నేడు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గురువారం విజయనగరం జిల్లా (Vizianagaram Dist.,)లో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి నెల్లిమర్ల సమీపంలోని దత్తా ఎస్టేట్స్‌కి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుర్ల వెళ్లి డయేరియా బాధితులను (Diarrhea victims) పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా గుర్ల మండలంలో డయేరియా ప్రబలిన అంశాన్ని కొద్దిరోజులుగా వైసీపీ రాజకీయం చేస్తోంది. వేర్వేరు కారణాలతో మృతిచెందిన వారికి డయేరియాను ఆపాదిస్తోంది. 11 మంది మృత్యువాత పడ్డారని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని అహేతుకంగా విమర్శించేందుకు ఏకంగా గుర్ల గ్రామానికి గురువారం వస్తున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఒక్కరు మాత్రమే డయేరియాతో మృతిచెందినట్టు స్పష్టంచేసింది. వైసీపీ మాత్రం జిల్లాలో ఏదో జరిగిపోతోందని, అందుకు ప్రభుత్వమే కారణమని అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ వైఫల్యం అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు భూగర్భ జలాలు కలుషితమే డయేరియాకు కారణమని అధికారుల నివేదికలో తేలింది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. ఈ తక్కువ వ్యవధిలో అద్భుతాలు చేసేయగలదా అన్న విషయాన్ని వైసీపీ విస్మరిస్తోంది. ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ బాధితులను పరామర్శించారు. ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు వంటి విషయాలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. దీనిని ఖండించేందుకే జగన్ పనిగట్టుకుని జిల్లాకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నాడు పాలనలో వైఫల్యం చెంది ఇప్పుడు బాధితులను ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని కూటమి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎన్నో రకాల విధ్వంసాలు, అపచారాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా నాడు సీఎం హోదాలో ఉన్న జగన్ జిల్లా వైపు కనీసం చూడలేదు. రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన రామతీర్థంంలో బోడికొండపై ఉన్న కోదండరామాలయంలోని విగ్రహాలను 2020 డిసెంబరు 28న అగంతుకులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. అప్పటి ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలయాన్ని సందర్శించారు. వివిధ పీఠాధిపతులు సందర్శించి ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ధార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. ఇంత పెద్ద ఘటన జరిగినా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉన్నా సీఎం హోదాలో ఉన్న జగన్ ఇటువైపుగా చూడలేదు. కేవలం కేసును సీబీ సీఐడీకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కాగా గుర్ల డయేరియా అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని జగన్ భావించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం జిల్లా ప్రజలను డయేరియా వణికిస్తోంది. అనేక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. తాగునీరు కాలుష్యమవుతోంది. ఈ కారణాల వల్లే డయేరియా ప్రబలుతోందని వైద్యులు సైతం నిర్ధారించారు. ఐదేళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధిని విస్మరించిన కారణంగానే ఈ దుస్థితి నెలకొందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గుర్లలో డయేరియా విజృభించడం జిల్లా, రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. గజపతినగరం మండలంలోని కెంగువ, దత్తిరాజేరు మండలంలోని దాసరిపేట, కన్నాం, గుచ్చిమి వంటి గ్రామాల్లోనూ డయేరియా కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్ధితిలో జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందితోపాటు సచివాలయం ఉద్యోగులు ఇంటింటా వెళ్లి ఎవరికైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారా అంటూ అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఐదేళ్లూ వైసీపీ పాలనలో పంచాయతీలను పూర్తిగా గాలికి వదిలేశారు. గతంలో టీడీపీ హయంలో గ్రామాల్లో మంచి నీటి పరీక్షలు నిర్వహించేవారు. బోరు లేదా రక్షిత నీటి పథకాలకు చెందిన నీరు తాగవచ్చా? లేదా అనేది ప్రజలకు చెప్పేవారు. వైసీపీ హయంలో మంచినీటి పరీక్షలు ఎక్కడా నిర్వహించలేదు. ఆ కిట్లు కూడా మూలకు చేర్చారు. అలాగే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను కూడా విస్మరించంతో గ్రామాల్లో పారిశుధ్యం తగ్గింది. ఆ ఫలితం నేడు కనిపిస్తోందనేది టీడీపీ నాయకుల మాట.
Oct 24 2024, 15:56