TSNews

May 19 2020, 12:54

బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని జనం

లాక్డౌన్ వల్ల దాదాపు 56 రోజులుగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ నిబంధనల్లో కేంద్రం ఇచ్చిన సడలింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడపాలని సోమవారం జరిగిన కెబినేట్ మీటింగ్ లో నిర్ణయించింది. దాంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కాయి. బస్సులన్నింటిని శానిటైజ్ చేసిన తర్వాతే డిపో నుంచి బయటకు తీస్తున్నారు. డ్రైవర్, కండక్టర్ తప్పని సరిగా మాస్కు ధరించాలని డిపో మేనేజర్లు సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని నిబంధన ఉంది. అంతేకాకుండా.. ప్రయాణికులు బస్సుల్లో భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ప్రయాణికులు మాత్రం ఆ నిబంధనను పెడచెవిన పెడుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి 960 బస్సులను నడిపిస్తున్నట్లు వరంగల్ 2 డిపో మేనేజర్ భానుకిరణ్ తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్ రూట్ లో 200 బస్సులను నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా నడిపిస్తామని ఆయన అన్నారు.

TSNews

May 19 2020, 12:51

కేసీఆర్‌ భాష సరిగాలేదు: కిషన్‌రెడ్డి

By Sridhar Dasari

   కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో కేసీఆర్‌ వాడిన భాష సరిగా లేదని ఆక్షేపించారు. సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం- ఒకే గ్రిడ్‌ విధానం అమలు కావాల్సిందేనన్నారు. తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదన్నారు. దేశ హితం కోసం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గత విధానాల్లో మార్పుల కోసమే అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. పరిశ్రమల స్థాపన... నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే మరో 70 ఏళ్లయినా దేశం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేసీఆర్ వివరించాలన్నారు. 
‘‘తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని చెబుతున్నారు... సంస్కరణలు, గిట్టుబాటు ధరల కోసం అలా చేశారేమో?. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామా? మీరు చేసింది సరైనప్పుడు.. కేంద్రం చేసింది ఎందుకు సరికాదు.  రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారు. తెలంగాణ నుంచి పొట్టచేతబట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్తున్నారు. వలస కార్మికుల సమస్య 30-40 ఏళ్ల నుంచి ఉంది. రాష్ట్రాల నుంచి వలసలు వెళ్లకుండా మార్పు జరగకూడదా?. పాలనా సంస్కరణలు.. విదేశీ పెట్టుబడులు రాకపోతే ఎలా? దేశ ప్రధానిని విమర్శించుకోవడం మంచిదా?. ఉపాధి హామీపథకానికి రూ.1.01లక్షల కోట్లు సిద్ధంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 3 కోట్ల మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఇస్తున్నాం. ప్యాకేజీలో భాగంగా తెలంగాణలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు రావా? మద్ర రుణాల ద్వారా చిన్న వ్యాపారులకు రుణాలు దొరకవా? ప్యాకేజీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు లబ్ధి జరుగుతుంది. ప్యాకేజీ కింద ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే బోగస్‌ అంటారా? ప్రపంచ విపత్తు దృష్ట్యా మన కాళ్లపై మనమే నిలబడాలి. స్థానిక వనరులు, అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి. సేవారంగం, ఉత్పత్తులు, మౌలిక వసతులు మనమే పెంచుకోవాలి’’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

TSNews

May 19 2020, 12:41

జూన్‌ మొదటి వారం తర్వాతే పది పరీక్షలు

హైదరాబాద్‌
By Sridhar Dasari

   తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం జూన్‌ మొదటి వారం తర్వత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించాలని న్యాయస్థానం  సూచించింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని, పరిస్థితి తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

TSNews

May 19 2020, 12:35

లాక్‌డౌన్‌ వేళ ఇదో కన్నీటి గాథ...

కన్న కొడుకు చివరి చూపులకు నోచుకోలేని తండ్రి

ఇంటర్నెట్‌డెస్క్‌

   కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు దేశం లాక్‌డౌన్‌లో కొనసాగుతుంటే మరోవైపు వలసదార్ల కష్టాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దిల్లీలో ఓ జర్నలిస్టు తీసిన వలసదారుడి ఫొటో వైరల్‌గా మారింది. అది తన కన్నీటి గాథను ప్రపంచానికి తెలియజేసింది. 
బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన రామ్‌పుకార్‌(38) దిల్లీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నెలల వయసున్న తన కుమారుడి పరిస్థితి విషమించిందని తెలిసి ఇంటికి వెళ్లాలనుకున్నాడు. లాక్‌డౌన్‌ వేళ కాలినడకన ప్రయాణం సాగించినా... దిల్లీలోని నిజాముద్దీన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడి పరిస్థితి తెలుసుకొని రోడ్డు పక్కనే ఫోన్లో రోదిస్తూ కనిపించాడు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు అతడి ఫొటో తీశాడు. అతడితో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. తన కుమారుడిని చూసేందుకు బెగుసరాయ్‌లోని ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు రామ్‌ ఆ జర్నలిస్టుతో చెప్పాడు. ‘ఆ జర్నలిస్టు నాకు సాయం చేసి పోలీసులతో మాట్లాడారు. అయినా వాళ్లు అనుమతించలేదు. తర్వాత ఓ మహిళ రూ.5500 ఇచ్చి భోజనం పెట్టారు. అలాగే నాకు రైలు టికెట్‌ తీసిచ్చారు. దాంతో నేను బెగుసరాయ్‌కి చేరుకున్నా. అప్పటికే నా కుమారుడు చనిపోయాడు. చివరి చూపులు కూడా దక్కలేదు’ అని రామ్‌పుకార్‌ తన బాధను పంచుకున్నాడు. తనకు సాయం అందడానికి ముందు మూడు రోజుల పాటు నిజాముద్దీన్‌ బ్రిడ్జి వద్దే ఉన్నానని చెప్పాడు.
శనివారం అతడు బెగుసరాయ్‌కి చేరగా అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. మరుసటి రోజు అతడిని ఆస్పత్రికి తరలించి కొవిడ్‌ 19 పరీక్షలు నిర్వహించారు. తాను ఇక్కడికొచ్చినా ఇంకా భార్యా, పిల్లలను కలుసుకోలేకపోయానని రామ్‌పుకార్‌ వాపోయాడు. ’ఆస్పత్రిలో ఉండగా నా భార్య, కూతురు చూడ్డానికి వచ్చారు. మాస్కులు ధరించి దూరంగా ఉన్నారు. పది నిమిషాలే నాతో ఉన్నారు. వాళ్లను చూడగానే ఏడుపాగలేదు. ఒకర్నొకరు హత్తుకోవాలని అనుకున్నాం. నా కూతుర్ని తాకాలనిపించింది. కానీ అది సాధ్యపడలేదు.’ అని తన కన్నీటి గాథను మీడియాతో తెలిపాడు.

TSNews

May 19 2020, 12:27

వలస కార్మికులకు భోజన వసతి & వైద్య పరీక్షలు

మహబూబ్ నగర్ జిల్లా
అడ్డాకుల: 
By Sridhar Dasari

   తమిళనాడు నుంచి బిహార్‌కు అనుమతి లేని వాహనాల్లో వెళ్తూ అడ్డాకుల టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన వలస కార్మికులకు మండల అధికారులు వసతులు కల్పిస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఓ దాబాలో వారికి బస ఏర్పాటు చేశారు. సోమవారం తహశీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. మరో వైపు పట్టుబడిన వాహనాల యజమానులను పిలిపించి... ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఇప్పిస్తామని, కార్మికులను బిహార్‌కు చేర్చాలని ఎస్సై కోరారు. మండల వైద్యాధికారి డా.రాధిక ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

TSNews

May 19 2020, 08:46

కిక్‌బాక్సింగ్‌లో పొలాస విద్యార్థిని లక్ష్మీప్రసన్న ప్రతిభ

జగిత్యాల జిల్లా
పొలాస
 న్యూస్‌టుడే

   వాకో ఇండియా నేషనల్‌ కిక్‌బాక్సింగ్‌ ఈ-టోర్నీలో పొలాస వ్యవసాయ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కెంచె లక్ష్మీప్రసన్న రెండు రజత పతకాలను సాధించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ ఇంటి వద్దనే మ్యూజికల్‌ సాఫ్ట్‌స్టైల్‌, వెపన్‌ అంశాల్లో ప్రదర్శన జరిపి చిత్రీకరించిన వీడియోలను దిల్లీలోని న్యాయనిర్ణేతలకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. ఫైనల్స్‌లో లక్ష్మీప్రసన్న ప్రదర్శనలు రెండు పతకాలను సాధించిపెట్టగా కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సి.నరేందర్‌రెడ్డి తదితరులు అభినందించారు.

TSNews

May 19 2020, 07:49

తెలంగాణలో జూన్ లో పూర్తి లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందా...?
విశ్లేషకులు ఏమంటున్నారు...?

By Sridhar Dasari

   తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్యేమీ తగ్గిపోలేదు. తాజాగా 41 కేసులొచ్చాయి. ప్రస్తుతం 1592 మంది ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. మరి అలాంటప్పుడు... ప్రభుత్వం ఎందుకు లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తి వేసిందన్నది చర్చనీయాంశం. ఒకప్పుడు తెలంగాణలో 100 కేసులు కూడా లేని సమయంలో... పూర్తి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఇప్పుడు వందల కేసులుండగా... ఎందుకు మినహాయింపులు ఇచ్చేసిందంటే... అందుకు ప్రధాన కారణం... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా పడిపోవడమేనన్నది అందరికీ తెలిసిన విషయమే.

   తెలంగాణలో రోజుకు 250 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారనీ... అందుకే చాలా వరకూ కేసులు బయటకు రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు ప్రతిపక్షమే లేదని ప్రభుత్వం విపక్షాల్ని తీసిపారేస్తోంది. అందువల్ల టెస్టులు, కేసుల అంశం చర్చకు రావట్లేదు. దానికి తోడు ఇదివరకట్లా చాలా మంది ప్రజలు రూల్స్ పాటించట్లేదనీ, సోషల్ డిస్టాన్స్ అన్నదే కనిపించట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కానీ... తెలంగాణలో కూడా మిగతా రాష్ట్రాలలో లాగానే... కేసులు ఎక్కువగానే ఉంటాయనీ... ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో... అవి తెరపైకి రావట్లేదనే వాదన వినిపిస్తోంది.

   తెలంగాణలో కరోనా కేసులు పెరిగితే... మళ్లీ పూర్తి లాక్‌డౌన్ తప్పదని సీఎం కేసీఆర్ స్వయంగా సోమవారం చెప్పారు. ఇలా ఆయన అనడానికి బలమైన కారణం ఉంది. చాలా దేశాలు, రాష్ట్రాల్లో మినహాయింపులు ఇవ్వగానే... మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్... నోయిడాలో ఒప్పో మొబైల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన రెండో రోజే 6గురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఫ్యాక్టరీ మూతపడింది. ఇప్పుడు తెలంగాణలో బస్సులు నడిపేందుకు, షాపులన్నీ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల మళ్లీ కరోనా కేసులు పెరగడం ఖాయమంటున్నారు కొందరు విశ్లేషకులు. (credit - twitter)

  ఒకవేళ కేసులు పెరగడమన్నది జరిగితే... అందుకు 14 రోజుల టైమ్ పడుతుంది. ఎందుకంటే... ఇప్పుడు కొత్తగా ఎవరికైనా కరోనా సోకితే... వారిలో ఆ లక్షణాలు బయటపడటానికి 14 రోజులు పడుతుంది. అంటే... జూన్ 1 లేదా 2 తర్వాత... కొత్త కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే... ప్రభుత్వం జూన్‌లో మళ్లీ పూర్తి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి... ప్రజలకు ఇప్పుడు మిగిలింది 14 రోజులే అనుకోవచ్చు. ఈ రెండు వారాల్లోనే తాము చేయాలనుకున్న, చేపట్టాలనుకున్న పనులను పూర్తి చేసుకోవడం మేలు. ఏ వస్తువులైనా కొనుక్కోవాలన్నా... ఈ తక్కువ సమయంలోనే కొనుక్కోవడం బెటర్. ఒకవేళ రెండు వారాల తర్వాత పూర్తి లాక్‌డౌన్ లేకపోతే ఆనందమే. దురదృష్టం కొద్దీ ఉంటే... అప్పుడు ఇబ్బంది పడే బదులు... ఇప్పుడే పనులు పూర్తి చేసుకోవడం మేలంటున్నారు కొందరు విశ్లేషకులు. (credit - twitter)

TSNews

May 19 2020, 07:20

13 ఏళ్ల బాలికకు 37 ఏళ్ల వ్యక్తితో పెళ్లి...

రంగారెడ్డి జిల్లా
షాద్‌నగర్‌:
By Sridhar Dasari

   బాల్య వివాహాల నిషేధంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నా అవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఓ బాల్య వివాహం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 13 ఏళ్లున్న బాలికను అప్పటికే భార్య చనిపోయి ఇద్దరు పిల్లలున్న 37 ఏళ్లున్న వ్యక్తి వివాహం చేసుకోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌ షాద్‌నగర్‌లో ఓ మద్యం దుకాణంలో పని చేస్తుంటాడు. అతని భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఇతనికి పదేళ్ల బాబు, ఎనిమిదేళ్ల బాలిక సంతానం. అదే గ్రామంలో తన కుమార్తె కంటే అయిదేళ్లు పెద్దదైన ఓ బాలికపై అతని కన్ను పడింది. ఆ బాలిక తల్లి వ్యవసాయ కూలీ. ఆమెతో అతనికి కుటుంబ స్నేహం ఉండటంతో ఒత్తిడి తెచ్చి ఈ నెల 15న ఆ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో సోమవారం ఐసీడీఎస్‌, రెవిన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలిక, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మల్లేష్‌ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం బాలికను ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

TSNews

May 19 2020, 06:54

రోడ్డెక్కిన బస్సులు...
కొత్త కండీషన్లు...

By Sridhar Dasari

  తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాట్లను అనుసరించి... తెలంగాణలో ఇవాళ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ తప్ప జిల్లాల్లో బస్సులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వల్ల 56 రోజులుగా ఆగిపోయిన బస్సులు... ఇప్పుడు తిరిగి పరుగులు పెడుతున్నాయి. 
   ఐతే... ప్రభుత్వం కొన్ని కండీషన్లు పెట్టింది. వాటిని ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. లేదంటే మళ్లీ కరోనా కేసులు పెరిగితే... మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 

తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులకు కొత్త కండీషన్లు

- మే 31 వరకూ జిల్లాల్లో మాత్రమే బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేదు.
- హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇచ్చారు. టాక్సీల్లో డ్రైవర్‌తో కలిపి నలుగురు, ఆటోలో డ్రైవర్‌తో కలిపి ముగ్గురు ప్రయాణించవచ్చు.
- హైదరాబాద్ సరిహద్దుల వరకే బస్సుల్ని నడుపుతారు.
- MGBSకి బస్సులు రావు. JBSకి మాత్రం వస్తాయి.
- ఆర్టీసీ బస్సులన్నీ రాత్రి 7 కల్లా డిపోలకు చేరాల్సి ఉంటుంది.
- ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.
- ప్రయాణికులు వెంట శానిటైజర్ తప్పక తెచ్చుకోవాలి.
- శానిటైజర్ లేని ప్రయాణికులకు బస్టాండ్ల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
- సోషల్ డిస్టాన్సింగ్ అమలయ్యేలా బస్సుల్లో తగిన ఏర్పాట్లు చేశారు.
- ప్రస్తుతానికి టికెట్ల పెంపు లేదని ప్రభుత్వం తెలిపింది.
- ఇకపై బస్సుల్లో నిల్చొని ప్రయాణించడం అన్నది ఉండదు.
- అన్ని సీట్లలోనూ ప్రయాణికుల్ని కూర్చోనిస్తారు. సీట్ల మధ్య గ్యాప్ ఏమీ లేదు.
- తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లవు.
- నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీనగర్ దగ్గర ఆపేస్తారు.
- మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సుల్ని ఆరాంఘర్ దగ్గర ఆపేస్తారు.
- వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ దగ్గర ఆపుతారు.
- నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సుల్ని JBS దగ్గర ఆపుతారు.
- ఆర్టీసీ యాజమాన్యం... ఇవాళ్టి నుంచి నడిపే ప్రతీ బస్సును ముందుగానే శానిటైజ్ చేస్తుంది.
- డ్రైవర్లు, కండక్టర్లకు మాస్కులు, శానిటైజర్లను ఇచ్చింది.
- ఆర్టీసీ కార్మికులకు డిపోలోకి ఎంటరయ్యేటప్పుడే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
- హైదరాబాద్‌లో బస్సులు తిరిగేందుకు జూన్ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు తిరిగేందుకు అనుమతి ఉంది.

కొత్త రూల్స్ ప్రకారం తెలంగాణలో మొత్తం 10460 బస్సుల్లో 6082 బస్సులు ఇప్పుడు తిరిగి రోడ్డెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బస్సులో సీట్ల మధ్య గ్యాప్ ఉండాలని చెప్పింది. ఐతే... దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో సీట్ల మధ్య గ్యాప్ ఉండాలంటే... టికెట్ల రేట్లను 33 శాతం పెంచాల్సి వస్తుందని అధికారులు చెప్పడంతో... మొత్తం సీట్లలో ప్రయాణికుల్ని కూర

 • TSNews
  సీట్లలో ప్రయాణికుల్ని కూర్చోనివ్వాలని కేబినెట్‌లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా సోషల్ డిస్టాన్సింగ్‌కి విరుద్ధమైన నిర్ణయమే అయినప్పటికీ... ప్రజలపై ఛార్జీల భారం పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
  
  ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని అనుమతించాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి ఇప్పటికీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన బాధ్యత ప్రజలదేననీ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ... అందరూ క్షేమంగా ఉండేలా అందరూ ప్రయత్నించాలని ప్రభుత్వం కోరింది. 
TSNews

May 18 2020, 21:23

హరితహారం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి అల్లోల సమీక్ష

హైదరాబాద్
By Sridhar Dasari

   జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఆరవ విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు.
 
  గత అనుభవాలతో ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సోమవారం అరణ్యభవన్‌లో ఆరవ విడత హరితహార కార్యక్రమాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. గతంలో నాటిన మొక్కలు వాటి సంరక్షణ, వేసవి కాలంలో మొక్కలను కాపాడుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు గ్రీన్ ఫ్రైడే కార్యక్రమం, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరవ విడత తెలంగాణ హరితహార కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 3.59 కోట్ల మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచామన్నారు.
 
ప్రతి గ్రామం, మున్సిపాలిటీలలో నర్సరీలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో నర్సీరల్లో మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పీఆర్ అండ్ ఆర్డీ పరిధిలోని నర్సరీల్లో 21.16 కోట్ల మొక్కలను పెంచారన్నారు. మొత్తగా 24.74 కోట్ల మొక్కలు సిద్ధగా ఉంచామని వెల్లడించారు. ఇందులో అటవీశాఖ తరపున హరితహార కార్యక్రమంలో భాగంగా నాటే పెద్ద మొక్కలు 2.16 కోట్లు కాగా, కంపాలో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణకు 1.42 కోట్ల పెద్ద మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమం నాటికి పెద్ద ఎత్తున చింత మొక్కలను పెంచాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధ్వర్యంలో 24.50 లక్షలు, గ్రామ పంచాయతీ నర్సరీల్లో 81.69 లక్షల చింత మొక్కలను పెంచామన్నారు.
 
అదే విధంగా బీడీ ఆకుల సేకరణ త్వరితగతిన పూర్తి అయ్యేలా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శాఖ నుంచి వారు నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని, అటవీ శాఖ అధికారులు కూడా ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అందరూ భాగస్వామ్యులై ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.