సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
పాఠశాలల గదుల్లో పేలుడు పదార్ధాలు ఉంచామని, మంగళవారం ఉదయం 11 గంటలలోపు స్కూళ్లను ఖాళీ చేయాలని దుండగలు ఈ-మెయిల్స్‌లో హెచ్చరించినట్టు చెబుతున్నారు.
బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు చట్టాల్లో మార్పులు తెస్తామని కేంద్రం హెచ్చరిస్తున్నా బాంబు బెదిరింపు కాల్స్ (Bomb threat calls) ఆగడం లేదు. ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో గత ఆదివారం జరిగిన పేలుడు సంఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా పలు సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు (CRPF schools) బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో రెండు సీఆర్‌పీఎఫ్ స్కూళ్లు ఢిల్లీలో ఉండగా, ఒకటి హైదరాబాద్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. సోమవారం రాత్రి ఈ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి.
ముందు జాగ్రత్త చర్యలుగా ఢిల్లీ పోలీసులు సీఆర్‌పీఎఫ్ పాఠశాలల వెలువల భద్రతను పెంచారు. తమిళనాడులోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఆయా పాఠశాలలను సీఆర్‌పీఎఫ్ అప్రమత్తం చేసింది. పాఠశాలల గదుల్లో పేలుడు పదార్ధాలు ఉంచామని, మంగళవారం ఉదయం 11 గంటలలోపు స్కూళ్లను ఖాళీ చేయాలని దుండగలు ఈ-మెయిల్స్‌లో హెచ్చరించినట్టు చెబుతున్నారు. డీఎంకే మాజీ నేత జాఫర్ సిద్ధిఖ్‌ని ఎన్‌సీబీ, ఆ తర్వాత ఈడీ అరెస్టు చేయడాన్ని మెయిల్ పంపిన వ్యక్తి ప్రస్తావించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ మెయిల్‌తో ఢిల్లీలోని రోహిణి ఏరియాలో జరిగిన పేలుడుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. పోలీసుల తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్ధాలు లేకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది.
మరోవైపు, ఆదివారం ఉదయం ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ముమ్మరంగా తనిఖీలు సాగించడంతో పాటు సీసీటీవీ కెమెరాలతో నిఘా, ఎన్ఎస్‌జీ రోబోలను మోహరించారు. అక్టోబర్ నెలలో పలు విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు రావడాన్ని కూడా సీరియస్‌గా పరిగణిస్తున్నారు. అక్టోబర్ 4న బెంగళూరులోని మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దానికి ముందు తొమ్మిది విద్యాసంస్థలకు బాంబులు పెట్టామంటూ ఈ-మెయిల్స్ వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో ఇవి ఉత్తుత్తి బెదిరింపులే అని తేలాయి.
Oct 23 2024, 13:01