ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగ మంచు రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో సమీప వాహనాలు కూడా కనిపించని దుస్థితి నెలకొంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, నగరంలో వాయునాణ్యత సూచీ 428కి చేరడంతో.. ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుండటంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయబోతుంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- 4 కింద మరిన్ని నిబంధనలను ఈరోజు (సోమవారం) ఉదయం 8గంటల నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగరంలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా ఇతర (భారీ) వాహనాలకు ప్రవేశాన్ని నిలిపివేయాలని సీఏక్యూఎం ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులకే పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పింది.
ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించినప్పటికి.. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు దాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం ఆతిశీ వెల్లడించారు.
అలాగే, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆఫీసులన్నీ 50శాతం ఆక్యూపెన్సీతో పని చేసేలా చూడాలని.. మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఏక్యూఎం సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని చెప్పుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వాలు కాలేజీలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది.
Nov 18 2024, 09:46