దూసుకుపోతున్న మెట్రో
హైదరాబాద్ మెట్రోరైలు అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా ప్రస్తుతం5.6 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ మెట్రో రైలులో (Metro Rail) ఇప్పటివరకు 63 కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారని ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వేడుకలు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఇవాళ(గురువారం) జరిగాయి. మెట్రో ప్రయాణంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు ఈ స్థితికి మెట్రో వచ్చిందని చెప్పారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ప్రధానమంత్రి నేంద్రమోదీ మెట్రో రైల్ ప్రారంభించారని గుర్తుచేశారు. మెట్రోతో పాటు తన ప్రయాణం కూడా 7ఏళ్లు పూర్తి అయ్యిందని చెప్పారు. ఎల్ అండ్ టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు వెళుతుందని అన్నారు.
ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు మంచి సహకారం వచ్చిందన్నారు. రాబోయే మూడు నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు లాభాల్లోకి వస్తుందని వివరించారు. ప్రజా రవాణాపై చాలా ఒత్తిడి ఉందని అన్నారు. ఢిల్లీ మెట్రో 22 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. మెట్రో ప్రాజెక్టుల్లో ఢిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే.. హైదరాబాద్ మెట్రో మూడోస్థానంలో ఉందని తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో మెట్రో రైల్‌లో బ్యాక్ బోన్‌గా ఉండనున్నాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో చాలా ఏకో ఫ్రెండ్లీ సిస్టమని తెలిపారు.
కార్బన్ కమిషన్‌ను తగ్గించడంలో హైదరాబాద్ మెట్రో చాలా కీలకంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 7 నుంచి 8 శాతం ప్రయాణికులను మెట్రో తమ గమ్యస్థానాలకు చేర్చుతుందని అన్నారు. కరోనా టైంలో కొంత ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తర్వాత అన్ని మెట్రోల కంటే వేగంగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులు ప్రయాణించారని అన్నారు. ఇప్పుడు సాధారణంగా 4.67 లక్షల ప్యాసింజర్స్ ఉండగా అత్యధికంగా 5.6 లక్షల ప్యాసింజర్స్ వచ్చారన్నారు. అమీర్‌పేట్ మెట్రో ఉదయం సాయంత్రం సమయాల్లో చాలా ఎక్కువ రద్దీగా ఉందని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు కట్టుబడి ఉందని తెలిపారు
గత పదేళ్లలో ఏ మాత్రం విస్తరణ జరగకపోవడంతో హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొదటి స్థానంలో ఢిల్లీ (415 కిలోమీటర్లు), రెండో స్థానంలో బెంగళూరు (74 కిలోమీటర్లు) ఉన్నాయని చెప్పారు. అక్కడి ప్రభుత్వాలు చొరవ తీసుకోవడంతో మెట్రో విస్తరణ పెద్దఎత్తున జరిగిందన్నారు. మనవద్ద 69 కిలోమీటర్ల వరకే చేపట్టామని, విస్తరణ గురించి వెంటనే పట్టించుకోకుంటే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభించి ఏడేళ్లయిన సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి రసూల్‌పురాలోని మెట్రో భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలును నడిపించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. మొదటి దశ సమయంలో మెట్రో వద్దని చాలామంది వ్యతిరేకించారని, ఇప్పుడు తమకంటే తమకు కావాలని పట్టుపడుతున్నారని తెలిపారు. మొదటి దశ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనలను స్వయంగా సమీక్షించారని చెప్పారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు పదిసార్లు తమతో సమీక్షలు నిర్వహించారన్నారు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రపంచంలోనే విజయవంతంగా మెట్రోను నడిపిస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
రెండో దశలో 116.4 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్లను ప్రతిపాదించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 6వ కారిడార్ (ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కి.మీ.) ప్రతిపాదనలు విడిగా రూపొందించామని, మిగిలిన 5 కారిడార్ల (76.4కి.మీ.) పనుల డీపీఆర్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో నవంబరు 4న కేంద్రానికి సమర్పించామని చెప్పారు. రెండు నెలల్లోపు కేంద్రం నుంచి అనుమతి రావచ్చని తెలిపారు. రెండో దశలో రైళ్ల సగటు వేగం గంటకు 35 కిలోమీటర్లు ఉంటుందని, దీన్ని నాగోల్-ఎయిర్‌పోర్ట్ లైన్‌లో పెంచే అవకాశం ఉందన్నారు. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లను ప్రతిపాదించామని, వాటిలో 4 స్టేషన్లు తగ్గించి వేగం పెంచుతామన్నారు. ప్రారంభంలో 3 కోచ్‌లతో రైళ్లను నడిపిస్తామని, తర్వాత 6 కోచ్‌లకు పెంచుతామన్నారు. ఫేజ్-1 అనుభవంతో పార్కింగ్, బస్‌బేలు, ఆటోల కోసం స్టేషన్ల గ్రౌండ్ లెవెల్‌లో స్థలాలు సేకరిస్తామన్నారు. రెండో దశ విస్తరణలో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం రూ.318 కోట్లుగా అంచనా చేశామని చెప్పారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు (30శాతం), కేంద్రం వాటా రూ.4,230 కోట్లు (18శాతం) కాగా, మిగ తా 48శాతం అంటే రూ.11,693 కోట్లను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ వంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు సేకరిస్తున్నామని ఎంవీఎస్ రెడ్డి వివరించారు. ఈ రుణాలపై 2 శాతం వడ్డీ ఉంటుందన్నారు. మిగతా 4శాతం అంటే రూ.1,033 కోట్ల పెట్టుబడిని పీపీపీ విధానంలో సమకూర్చుకుంటామని తెలిపారు.మొదటి దశలో భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ 9 శాతం నుంచి 10 శాతం ఉండటంతో నిర్మాణ సంస్థపై భారం పెరిగిందని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల పనులను జనవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇక్కడ మార్కెట్ ధర గజానికి రూ.23 వేలు ఉందని, తాము రూ.65 వేలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రోరైలు(Metro Rail) అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 5.6 లక్షల వరకు ప్రయాణిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో సుమారు రూ.14,132 వేల కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. 2017 నవంబర్ నుంచి ఎల్‌బీనగర్-మియాపూర్(LBnagar-Miyapur), జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 69.2 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. ఆరంభంలో హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ అధికారులు తీవ్రంగా కృషి చేసి ఆయా కారిడార్లలో పిల్లర్ల నిర్మాణానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు పకడ్బందీగా చేశారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
మెట్రోరైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నడుస్తూ అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలు వస్తుండటంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొవిడ్ కాలంలో ప్రయాణికుల సంఖ్య కొంతమేరకు తగ్గినా మళ్లీ పుంజుకుంది.
కారిడార్-1లోని ఎల్‌బీనగర్‌లో రోజుకు 40 నుంచి 50 వేల మంది, కారిడార్ 3లోని రాయదుర్గంలో 35 నుంచి 40 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కారిడార్-2 జేబీఎస్-ఎంజీబీఎస్‌లో తక్కువ మొత్తంలో ఉంటున్నారని, ఈ మార్గంలో రోజులో గరిష్ఠంగా 25 వేలు దాటడం లేదని పేర్కొంటున్నారు. వచ్చే మూడేళ్లలో 80 కోట్ల మందికి చేరేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు.
Nov 29 2024, 09:20