రేవంత్ ను టార్గెట్ చేసిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆరెస్సెస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేసారు. శినసేన - జనసేన సిద్దాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు. అదే సమయంలో తొలి సారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేసారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రోజులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠా ప్రజలు.. ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ థాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు. శివసేన - జనసేన రెండు ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్దంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర భవిష్యత్ కు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతీ సభలోనూ వివరించారు.
తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేసారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ గా పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్.. అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతీ నెలా ఇస్తామని చెప్పిన ఆర్దిక సాయం ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవటం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. కేంద్రం, ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు. పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ఇక, పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శల పైన కాంగ్రెస్ నేతలు కౌంటర్ కు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి.
Nov 18 2024, 12:43