రాం గోపాల్ వర్మకు షాక్
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాం గోపాల్ వర్మ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే రాంగోపాల్ వర్మ పైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన, లోకేష్, నారా బ్రాహ్మణి పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇక ఈ పోస్టులపైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాంగోపాల్ వర్మ చంద్రబాబును పదేపదే టార్గెట్ చేశారు. ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును పదేపదే టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్ ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసిపి కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న వారి భరతం పడుతున్నారు.
రాం గోపాల్ వర్మకు పోలీసుల షాక్
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కి కూడా షాక్ ఇచ్చి ఆయన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం పైన రామ్ గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో అన్నది తెలియాల్సి ఉంది.
Nov 15 2024, 09:59