పూరీలో ఘోర అపచారానికి కారకులెవరు? అన్ని వేళ్లూ వారివైపే.. విచారణకు కమిటీ!
ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది. ఒకే రోజున స్వామివారికి మూడు వేడుకలు నిర్వహించాల్సి రావడంతో రథయాత్ర ఆలస్యంగా మొదలైంది. జులై 7న ఆదివారం సాయంత్రం కావడంతో కొద్ది దూరం వెళ్లిన రథాలు నిలిపివేసి.. మర్నాడు సోమవారం ఉదయం మళ్లీ రథాలను లాగుతూ పెంచిన తల్లి గుండిచా మందిరానికి చేర్చారు. 53 ఏళ్ల తర్వాత పూరీలో ఒకే రోజున మూడు వేడుకలు జరగడంతో భక్తులు పోటెత్తారు.
పూరీ జగన్నాథుడి రథయాత్రలో బలభద్రుని పొహండి వేడుకలో జరిగిన ఘోర తప్పిదంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అపచారం జరగలేదని వారు ఆవేదనకు గురవుతున్నారు. రథం నుంచి గుండిచా మందిరంలోకి తరలిస్తుండగా బలభద్రుని విగ్రహం ఒరిగి.. సేవాయత్‌లపై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. అయితే, విగ్రహం ఒరిగిపోవడానికి సేవలతో ప్రమేయం లేని యువ సేవాయత్‌లు ఎక్కువ సంఖ్యలో రథంపై గుంపుగా ఉండడమే కారణమా? లేక చారమాల సక్రమంగా కట్టలేదా? అనేది ప్రస్తుతం
సోమవారం సాయంత్రం పెంచిన గుండిచా ఆలయానికి చేరుకున్న చతుర్దామూర్తులు జగన్నాథ, బలభద్ర, దేవి సుభ్రద, సుదర్శనులకు మంగళవారం రాత్రి పొహండి జరిగింది. అయితే, సేవాయత్‌లు ఈ ఉత్సవాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల నుంచి సంభావన అందుకోవడానికి సేవాయత్‌లకు పొహండి గొప్ప అవకాశం. దీంతో సేవలతో ప్రమేయం లేనివారు రథాలపై గుంపులుగా పొగయ్యారు. పొహండి తిలకించడానికి వచ్చిన భక్తులతో గుండిచా ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
తొలుత జగన్నాథుడు, సుదర్శనుని పొహండి జరిగిన తర్వాత బలభద్రున్ని గుండిచా సన్నిధికి తీసుకెళ్లే సమయంలో రథంపై ఉన్న సేవాయత్‌లు ఎక్కువ సమయం తీసుకున్నారు. అలాగే, స్వామి వెనుకవైపు ‘చారమాల’ సక్రమంగా కట్టలేదు. రథం నుంచి విగ్రహాల తరలింపు ఘట్టంలో వాటిని ఊపుతూ తీసుకెళతారు. చారమాల కట్టడంలో లోపం ఉంటే విగ్రహం ముందుకు ఒరిగిపోయి.. బరువు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో శ్రీక్షేత్ర, గుండిచా పొహండి వేడుకల్లో అనుభవం గలిగిన సేవాయత్‌లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక, ఘటన గురించి తెలిసిన వెంటనే.. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్‌లను సీఎం మోహన్ చరణ్ మాఝి పూరీకి పంపించారు. అక్కడకు చేరుకున్న మంత్రి హరిచందన్ రాత్రి 12 వరకు పూరీలో ఉండి.. పొహండి ముగిసే వరకు పరిస్థితి సమీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.
పొహండి ఘటనను జగన్నాథేచ్ఛగా పేర్కొన్నారు. ఇందులో సేవాయత్‌ల తప్పిదం తమ దృష్టికి రాలేదని, ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై విచారణకు జగన్నాథ ఆలయ యంత్రాంగం ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది. పూరీ రాజు గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్ నేతృత్వంలోని ఈ కమిటీలో అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆలయ డిప్యూటీ సూపరింటిండెంట్ సభ్యులుగా ఉన్నారు. పది రోజుల్లో ఈ కమిటీ నివేదికను అందజేయనుంది. విచారణలో భాగంగా డ్రోన్ ఫుటేజ్‌లను పరిశీలించి, రథంపై ఎవరున్నారు? ఏం జరిగింది? అనేది తెలుసుకోనుంది.
Jul 11 2024, 13:46