NLG: 'వివోఏ లకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలి'
నల్లగొండ: వివోఏ లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన రూ.20వేల వేతన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఐకెపి వివోఏల ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 48 గంటల కలెక్టరేట్ ధర్నాలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ త్రిపాఠి, డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళ సాధికారత కోసం ప్రభుత్వ పథకాల అమలు కోసం శ్రమిస్తున్న ఐకెపి వివోఏలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 20 వేల వేతనం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేస్తున్న సందర్భంగా మాకు మద్దతి ఇచ్చి, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, సీతక్క లు ముఖ్యమంత్రిగా, పిఆర్ మినిస్టర్ గా ఉన్నారని, అందుకోసం వెంటనే వి ఓ ఏ ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
బకాయి ఉన్న స్త్రీ నిధి ఇన్సెంటివ్, గ్రామ సంఘం నుంచి ఇవ్వవలసిన 3 వేలు వెంటనే ఇవ్వాలని కోరారు. అర్హత కలిగిన వివోఏ లను సీసీ లుగా ప్రమోషన్ ఇవ్వాలని, సెర్ప్ ద్వారా గుర్తింపు కార్డులు, యూనిఫామ్, 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.
సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పొడిచేటి సులోచనలు మాట్లాడుతూ.. వివోఏలు ఎంత కష్టపడి పనిచేసినా టార్గెట్ల పేరుతో సీసీ లు, ఏపీఎం లు వేధిస్తున్నారని, వివోఏ లకు సంబంధం లేని ఆన్లైన్ పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీలు చేస్తున్న తప్పుల వల్ల అనేక మంది విఓఏ లకు వేతనాలు సకాలంలో రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివిధ కారణాల చేత తొలగించిన వివోఏ లందరినీ వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు జిల్లా లలిత, ఎం.మంగమ్మ, కె.రేణుక, నగేష్,ఆర్ బాలకృష్ణ ,అహల్య, నాగమణి, పద్మావతి, సువర్ణ, పద్మ, సుమీల, పుష్పలత, ఆర్.బి నాయక్ సైదులు,తదితరులు పాల్గొన్నారు.
Nov 14 2024, 17:41