Srisailam: టన్నెల్ పనులకు పరుగులు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్ (శ్రీశైలం) నుంచి టన్నెల్ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వేగవంతానికి చర్యలు.. ఇన్‌లెట్ నుంచి సత్వర తవ్వకానికి కసరత్తు
జేపీ సబ్ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం పిలుపు
నవంబరులో ఔట్‌లెట్ నుంచి టన్నెలింగ్
బేరింగ్‌తోపాటు ఇతర పరికరాలకు ఆర్డర్లు
ఏకకాలంలో రెండువైపులా తవ్వకం
ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్ (శ్రీశైలం) నుంచి టన్నెల్ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది. ఇన్‌లెట్ వైపు నుంచి సీపేజీలు టన్నెల్ తవ్వకానికి ప్రధాన అవరోధంగా ఉండగా, ఔట్‌లెట్ వైపు గట్టి రాయి ఉండటం, మాటిమాటికీ బేరింగులు, బిట్లు దెబ్బతింటుండడంతో పనులు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో టన్నెల్ పురోగతిపై ఇటీవలే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తవ్వకం పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
ఔట్‌లెట్ (మన్నెవారిపల్లి-అచ్చంపేట) వైపు ఉన్న టీబీఎంలో బేరింగులు పాడైపోవడంతో.. కొత్త బేరింగులతోపాటు ఇతర పరికరాల కోసం ఆర్డర్లు పెట్టారు. ఈ పరికరాలన్నీ ఆగస్టుకల్లా చేరితే.. వీటిని బిగించి, నవంబరులో ఔట్‌లెట్ వైపు నుంచి టన్నెల్ తవ్వకం చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను అత్యంత ప్రాధాన్య జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. టన్నెల్ తవ్వకానికి గల అవరోధాలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సిఫారసులతో ఇప్పటికే రూ.50 కోట్లను వెనువెంటనే విడుదల చేశారు.
ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.3150 కోట్ల నుంచి రూ.4468 కోట్లకు సవరించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరడంతో త్వరలోనే దీనికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. ఇన్‌లెట్‌లో సత్వరం తవ్వకాలు ప్రారంభించాలని, నవంబరులో ఔట్‌లెట్ వైపు నుంచి ప్రారంభించి.. రెండువైపులా ఏకకాలంలో తవ్వకం కొనసాగించాలని నిర్ణయించారు.
రెండువైపులా టన్నెల్ తవ్వకం ప్రారంభిస్తే.. నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్ పూర్తి చేయగలమని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సంకేతాలిచ్చింది.
Jun 27 2024, 12:46