంకులు మూడేళ్ల తర్వాత చిన్నతరహా బ్యాంకులుగా రూపాంతరం చెందే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ స్ట్రక్చర్‌ కొత్త బ్యాంకింగ్‌ లైసెన్సుకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఒక కొత్త యూనివర్సల్ ‌బ్యాంకును ఏర్పాటు చేసేందుకు తొలి చెల్లింపు మూలధనం లేదా నెట్‌వర్త్‌ను రూ.1000 కోట్లకు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. చిన్న బ్యాంకులకైతే రూ.300 కోట్లని తెలిపింది. పట్టణ సహకార బ్యాంకులు చిన్న బ్యాంకులుగా మారేందుకు ఐదేళ్లకు రూ.300 కోట్లు చెల్లింపు మూలధనం ఉండాలంది. బ్యాంకింగ్‌ నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఇస్తే ఆ ప్రయోజనాలను బ్యాంకులకు వెంటనే కలగజేయాలని తెలిపింది. ఒకవేళ నిబంధనలను కఠినతరం చేస్తే అందుకు నిర్దేశిత గడువు ఇవ్వాలని సూచించింది.

TSNews

Nov 21 2020, 12:10

గ్రేటర్‌ పోరు
మీడియా పాయింట్లు బంద్...

ఉత్తర్వులు జారీ చేసిన శాసనసభ కార్యదర్శి...

హైదరాబాద్‌

   గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున శాసనసభ, శాసన మండలి ప్రాంగణాల్లో మీడియా సమావేశాలను నిషేదిస్తూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటీసు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసేవరకు ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించరాదని నోటీసుల్లో స్పష్టం చేశారు. నియమావళి అమల్లో ఉన్నంతకాలం మీడియా పాయింట్స్‌ను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.

TSNews

Nov 21 2020, 12:05

దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు...

 హైదరాబాద్ 

  దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్- 19 సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రయాణికులు ఎక్కువగా లేని సుమారు 12 రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోన్ పరిధిలో కొన్ని చోట్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరో 8 ప్రత్యేక రైళ్లు జోన్ పరిధిలో ప్రయాణించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 24వ తేదీన చెన్నై టు న్యూఢిల్లీ రైలు జోన్ పరిధిలోని విజయవాడ, వరంగల్ స్టేషన్‌లలో ఆగుతుంది. 22వ తేదీన చెన్నై టు అహ్మదాబాద్, 23వ తేదీన అహ్మదాబాద్ టు చెన్నై రైళ్లు ప్రతిరోజు జోన్ పరిధిలో నడుస్తాయని అధికారులు తెలిపారు. సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలిచ బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.

వీటితో పాటు ఈనెల 25వ తేదీన కన్యాకుమారి టు నిజాముద్దీన్ రైలు ప్రారంభమై ప్రతి బుధ, శుక్రవారాల్లో నడవనుండగా, 28వ తేదీన నిజాముద్దీన్ టు కన్యాకుమారి శని, సోమవారాల్లో ప్రయాణికులకు సేవలందించనున్నాయి. ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ ఉంటుందని అధికారులు తెలిపారు. 23వ తేదీ నుంచి ఎర్నాకుళం టు పాట్నా (ప్రతి సోమ, మంగళవారంలో), 26వ తేదీ నుంచి పాట్నా టు ఎర్నాకుళం (ప్రతి గురు, శుక్రవారాల్లో) జోన్ మీదుగా ప్రయాణించనున్నాయి. ఈ రైళ్లు ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్‌లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

TSNews

Nov 21 2020, 12:01

ముంబయి పవర్‌ కట్‌ వెనుక సైబర్‌ దాడి...!

 ముంబయి 

  దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరంలో అక్టోబరు 12న గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే సైబర్‌ దాడి కారణంగానే పవర్‌ కట్‌ జరిగిందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంపై ముంబయి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పవర్‌ సప్లయ్‌, ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన సర్వర్లలో అనుమానాస్పద లాగిన్‌లను సైబర్‌ విభాగం అధికారులు గుర్తించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. సింగపూర్‌, దక్షిణ ఆసియాకు చెందిన కొన్ని దేశాలకు చెందిన హ్యాకర్లు ఈ లాగిన్‌లు చేసినట్లు తేలిందట. దీంతో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. 

లోడ్‌ డిస్‌ప్యాచ్‌ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా ప్రాథమికంగా నిర్ధారించిందేనని, పూర్తి రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని సైబర్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. సైబర్‌ ముప్పుపై మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. 

అక్టోబరు 12న ముంబయిలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 గంటల తర్వాత క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేదు. నగరానికి విద్యుత్‌ సరఫరా చేసే టాటాకు చెందిన గ్రిడ్‌లో లోపం తలెత్తడంతో పవర్ కట్‌ అయినట్లు అప్పుడు అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు రైల్‌ సర్వీసులు రద్దయ్యాయి. ఆసుపత్రుల కోసం అత్యవసరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

TSNews

Nov 21 2020, 11:58

డేటింగ్‌ పేరిట వల.. రోజుకు రూ.కోటి స్వాహా...

ఆట కట్టించిన సైబరాబాద్‌ పోలీసులు... ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌

   సామాజిక మాధ్యమాల్లో డేటింగ్‌ పేరిట గాలం వేసి దండుకుంటున్న కేటుగాళ్ల ఆటను కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు.. పశ్చిమ బంగకు చెందిన సిలిగురిలో పదిరోజులు మకాం వేసి ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో మీడియాకు వెల్లడించారు.
నేపాల్‌ సరిహద్దులకు సమీపంలోని...
‘మేల్‌ ఎస్కార్ట్‌’ ఉద్యోగాలు కల్పిస్తామనే ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చూడగానే ఓ నిరుద్యోగి స్పైసీఫ్రెండ్‌షిప్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యాడు. మహిళలు ఫోన్‌ చేసి వీఐపీ మెంబర్‌షిప్‌, జీఎస్‌టీ, బీమా తదితర రుసుంల పేరిట రూ.13.82లక్షలు స్వాహా చేశారు. బ్యాంకు క్లియరెన్స్‌ కోసం మరో రూ.1.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మోసపోయినట్లు గ్రహించి సెప్టెంబర్‌ 18న సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్‌నగర్‌కు చెందిన మరో బాధితుడు ఇలాగే మోసపోయాడు. దీంతో సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు. ఫోన్‌ సిగ్నల్స్‌, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నేపాల్‌ సరిహద్దులకు సమీపంలోని పశ్చిమ బంగలోని సిలిగురి పట్టణం కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ మూడ్రోజులు రెక్కీ నిర్వహించి కాల్‌సెంటర్లపై దాడులు చేసి బిజయ్‌ కుమార్‌ షా, బినోద్‌ కుమార్‌ షా, మహ్మద్‌ నూర్‌ ఆలం అన్సారీని అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. టెలికాలర్స్‌ దీపా హాల్దార్‌, శిఖా హాల్దార్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ప్రధాన సూత్రధారులు సంతూదాస్‌, అమిత్‌ పాల్‌ అలియాస్‌ అమిత్‌ శర్మ, సుషాంక్‌ కుమార్‌ షా పరారీలో ఉన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ ఎం.రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేందర్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
ముగ్గులోకి దింపుతారిలా..
అమిత్‌ పాల్‌ అలియాస్‌ అమిత్‌ శర్మ, సుషాంక్‌ కుమార్‌ షా స్పైసీఫ్రెండ్‌షిప్‌.కామ్‌, దిడేటర్స్‌హబ్‌ తదితరాల పేర్లతో కొన్ని వెబ్‌సైట్లను రూపొందించారు. షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య భవనాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో కాల్‌సెంటర్‌కు బిజయ్‌, బినోద్‌ మాదిరిగా ఇద్దరు సూపర్‌వైజర్లు, మహ్మద్‌ నూర్‌ ఆలం అన్సారీని మేనేజర్‌గా, పది మంది మహిళలను టెలీకాలర్స్‌ను నియమించారు. మాటలతోనే వినియోగదారులను బుట్టలో పడేసేలా శిక్షణ ఇచ్చారు.

TSNews

Nov 21 2020, 11:54

మహిళా పోలీసులకు మొబైల్‌ రెస్ట్‌రూమ్‌ వాహనాలు...

   పుష్కరాల విధులకు ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు మహిళా పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి అలంపూర్‌కు వచ్చారు. వీరి కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించారు. ఇందుకోసం నిజామాబాద్‌, నల్గొండ, వికారాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా తయారు చేయించిన నాలుగు మొబైల్‌ రెస్ట్‌రూమ్‌ బస్సులను ఇక్కడికి తెప్పించారు. ఒక్కోబస్సు తయారీకి సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒక్కో బస్సులో రెండు స్నానపుగదులు, రెండు శౌచలయాలు ఉన్నాయి. 500 లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకులు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఈ బస్సులు వినియోగంలోకి వచ్చాయి. మేడారం జాతరలో సేవలు అందించాయి. తర్వాత తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. మొబైల్‌ రెస్ట్‌ రూమ్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకురావడంతో మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరఘాట్‌ వద్ద ఒకటి, మాంటిస్సోరి పాఠశాల సమీపంలో ఒకటి, బస్టాండ్‌ సమీపంలో మరొకటి, కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఒక బస్సును అందుబాటులో ఉంచారు.