NLG: గ్రూప్-3 పరీక్షలకు జిల్లాలో 88 పరీక్ష కేంద్రాలు
నల్లగొండ: ఈ నెల 17 ,18 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు నల్గొండ జిల్లాలో 88 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.
బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి హైదరాబాద్ నుండి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై సమీక్ష సందర్భంగా నల్గొండ జిల్లాలో గ్రూప్-3 ఏర్పాట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తూ నల్గొండ జిల్లాలో 28353 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, ప్రశ్నాపత్రాలు భద్రపరిచే స్టాంగ్ రూమ్ లను నోడల్ అధికారులు సందర్శించడం జరిగిందని, పరీక్షకు 15 రూట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు.
పరీక్షలు నిర్వహించే 17, 18 తేదీలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను అదే విధంగా అవసరమైనన్ని ఆర్టిసి బస్సులు నడపాలని ఆర్ టి సి అధికారులను ఆదేశించడం జరిగిందని, ఈ నెల 14న పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు, పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు గురువారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పరీక్షకు 2 రోజుల ముందు మరో సారి స్ట్రాంగ్ రూమ్ లు సందర్శించాలని,రవాణా సౌకర్యం,తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని.. అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, బయోమెట్రిక్ కోసం 9 మంది అధికారులను నియమించామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సామాజిక, ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, ధాన్యం సేకరణ, నర్సింగ్ పారామెడికల్ కళాశాలలో మరమ్మతులు, సంసిద్ధత తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయి నుండి డిజిపి జితేందర్ రెడ్డి పాల్గొనగా, జిల్లా నుండి అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.
Nov 15 2024, 16:07