వాట్సప్ ద్వారా పౌర సేవలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల కోసం ఇకపై గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. ప్రజలకు పౌరసేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారమే ఒక్క క్లిక్ ద్వారా పౌర సేవలను అందించేలా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారు. వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం మెటాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ ఎంవోయూ చేసుకున్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్.. వాట్సప్.. ఏబీసీడీలు రాని వారికి కూడా వీటిపై అవగాహన ఉంటోంది. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా .. వాట్సప్ అకౌంట్ ఉండే పరిస్థితి నేటి జనరేషన్‌ది. అయితే ఇలాంటి వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పౌర సేవలను మరింత సులభతరంగా అందించేందుకు గానూ.. ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, వాట్సప్ ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. త్వరలోనే మెటా టెక్నాలజీ ద్వారా పౌర సేవలను ఒక్క క్లిక్ ద్వారా అందిస్తామని నారా లోకేష్ ఒప్పందం అనంతరం ట్వీట్ చేశారు.
ఇక ఈ ఒప్పందం ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని ప్రభుత్వం అందించే ధ్రువీకరణ పత్రాలు.. కరెంట్ బిల్లుల దగ్గర నుంచి ఇంటి పన్నులు, నల్లా పన్ను, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల వరకూ అన్ని పౌరసేవలనూ వాట్సప్ ద్వారా ఒక్క క్లిక్‌తో అందించేందుకు ఏపీ ప్రభుత్వం మెటాతో కలిసి అడుగులు వేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పలువురు విద్యార్థులు, యువత ఈ సమస్యను నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సకాలంలో సర్టిఫికేట్లు అందక ఇబ్బందులు పడుతున్నామని.. టెక్నాలజీ సాయంతో అన్ని పనులూ ఇంటివద్దకే అందుతున్నప్పుడు.. పౌరసేవలను కూడా ఇలాగే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఆ రకంగా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు.
ఇక ఇచ్చిన హామీ ప్రకారమే వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. వాట్సప్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలకు మాతృసంస్థ మెటా. ఈ నేపథ్యంలో మెటా యాజమాన్యంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ద్వారా.. మెటా ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇకపై సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందే వీలుంటుంది, అలాగే ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది. మెటాతో ఒప్పందం చారిత్రాత్మకమైన మైలురాయిగా అభివర్ణించిన నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగానే మొబైల్‌లోనే సర్టిఫికెట్లు అందిస్తామని అన్నారు.
Oct 22 2024, 16:30