గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు కుప్పకూలిన 10 షేర్లు
అదానీ గ్రూప్ ఛైర్మన్.. దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత ఇప్పుడు మరోసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. అదానీతో పాటు మరో ఏడుగురిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. దీంతో.. అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. గురువారం సెషన్లో చాలా షేర్లు 20 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఆయనకు ఒక్కరోజే దాదాపు రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లింది.
భారత స్టాక్ మార్కెట్లను గతేడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కుదిపేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అదానీ గ్రూప్‌పై బాంబ్ పేల్చగా.. అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కొద్ది రోజులు భారీగా పతనమయ్యాయి. ఇదే విధంగా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలు నమోదు చేశాయి. ఆ దెబ్బ నుంచి అదానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి పిడుగు పడింది. ఈసారి గౌతమ్ అదానీపై ఏకంగా అమెరికాలో కేసు కూడా నమోదైంది. లంచాలు ఇవ్వడంతో పాటు.. ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి మోసం పేరిట నిధుల సేకరణకు పాల్పడ్డారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు ఆయన దగ్గరి బంధువు సాగర్ అదానీ మరో ఏడుగురిపై కేసు నమోదైంది.
ఈ కారణంతో అదానీ గ్రూప్ షేర్లు అన్నీ ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. ఉదయం 10.15 గంటల సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పడిపోగా.. నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది.
అదానీ గ్రూప్ స్టాక్స్ విషయానికి వస్తే.. హోల్డింగ్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ అన్నీ 20 శాతం పడిపోయాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్ స్టాక్స్ కూడా ఇంట్రాడేలో 20 శాతం వరకు నష్టపోయి ప్రస్తుతం 15 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్ 15 శాతం పతనమైంది. ఏసీసీ, ఎన్‌డీటీవీ, అదానీ విల్మర్ స్టాక్స్ ఒక దశలో 15 శాతానికిపైగా పడిపోయి ఇప్పుడు 10 శాతానిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే అదానీ సంపద కూడా క్షణాల వ్యవధిలోనే రూ. 1.06 లక్ష కోట్ల వరకు తగ్గింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఆయన సంపద 12.6 బిలియన్ డాలర్లు తగ్గి మొత్తం 57 బిలియన్ డాలర్లతో ఏకంగా 25వ స్థానానికి పడిపోయారు.
అదానీ దాని సబ్సిడరీలు 20 ఏళ్లలో 2 బి.డాలర్లకుపైగా లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు దాదాపు 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తర్వాత.. అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి.. నిధులు సేకరించే ప్రయత్నం చేసిందని తెలిపారు. మరోవైపు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీపై మరో కేసు నమోదు చేసింది. అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. దీనిపై ఇప్పటివరకు అదానీ గ్రూప్ ఏం స్పందించలేదు.
గతేడాది యూఎస్ షార్ట్ సెల్లర్.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్.. తమ షేర్లను కృత్రిమంగా పెంచుకొని ఇన్వెస్టర్లను మోసం చేసిందని సంచలన రిపోర్ట్ విడుదల చేయగా.. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ అప్పట్లో ఏకంగా 150 బిలియన్ డాలర్లకుపైగా పతనమైంది.
Nov 21 2024, 11:01